పి ఎస్ వి గరుడ వేగ మూవీ రివ్యూ - 2

Update: 2017-11-03 10:45 GMT

నటీనటులు: రాజశేఖర్, శ్రద్ద దాస్, పూజ కుమార్, సన్నీ లియోన్, కిషోర్

మ్యూజిక్ డైరెక్టర్: శ్రీచరణ్ పాకాల, భీమ్స్

సినిమాటోగ్రఫీ: అంజి

ప్రొడ్యూసర్: జ్యోస్టార్

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు

సీనియర్ హీరో రాజశేఖర్ యాంగ్రీ యంగ్ మ్యాన్‌ ఇమేజ్‌తో అటు యాక్షన్ చిత్రాలను... ఇటు కుటుంబ కథా చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు. రాజశేఖర్ కెరీర్ లో ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలేవీ తెరకెక్కకపోయినప్పటికీ...అతని నుండి మంచి కాన్సెప్ట్ కథలతో సినిమాలు వచ్చేవి. చాన్నాళ్లుగా విజయానికి దూరమైన రాజశేఖర్ సినిమాలకు భారీ గ్యాప్ ఇచ్చాడు. తన సినిమాలకు సరైన నిర్మాతలు దొరక్క తానె సొంతంగా సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకున్నాడు. అంతేకాకుండా సీనియర్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతుంటే రాజశేఖర్ మాత్రం చేతులు ముడుచుకుని కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు హీరోగా చక్రం తిప్పి సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా ఒక రేంజ్ లో ఉన్న జగపతి బాబు వలే రాజశేఖర్ కూడా స్టార్ హీరోల సినిమాలల్లో విలన్ రోల్స్ కూడా చెయ్యడానికి సిద్ధపడిన సమయంలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు, రాజశేఖర్‌ను కలిసి ఈ పి ఎస్ వి గరుడ వేగ కథ వినిపించడం దాన్ని రాజశేఖర్ ఒకే చెయ్యడం జరిగిపోయింది. ఈసినిమాని భారీ బడ్జెట్‌తో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. సినిమా మొదలైన చాల కలం తరవాత ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. LBW, చందమామ కథలు, గుంటూరు టాకీస్ వంటి డిఫ్రెంట్ కథలతో ఆకట్టుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు రాజశేఖర్ ని ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నాడా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలగదానికి కారణం మాత్రం గరుడ వేగ థియేట్రికల్ ట్రైలర్. గరుడ వేగ ట్రైలర్ ఆసాంతం హాలీవుడ్ స్టాండర్డ్స్ తో కనబడం... రాజశేఖర్ కూడా కొత్తగా ఈ సినిమాలో కనిపించడంతో...... ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి మొహంలో రౌద్రం, ఆవేశంతో ప్రేక్షకులను మెప్పించగలిగిన రాజశేఖర్ ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించాడో అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ లో చంద్రశేఖర్(రాజశేఖర్) ఎన్ఐఏ ఆఫీసర్‌గా పని చేస్తుంటాడు. తనకి తన వృత్తి మీదున్న ప్రేమతో ఇంట్లో భార్యబిడ్డల్ని కూడా పెద్దగా పట్టించుకోడు చంద్రశేఖర్. భార్య పిల్లల్తో గడపడానికి సమయం కేటాయించలేని వాడితో కాపురం చెయ్యడం కస్టమని, అతని భార్య స్వాతి(పూజ కుమార్) అతనినుండి విడిపోవాలనుకుంటుంది. అయితే ఒక రోజు సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా వేగంగా వెళుతున్న చంద్రశేఖర్ కారుకు యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ చేసిన ప్రొఫెషనల్ షూటర్‌తో చంద్రశేఖర్ గొడవపడతాడు. అయితే అదే వ్యక్తి ఒక ముసలామెను చంపి... నిరంజన్(ఆదిత్) అనే మరో వ్యక్తిని చంపడానికి వెంబడిస్తున్నాడని చంద్రశేఖర్‌ కనిపెడతాడు. దీంతో ఆ షూటర్ ని అరెస్ట్ చేయాలని వెళ్లిన చంద్రశేఖర్ అనుకోకుండా ఆ షూటర్‌ను చంపేస్తాడు. ఆ షూటర్ నిరంజన్‌ను చంపాలని ప్రయత్నించడం వెనుక పెద్ద హస్తమే ఉంటుంది. అసలు ఈ నిరంజన్ ఎవరు..? పలుకుబడి ఉన్న వ్యక్తులు నిరంజన్‌ను చంపాలనుకోవడానికి గల కారణాలు ఏంటి? చంద్రశేఖర్ ఈ కేసు మిస్టరీని ఎలా ఛేదించాడు?అనే విషయాలు వెండితెరపై చూసి తెలుసుకుంటే బావుంటుంది.

నటీనటుల పాత్ర :

భారీ గ్యాప్ తర్వాత రాజశేఖర్ ఈ సినిమాలో తన నట విశ్వ రూపాన్ని చూపించాడు. ఈ సినిమాలో రాజశేఖర్ పెరఫార్మెన్స్ ప్రశంసించే విధంగా ఉంది. ఎన్ఐఏ ఆఫీసర్‌గా యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీసాడు. లుక్స్ పరంగా కాస్త వయసున్న వ్యక్తిలా రాజశేఖర్ కనబడుతున్నప్పటికీ.. ఈ సినిమాలో తన పాత్రకి వయసుకి పెద్దగా సంబంధం ఉన్నట్టుగా కనబడదు. యాంగ్రీ లుక్స్ లోను, ఎనర్జీ పెరఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజ కుమార్ కి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కలేదు గాని... రాజశేఖర్ భార్యగా ఉన్నంతలో పర్వాలేదనిపించింది. సన్నీ లియోన్ ఐటెం సాంగ్ లో రెచ్చిపోయింది. ఈ పాటలో సన్నీ అందాలు అందరిని ఆకట్టుకుంటాయి. ఇక ఆదిత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సినిమా సెకండ్ హాఫ్‌లో విలన్ పాత్రలో కనిపించిన కిషోర్ మెప్పిస్తాడు. పృధ్వీ, ఆలీ కామెడీ ఈ సినిమాకి పెద్దగా హెల్ప్ చెయ్యలేకపోయింది. మిగిలిన నాజర్, పోసాని కృష్ణమురళి తమ పాత్రల పరిధుల్లో నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

పి ఎస్ వి గరుడ వేగ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు హాలీవుడ్ సినిమాలను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించినట్లుగా యాక్షన్ సన్నివేశాల్లో కనబడుతుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న అణు పరీక్షలు అనే ఓ అంశాన్ని దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు వీలైన మేర అర్థమయ్యేలా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. రాజశేఖర్ ని తనకి ఎలా కావాలో అలా మలుచుకున్నారు దర్శకుడు. రాజశేఖర్ ని ఎంత పవర్ ఫుల్ గా చూపెట్టాలి అంత పవర్ ఫుల్ పాత్రలో చూపెట్టాడు. తను అనుకున్న పాయింట్ ఎక్కడా డీవియేట్ అవ్వకుండా.. రొటీన్ ఫార్ములాకు దూరంగా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ కథలో లీనమైన ప్రేక్షకుడికి అవి పెద్దగా కనిపించవు. సినిమా మొదటిభాగం రేసీ స్క్రీన్‌ప్లేతో నడిచింది. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథను రివీల్ చేసే ప్రయత్నం చేసాడు దర్శకుడు. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌ను సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాడు. కొన్ని సన్నివేశాలు సినిమా స్పీడును తగ్గించేవిగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో కామెడీని వెతుక్కోవలసిన పరిస్థితి ఎదురైంది. దర్శకుడు కామెడీ ని చాలా లైట్ తీసుకున్నాడు.

ఇక టెక్నీకల్ గా... మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాకి ప్రధానమైన బలం... సినిమాకి ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్. యాక్షన్ సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ ని చితక్కొట్టేశాడు మ్యూజిక్ డైరెక్టర్. శ్రీచరణ్ పాకాల, భీమ్స్ కలిసి అందించిన సంగీతం పర్వాలేదు. ఉన్న రెండు పాటలు ఓకే ఓకే గా వున్నాయి. సన్నీ లియోన్ పాట మాత్రం మాస్ ఆడియన్స్ ని ఆకర్షిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా రిచ్‌గా ఉంది. యాక్షన్ సన్నివేశాలను చాలా అందం అంటే.. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా తెరకెక్కించారు. ఎడిటింగ్ విషయానికి వస్తే పి ఎస్ వి కి ప్రధాన లోపం ఎడిటింగ్. అక్కర్లేని సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. వాటిని ఎడిటింగ్ లో లేపేస్తే సినిమా నిడివి తగ్గేది. కానీ ఎడిటింగ్ లో మాత్రం చాలా లోపాలున్నాయి. నిర్మాణ విలువలు మాత్రం మెచ్చుకోదగినవిగా వున్నాయి. సినిమా కథ సంగతి ఎలా వున్నా ఒక దర్శకుడిని నమ్మి ఇంత భారీ బడ్జెట్ సినిమా మీద పెట్టారంటే నిర్మాతలను అభినందించిచ్చు.

ప్లస్‌ పాయింట్స్‌: రాజశేఖర్, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌, యాక్షన్‌ సీన్స్‌, ఫస్ట్ హాఫ్

మైనస్‌ పాయింట్స్‌: స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కామెడీ, ఎడిటింగ్, సెకండ్ హాఫ్, సాగదీసే సన్నివేశాలు

రేటింగ్: 3.0/5

Similar News