ప్రొడక్షన్ హౌస్: ఆర్కామీడియా ఎంటర్‌టైన్‌మెంట్
దర్శకత్వం: ఎస్‌ఎస్.రాజమౌళి
నటీనటులు: ప్రభాస్., రానా., అనుష్క.,నాజర్., రమ్యకృష్ణ., సత్యరాజ్., తమన్నా., సుబ్బరాజు.,పృథ్వీ తదితరులు
సంగీతం: కీరవాణి
ఆర్కా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రసాద్ దేవినేని., శోభు యార్లగడ్డ నిర్మాణంలో బాహుబలి -2 ది కంక్లూజన్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐదేళ్లుగా ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేసిన రహస్యం తెలిసిపోయింది. ఫాంటసీ., యాక్షన్ కలగలిసిన చిత్రంగా ఏడాదిన్నరకు పైగా ప్రేక్షకుల్ని ఓపికగా ఎదురు చూసేలా చేసిన చిత్ర రహస్యం తెలిసిపోయింది.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు....?
దర్శకుడు చెప్పాడు కనుక చంపాడంటూ ఇన్నాళ్లు కట్టప్ప పాత్రధారి., బాహుబలి పాత్రధారులు ఊరిస్తూ వచ్చారు. ప్రేక్షకుల్లో చాలామంది ఈ రహస్యం తెలుసుకోడానికే థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. ప్రేక్షకుల్ని ఇంతగా ఉత్కంఠకు గురి చేసిన కథలోకి వెళితే కాలకేయులని జయించిన తర్వాత మాహిష్మతి సామ్రాజ్యాదీశుడిగా అమరేంద్ర బాహుబలి., సర్వసైన్యాధ్యక్షుడిగా బల్లాల దేవుడ్ని...రాజమాత శివగామి దేవి ప్రకటించడంతో మొదటి భాగం ముగుస్తుంది. మాహీష్మతి రాజ్యాధినేతగా బాహుబలిని ప్రకటించిన తర్వాత 26 ఏళ్లకోమారు వచ్చే రాసక్షవధ కార్యక్రమాన్ని శివగామి చేపడుతుంది. ఆ కార్యక్రమానికి ఎదురైన ఆటంకాలను బాహుబలి తన శక్తియుక్తులతో తప్పిస్తాడు. కొడుకు ధీరత్వాన్ని చూసి శివగామి మురిసిపోతుంటే., తన బిడ్డకు రాజ్యం దక్కలేదని బిజ్జలదేవుడు అసూయతో రగలిపోతుంటాడు. శివగామిని అంతమోధిస్తే తప్ప బల్లాల దేవుడికి రాజ్యం దక్కదని., ఆమెను చంపేద్దామని కొడుకుతో ప్రతిపాదిస్తాడు. అయితే పగతో రగిలిపోతున్న బల్లాల దేవుడు తండ్రిని అనునయించి సమయం కోసం ఎదురు చూస్తుంటాడు. అయితే తండ్రి కొడుకుల పన్నాగం గురించి తెలుసిన కట్టప్ప వారిని హెచ్చరిస్తాడు. అదే సమయంలో పట్టాభిషేకం జరిగే లోపు దేశాటన చేసి రమ్మని బాహుబలికి శివగామి సూచిస్తుంది... బాహుబలికి తోడుగా కట్టప్పను పంపుతుంది. రాజ్యాలన్ని తిరుగుతూ వారు కుంతలదేశం చేరుకుంటారు. ఆ రాజ్యంలో దోపిడి దొంగల ఆటకట్టించేందుకు బయల్దేరిన..., యువరాణి దేవసేనను చూసి అమరేంద్ర బాహుబలి మనసు పారేసుకుంటాడు. తనకు ఏదొక పని ఇప్పించాలంటూ బతిమాలడంతో., సైనికుడిగా శిక్షణ ఇవ్వాలని తన బావ కుమారవర్మకు అప్పగిస్తుంది. అలా కుంతల రాజ్యానికి చేరిన అమరేంద్ర బాహుబలి క్రమంగా తన పరాక్రమంతో దేవసేనను ఆకర్షిస్తాడు. అదే సమయంలో కుంతల దేశ యువరాణితో అమరేంద్ర బాహుబలి ప్రేమలో ఉన్నాడనే విషయాన్ని వేగులు బల్లాల దేవుడికి చేరవేస్తారు. వేగులు తెచ్చిన దేవసేన చిత్రాన్ని చూసి ఆమెను మనువాడాలనుకున్న బల్లాల దేవుడు వ్యూహాత్మకంగా శివగామికి ఆ సమాచారం చేరేలా పన్నాగం పన్నుతాడు. అమరేంద్ర బాహుబలి ప్రేమ గురించి తెలియని శివగామి తన కొడుకును పెళ్ళి చేసుకోవాలని వర్తమానం పంపుతుంది. దానికి ఆగ్రహించిన దేవసేన., ముక్కు ముఖం తెలియని వాడిని మనువాడనని ప్రత్యుత్తరమిస్తుంది. ఇది శివగామికి ఆగ్రహం కలిగిస్తుంది. ఆమెను బంధించి తీసుకురావాలని ఆదేశిస్తుంది. ఆ బాధ్యత అమరేంద్ర బాహుబలికి అప్పగించాలని బిజ్జలదేవుడు సూచిస్తాడు. అందుకు ఆమె అమోదం తెలుపుతుంది. ఈ సమాచారం అమరేంద్ర బాహుబలికి తెలిసిలోపు కుంతల రాజ్యంపై పిండారీలు దండెత్తుతారు. వారిని అడ్డుకుని బాహుబలి ఆ రాజ్యాన్ని రక్షిస్తాడు. పిండారీలతో జరిగే యుద్ధంలో బాహుబలి పరాక్రమాన్ని చూసి దేవసేన అతనితో ప్రేమలో పడిపోతుంది. వారి ప్రేమ బయటపడిన సమయంలోనే శివగామి ఆదేశాలు బాహుబలికి అందడం., అనామకుడిగా పరిచయమైన బాహుబలి మాహిష్మతి రాజ్యానికి కాబోయే రాజని తెలియడంతో దేవసేన అలుగుతుంది. తనను బంధించడానికి బాహుబలి సిద్ధమయ్యాడని తెలిసి బాధపడుతుంది. అయితే దేవసేన గౌరవానికి ఎలాంటి భంగం కలగనివ్వనని హామీ ఇచ్చి ఆమెను మాహిష్మతి రాజ్యానికి తీసుకువెళతాడు. నిండు సభలో శివగామి ఆహ్వానాన్ని తిరస్కరించినందుకు దేవసేన క్షమాపణ చెబుతుంది. అంతలోనే ఆమె పెళ్లి వర్తమానం పంపింది బల్లాల దేవుడి కోసమని తెలిసి ఆగ్రహిస్తుంది. బల్లాల దేవుడికి మాట ఇచ్చిన శివగామి ఆ మాట నెరవేర్చుకోవాలని మొండికేస్తుంది. తాను ఆమెకు మాటిచ్చానని బాహుబలి తల్లిని ఎదిరిస్తాడు. దీంతో రాజ్యం కావాలో., దేవసేన కావాలో తేల్చుకోమని ఆదేశిస్తుంది. దీంతో పట్టాభిషేకం వద్దని., దేవసేన కావాలని తేల్చి చెప్పడంతో అతనికి సైన్యాధ్యక్షుడిగా ప్రకటిస్తుంది. పట్టాభిషిక్తుడైన తర్వాత కూడా రాజ్యంలో ప్రజలంతా బాహుబలినే కీర్తించడం బల్లాల దేవుడిని పగతో రగిలిపోయేలా చేస్తుంది. బాహుబలిని అవమానించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. దేవసేన శ్రీమంతం రోజు బాహుబలిని సైన్యాధ్యక్ష పదవి నుంచి తప్పించి అవమానిస్తారు. అవమానం తట్టుకోలేక మాహిష్మతి రాజ్యధ్యక్షుడివి కావాలని దేవసేన భర్తను కోరుతుంది. ఈ కోరిక శివగామిని కలవర పడుతుంది. కొత్త సైన్యాధ్యక్షుడు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం., దేవసేనను అవమానించి., ఆమెను తాకే ప్రయత్నం చేయడంతో అతని వేళ్లు నరికేస్తుంది. సైన్యాధ్యక్షుడి వేళ్లు నరికినందుకు ఆమెకు సంకెళ్లు వేసి విచారణ చేస్తారు. విషయం తెలిసి సభకు వచ్చిన బాహుబలి తన భార్యను అవమానించిన సైన్యాధ్యక్షుడి తల నరికేస్తాడు. సభలో మహారాజును., శివగామిలను అవమానించినందుకు అంత:పురం బహిష్కరణ శిక్ష విధిస్తారు. ఆ తర్వాత రాజ్యంలో ప్రజలంతా బాహుబలిని మరింతగా ఆదరిస్తారు. అదే కొనసాగితే ప్రజలుఎదురు తిరుగుతారని భావించి శివగామి చేతే అతడిని చంపించేందుకు తండ్రి., కొడుకులు పథకం రచిస్తారు. అందులో భాగంగా కుమార వర్మ బల్లాల దేవుడిపై హత్యాయత్నం చేసేలా ప్రేరేపిస్తారు. వారి కుట్ర తెలియని కుమార వర్మ అంత:పురంలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోతాడు. బాహుబలే.... బల్లాల దేవుడిని చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని బిజ్జల దేవుడు నూరిపోస్తాడు. దానిని శివగామి నమ్మి బాహుబలిని చంపాలని కట్టప్పను ఆదేశిస్తుంది. కట్టప్ప చంపకపోతే తానే చంపుతానని హెచ్చరించడంతో అతను రాజమాత ఆజ్ఞను అమలు చేసేందుకు సిద్ధమవుతాడు. అప్పటికే నెలలు నిండిన దేవసేనతో ఉన్న బాహుబలి..., కట్టప్ప ప్రమాదంలో ఉన్నాడని తెలిసి బయటకు వస్తాడు. అక్కడ జరిగే పోరులో బాహుబలిని కట్టప్ప హతమారుస్తాడు. బాహుబలి చనిపోయిన తర్వాత కుట్ర ఎలా చేశామో చెప్పడంతో కట్టప్ప శివగామికి విషయం చెప్పి నిలదీస్తాడు. భర్త., కొడుకులు చెప్పిన మాట విని బాహుబలిని చంపుకున్నానని గుర్తించిన శివగామి దేవసేన కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతుంది. ఆమెకు పుట్టిన మహేంద్ర బాహుబలిని మహారాజుగా ప్రకటిస్తుంది. వెంటనే సభను ఏర్పాటు చేయాలని కట్టప్పను ఆదేశిస్తుంది. ఈ పరిణామాలను ఊహించిన బల్లాల దేవుడు పసిబిడ్డను చంపేందుకు సిద్ధమవుతాడు. పసిబిడ్డతో పారిపోతున్న శివగామిని చంపుతాడు. పసిబిడ్డను శివగామి చేతుల్లో రక్షించడంతో మహేంద్ర బాహుబలి ఎదుగుతాడు. ఆ తర్వాత బల్లాల దేవుడిని ఓడించి మాహిష్మతి సామ్రాజ్యాధీశుడిగా మహేంద్ర బాహుబలి బాధ్యతలు చేపట్టడంతో కథ ముగుస్తుంది.
ఎందుకు చంపాడంటే.....
కట్టప్పను బాహుబలి ఎందుకు చంపాడన్న ప్రశ్నకు సింపుల్‌గా శివగామి ఆదేశాలను అమలు చేసేందుకు చంపాల్సి వస్తుంది. మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టుబానిసగా ఉన్న కట్టప్ప రాజమాత ఆదేశాలను అమలు చేసే క్రమంలోనే బాహుబలిని చంపుతాడు. బాహుబలి కథాపరంగా చూస్తే ఇంతకు ఉండదు. ఐదు గంటల 45 నిమిషాల సినిమాను రెండు భాగాలుగా ఐదేళ్ల పాటు చిత్రీకరించి ప్రేక్షకులను సస్పెన్స్‌లో ఉంచి థ్రిల్ చేయాలనుకున్నది ఈ సంగతి చెప్పేందుకే.....
ఎవరు హీరో......
పాత్రల పరంగా చూస్తే బాహుబలి చిత్రంలో మొదటి హీరో శివగామి పాత్రకే దక్కుతుంది. ప్రభాస్., రానాలు నాయక., ప్రతి నాయక పాత్రల్లో అద్భుతంగా నటించినా బాహుబలి ది కన్‌క్లూజన్‌లో మాత్రం నటనాపరంగా తెరపై ప్రేక్షకుల్ని ఆకట్టుకునేది శివగామి., బిజ్జలదేవుడు., దేవసేన పాత్రలకు గ్రాఫిక్స్‌తో పని లేకుండా నటనతో ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం లభించింది. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలో నాణ్యత స్పష్టంగా కనిపిస్తుంది. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ప్రాంతీయ సినిమా కూడా గ్రాఫిక్ మాయజాలం చేయగలదని బాహుబలి 2 నిరూపించింది. ఇది తెలుగు సినిమాను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి చూపిన మార్గంలో మున్ముందు మరిన్ని చిత్రాలు రూపుదిద్దుకోవచ్చు. దాదాపు మకుటా సంస్థతో పాటు అరడజనుకు పైగా గ్రాఫిక్ సంస్థలు చేసిన కృషి వెండితెరపై స్పష్టంగా కనిపిస్తుంది. కీరవాణి సంగీతం., సన్నివేశాలకు తగ్గట్టుగా నేపథ్యం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఆడియో రిలీజ్ అయిన తర్వాత క్లిక్ అయిన రెండు మూడు పాటలే సినిమాలో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. దండాలయ్యా., సాహోరే బాహుబలి పాటలు తప్ప మిగిలిన పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా సాగవు. సెంథిల్ కుమార్ కెమెరా పనితనం., కోటగిరి ఎడిటింగ్ కూడా సినిమాకు కలిసొచ్చాయి. తెరపై ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కనిపిస్తుంది. యుద్ధ సన్నివేశాల్లో మాత్రమే గ్రాఫిక్స్ కాస్త అతిగా అనిపిస్తాయి తప్ప మిగిలిన చోట్ల ఎక్కడ సహజత్వం పోకుండా కనిపిస్తుంది. అమరేంద్ర బాహుబలిగా., మహేంద్ర బాహుబలిగా రెండు పాత్రల్లో కనిపించే ప్రభాస్ క్యారెక్టర్‌ను బల్లాల దేవుడిగా రానా పాత్ర ఢీకొడుతుంది. చిత్రంలో ఎవరు ఎక్కువ., ఎవరు తక్కువ అనే తేడా లేకుండా ఇద్దరు యువ కథానాయకుల కెరీర్‌లో మైలు రాయిగా ఈ చిత్రం నిలిచిపోతుంది.
రేటింగ్: 3.5-4/5