పైసా వసూల్ మూవీ రివ్యూ

Update: 2017-09-01 09:10 GMT

నటీనటులు: బాలకృష్ణ, శ్రియ శరణ్, ముస్కాన్ సేథీ,కైరా దత్, అలీ

మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్

నిర్మాత: భవ్య క్రియేషన్స్

దర్శకత్వం: పూరి జగన్నాధ్

నందమూరి బాలకృష్ణ మంచి జోరు మీదున్నాడు. 30 ఏళ్ళ కుర్రాడిలా సినిమాలు యమా ఫాస్ట్ గా చేసేస్తున్నాడు. మంచి ఎనర్జీతో దూసుకుపోతున్న బాలకృష్ణ ఈ మధ్యన మంచి కథలను ఎంచుకుంటూ చాలా కేర్ ఫుల్ గా సినిమాలు చేస్తున్నాడు. 100 వ చిత్రాన్ని క్రిష్ డైరెక్టర్ గా చారిత్రక నేపధ్యం ఉన్న గౌతమీపుత్ర శాతకర్ణిని ఎంచుకుని హిట్ కొట్టడమే కాదు శెభాష్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత జోనర్ మార్చేశాడు. మళ్ళీ యాక్షన్ లోకి దిగిపోయాడు. అనుకోకుండా అనూహ్యంగా పూరి జగన్నాధ్ వంటి డైరెక్టర్ తో జత కట్టాడు. 101 సినిమాకి పూరి కి డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. అంటే ఇక్కడ పూరి జగన్నాధ్ తక్కువ డైరెక్టర్ అని కాదు. పూరి మార్క్ మేనరిజాన్ని బాలయ్య ఎలా యాక్సప్ట్ చేశాడా? అనే దాని మీద అనేక రకాల చర్చ జరిగింది. ఒకప్పుడు మంచి హిట్స్ ఇండస్ట్రీకి అందించిన పూరి జగన్నాధ్, ప్రస్తుతం వరసబెట్టి ప్లాప్ సినిమాలు ఇస్తున్నాడు. అదిగో అలాంటి టైంలోనే బాలకృష్ణ, పూరికి ఈ సినిమా చేసే ఛాన్స్ ఇవ్వడం అందరిని షాక్ కి గురి చేసింది. అందులోను పూరి జగన్నాధ్ చాలా రఫ్ అండ్ టఫ్ డైరెక్టర్ కావడం... బాలకృష్ణ కూడా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక దుందుడుకు స్వభావం ఉన్న వ్యక్తి కావడం వెరసి ఇద్దరి కాంబినేషన్ లో 'పైసా వసూల్' తెరకెక్కడం అన్నది 'పైసా వసూల్' స్టంపర్ విడుదల వరకు ఉన్న అనుమానాలు. ఇక బాలకృష్ణ ఎనర్జీని ఎలా వాడాలో అలా వాడేసి... తన మార్క్ మేనరిజాన్ని బాలయ్యలో చూపించి పూరి సక్సెస్ అయ్యాడు. ఇక యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా బాలకృష్ణ కూడా ఫుల్ ఎనర్జీ తో రెచ్చిపోయి డాన్స్ లు, ఫైట్స్ ఇరగదీసేసాడు. ,పైసా వసూల్, టీజర్, ట్రైలర్, ప్రోమో సాంగ్స్ లో బాలకృష్ణ డైలాగ్ డెలివరీ, యాక్షన్, డాన్స్ ఇలా అన్ని అక్కట్టుకునేలా కనబడుతున్నాయి. అలాగే బాలకృష్ణ ఈ పైసా వసూల్ లో ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నాడు. ఇంతకుముందే ,చెన్నకేశవరెడ్డి, గౌతమీపుత్ర శాతకర్ణి లతో జోడి కట్టిన శ్రియ తో, ముస్కాన్, కైరా అనే కొత్త భామలతో బాలయ్య ఆడి పాడాడు. అలాగే హీరోయిన్స్ అందాలు కూడా పైసా వసూల్ కి అదనపు ఆకర్షణలు. మరి 'పైసా వసూల్' సెట్స్ మీదున్నప్పటినుండి బాలకృష్ణతో సినిమా చెయ్యడం నా కల, ఈ పైసా వసూల్ తో అది తీరింది. బాలయ్యకి నేను పెద్ద అభిమానిని అంటూ పూరి పదే పదే చెప్పడం... అలాగే 'పైసా వసూల్' కి బాలయ్య హీరోయిన్స్ తో కలిసి ఫుల్ పబ్లిసిటీ చెయ్యడం వంటివాటితో సినిమాపై సహజంగానే అంచనాలు పెరిగేలా చేశాయి. అంతేకాకుండా సినిమాని జెట్ స్పీడుతో పూరి డైరెక్ట్ చెయ్యడము... దానికి బాలకృష్ణ కూడా ఫుల్ ఎనర్జీతో సహకరించడంతో సినిమా అనుకున్న టైం అంటే సెప్టెంబర్ 27 న మొదట పైసా వసూల్ రిలీజ్ డేట్ ఇచ్చారు. కానీ రికార్డు టైం అంటే ఒక నెల ముందే ఫినిష్ చేసి విడుదలకు రెడీ చెయ్యడం కూడా సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది. మరి వరుస హిట్స్ తో జోరుమీదున్న బాలయ్యకి, వరుస ప్లాప్స్ తో కెరీర్ గ్రాఫ్ దిగువున ఉన్న పూరి జగన్నాధ్ కి ఈ 'పైసా వసూల్' ఎలాంటి రిజల్ట్ నిచ్చిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

పైసా వసూల్ కథలో ఎక్కువ భాగం ఫ్లాష్ బ్యాక్ లోనే రన్ అవుతుంది. ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ (బాబ్ మార్లీ) తమ్ముణ్ణి ఇండియన్ రా ఏజెన్సీ మట్టుబెడుతుంది. అయితే తన తమ్ముణ్ణి చంపింది ఇండియన్ రా ఏజెన్సీ అని తెలుసుకున్న బాబ్ మార్లీ ఇండియన్ రా ఏజెన్సీ మీద పగబట్టి ఇండియాలో అరాచకాలకు శ్రీకారం చుడతాడు. రాజకీయనాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ విధ్వంసాలు సృష్టిస్తున్న బాబ్ మార్లీ ని ఎదుర్కోవాలంటే జీవితం అంటే భయం లేని వాడు ఒకడుండాలని....అలాంటి వాడి కోసం ఇండియన్ రా ఏజెన్సీ వెతుకులాట ప్రారంభిస్తుంది. అందులో భాగంగానే తేడా సింగ్(బాలకృష్ణ) వారి కంట పడతాడు. జీవితమంటే ఏ భయం లేకుండా, ఒక రౌడీ తరహాలో జీవిస్తున్న తేడా సింగ్ ని రా ఏజెంట్ గా నియమించడమే కాక బాబ్ మార్లీ మీదకి ఆయుధం గా ప్రయోగిస్తారు పోలీస్ లు. అయితే తేడా సింగ్ కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో (సారిక) శ్రియ ఎంట్రీ ఇస్తుంది. సారికకు డాన్ బాబ్ మార్లే నుంచి ప్రమాదం వచ్చి పడుతుంది. తేడా సింగ్ ఆమెను కాపాడటానికి ప్రయత్నిస్తాడు. ఆమెని రక్షించే క్రమంలోనే తేడా సింగ్ ఉరఫ్ బాలా, సారికతో ప్రేమలో పడతాడు. అసలు బాబ్ మార్లీ తమ్ముడు ఏం చేస్తే ఇండియన్ రా ఏజెన్సీ అతన్ని చంపేస్తుంది? అసలు ఈ తేడా సింగ్ ఎవరు? తేడా సింగ్ బాబ్ మార్లి ని ఎలా పట్టుకుంటాడు? తేడా సింగ్ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? తేడా సింగ్ సారిక ను ప్రేమిస్తాడు గాని పెళ్లి చేసుకుంటాడా? అసలు తేడా సింగ్ గ్యాంగ్ స్టర్ గా ఎందుకు మారాడు? అనే విషయాలను పైసా వసూల్ ని వెండితెర మీద వీక్షించి తెలుసుకుంటే బావుంటుంది.

నటీనటుల పనితీరు:

బాల‌కృష్ణ పెరఫార్మెన్స్ 'పైసా వసూల్' సినిమా మొత్తానికి హైలెట్. త‌న ఎన‌ర్జీ లెవ‌ల్స్ కు కుర్ర హీరోలు సైతం వాట్ ఏ ఎన‌ర్జీ అన‌క మాన‌రు. ప్ర‌తీ సీన్ లోనూ త‌న యాక్టింగ్, ఎన‌ర్జీ, కామెడీ టైమింగ్ అన్నింటిలోనూ బాల‌కృష్ణ ది బెస్ట్ అనిపించుకున్నాడు. అంతేకాదు పాట‌ల్లో త‌న డ్యాన్స్ చూస్తే బాల‌య్య‌కు ఏడాదికి ఏడాదికి అస‌లు వ‌య‌సు పెరుగుతుందా అన్న అనుమానం రాకుండా ఉండ‌దు. ఒక విధంగా చెప్పాలంటే సినిమా మొత్తాన్ని బాల‌కృష్ణ త‌న భుజాల‌పై వేసుకుని న‌డిపించాడ‌నే చెప్పుకోవాలి. ఇక హీరోయిన్స్ లో శ్రియ సారిక పాత్రకి చక్కగా సరిపోయింది. కానీ ఎక్కువ ప్రాధాన్యం లేకుండా పోయింది. అలాగే మిగతా హీరోయిన్స్ ముస్కాన్, కైరా దత్ లు కేవలం గ్లామర్ షో చెయ్యడానికి, పాట‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు త‌ప్ప పెద్ద‌గా వారి గురించి చెప్పాల్సిందేమీ లేదు. పూరీ జ‌గ‌న్ సినిమాలంటే అలీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కానీ గ‌త రెండు మూడు సినిమాలుగా అలీ ట్రాక్ ఏదీ స‌రిగా పేలడం లేదు. అందుకేనేమో ముందుగానే చెప్పారు, ఈ సినిమాలో అలీ క్యారెక్ట‌ర్ చేసే కామెడీకి పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వుతార‌ని. కానీ తీరా సినిమా చూశాక మాత్రం, అలీ ఏదో క్యామియో చేసిన‌ట్లు అనిపిస్తుంది త‌ప్ప కామెడీ మాత్రం ఎక్క‌డా ఉండ‌దు. సినిమాలో బాల‌కృష్ణ తప్ప మ‌రే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఆశించినా నిరాశ ప‌డ‌టం మాత్రం త‌ప్ప‌దు. మిగిలిన నటీనటులు ఎవ‌రికి వారు త‌మ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు బాగానే చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ముందుగా దర్శకుడు పూరి జగన్నాధ్ గురించి చెప్పుకోవాలంటే పూరి ,బాలకృష్ణ ని ఈ పైసా వసూల్ లో ఒక డిఫరెంట్ రోల్ లో చూపెట్టాలనుకుని అందులో 100 శాతం సక్సెస్ అయ్యాడు. హీరోను త‌నదైన స్టైల్ లో చూపించ‌డం, హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ను బాగా మ‌లచడంలో స‌క్సెస్ అయిన పూరీ క‌థ విష‌యంలో మ‌రోసారి త‌డ‌బ‌డ్డాడు. కథలో, కథనంలో పూరి మార్క్ కనబడలేదు. ఒక రొటీన్ స్టోరీ నే తీసుకుని కొత్తగా చూపెట్టడానికి ట్రై చేసి విఫలమయ్యాడు. పూరి డైలాగ్స్ కొన్ని థియేటర్స్ లో పేలినప్పటికీ.. సినిమా కి హైప్ తీసుకురావడంలో ఏ మాత్రం హెల్ప్ చెయ్యలేవు. తేడా సింగ్ గా బాల‌కృష్ణ ను ప్రెజెంట్ చేసిన విధానం, సినిమాకు రాసుకున్న డైలాగ్స్ త‌ప్పించి ఎక్కడా క‌నెక్ట్ అయ్యే సీన్ కానీ, అబ్బా ఈ సీన్ భ‌లేగుందే అనుకునే సీన్ కానీ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు సినిమా అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌లేదంటేనే సినిమా ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవ‌చ్చు. ఇక పైసా వసూల్ పాటల విషయానికొస్తే, అనూప్ రూబెన్స్ ఆకట్టుకునే సంగీతం పైసా వసూల్ కి ఇచ్చాడు. ఒకటి రెండు పాటలు బాగున్నాయి. బాలకృష్ణ గొంతు సవరించిన పాట 'మామ ఏక్ పెగ్ లా....' థియేటర్స్ లో నందమూరి ఫాన్స్ విజిల్స్ తో హోరెత్తించేస్తున్నారు. అయితే మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో డల్ అయ్యాడు. హెవీ యాక్షన్ సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ సీన్స్ కి తగ్గట్టుగా లేదు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే పైసా వసూల్ ప్రతి సీన్ ని రిచ్ గా చూపెట్టడంలో సినిమాటోగ్రఫీ పని తనం బావుంది. అలాగే ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపంచేలా వుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి

విశ్లేషణ:

పూరి జగన్నాధ్ డైరెక్టన్ లో బాలకృష్ణ అంటేనే పెద్ద షాక్. అలాంటిది వారి కాంబోలో సినిమా తెరకెక్కడం థియేటర్స్ లోకి రావడం యమా ఫాస్ట్ గా జరిగిపోయాయి. అయితే పూరి జగగన్నాధ్ పైసా వసూల్ అంటూ ఒక రొటీన్ కథకే కొత్త సోప్ వెయ్యడానికి ప్రయత్నించాడు. పూరి ఈ మధ్యన వరుస ప్లాప్స్ తో డీలా పడడం, డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకోవడం వంటి సమస్యల్లో ఉన్నప్పటికీ... బాలకృష్ణ సినిమా డైరెక్ట్ చెయ్యడం అనగానే ఎక్కడలేని ఉత్సాహం చూపించాడు. కానీ బాలకృష్ణ, పూరి మీద పెట్టుకున్న ఆశలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలయ్యాడంమే చెప్పాలి. ఒకప్పుడు పూరి సినిమా వస్తుంది అంటే అందులో హీరో చెప్పే డైలాగ్స్ కి, యాక్షన్ కి విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పూరి సినిమా అంటేనే ఆలోచించే పరిస్థితిని తెచ్చుకున్నాడు. అయితే హీరో బాలకృష్ణ మాత్రం ఈ పైసా వసూల్ కి 100 శాతం న్యాయం చేసాడు. బాలకృష్ణ వైపు నుండిచూస్తే బాలకృష్ణ ఈ సినిమాకి ప్లస్. డైరెక్టర్ ఎలా చెయ్యమంటే అలానే చేసి చూపించాడు. మంచి ఎనర్జీతో, డైలాగ్ డెలివరీతో మెప్పించాడు. మరి నన్ను కావాల్సినంత వాడుకో అని బాలయ్య, పూరికి చెప్తే పూరి మాత్రం రొటీన్ గానే ట్రై చేసాడు గాని కొత్తగా ఏం చెయ్యలేకపోయాడు. అలాగే బాలకృష్ణ ఇచ్చిన ఎనర్జీని వాడుకోవడంలో డైరెక్టర్ పూరి పూర్తిగా విఫలమయ్యాడు. ఇక పైసా వసూల్ లో పూరీ రాసుకున్న కొన్ని డైలాగులు థియేట‌ర్లో విజిల్స్ వేయిస్తాయి. 'న‌న్ను న‌మ్ముకో.. ఉన్నదంతా పెట్టుకో.. పైసా వ‌సూల్, డిపార్ట్‌మెంట్ ని ఏమైనా అనుకోండి కానీ న‌న్ను మాత్రం త‌క్కువ చేయ‌కండి. ఇగో కోసం అయినా వెళ్లి చంపేస్తా, ఫాలోయింగ్ ఉన్నోడిని, ఫాలో అయ్యే ర‌కం కాదు, ప‌ది మందికి పెట్టినా మ‌న‌మే.. న‌లుగురిని కొట్టినా మ‌న‌మే.., తేడా సింగ్ ని నువ్వు క‌లిశాక ఇంకా బ్ర‌తికే ఉంటే ఫోన్ చెయ్.. చార్మినార్ తీసేసి నీ స్టాచ్యూ పెట్టిస్తా.., రేయ్ నా గుండెల్లో కాల్చే హ‌క్కు ఇద్ద‌రికే ఉంది. ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ.. ఔట‌ర్స్ నాట్ అలౌడ్,క‌ర్రో క‌త్తో తెచ్చుకో బే.. ఖాళీ చేత్తో కామ్ న‌హీ చ‌ల్తా, నేనంతే, క‌సి తీర‌క‌పోతే శ‌వాన్ని లేపి మ‌ళ్లీ చంపుతా.. లాంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ పైసా వసూల్ ఏంటనేది ఒక్క షోకే అర్ధమైపోయింది. ఈ సినిమా హిట్ గనక అయితే పూరికి మళ్ళీ పోకిరి రోజులు వచ్చేవి. పోకిరి టైం లో పూరి మార్క్ మేనరిజం అంటే జనాలు పడి చచ్చేవాళ్ళు. కానీ మధ్యలో పూరి సినిమాలు టపా కట్టడంతో టాప్ లో ఉండాల్సిన డైరెక్టర్ కాస్తా చీప్ అయ్యే స్టేజ్ కి వచ్చేసాడు. ఇక ఈ పైసా వసూల్ ఓవరాల్ గా నందమూరి ఫాన్స్ కి ఒకే గాని మిగతా ప్రేక్షకులకు కాస్త పరీక్షే.

ప్లస్ పాయింట్స్: బాలకృష్ణ, డైలాగ్స్, పాటలు, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్

మైనస్ పాయింట్స్: డైరెక్షన్, కామెడీ లేకపోవడం, సెకండ్ హాఫ్, హీరోయిన్స్, బ్యగ్రౌండ్ మ్యూజిక్

ట్యాగ్ లైన్: ఓన్లీ నందమూరి ఫాన్స్ కే ...

రేటింగ్: 2.5 /5

Similar News