బాహుబలి ద కంక్లూజన్ మూవీ రివ్యూ

Update: 2017-04-28 03:18 GMT

నటీనటులు: ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్య రాజ్, ప్రభాకర్, రోహిణి, తనికెళ్ళ భరణి తదితరులు

కథ: విజయేంద్ర ప్రసాద్

సంగీతం: కీరవాణి

ఆర్ట్ డైరెక్టర్: సాబు శిరిల్

సమర్పణ: కె రాఘవేంద్ర రావు

నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని

స్క్రీన్ ప్లే డైరెక్షన్: ఎస్.ఎస్ రాజమౌళి

పరిచయాలు, ప్రత్యేక ఉపోద్గాతాలు అవసరం లేని విధంగా ప్రాచుర్యం పొందిన భారీ చిత్రం 'బాహుబలి'. ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ అనే ట్యాగ్ తో ఒకేసారి నాలుగు భాషల్లో విడుదలవుతున్న 'బాహుబలి ద కంక్లూజన్' పట్ల సగటు ప్రేక్షకులే కాక యావత్ భారత దేశం మొత్తం అమితాశక్తితో... కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో కుతూహలంగా ఎదురు చూస్తుంది. మొదటి భాగం 'బాహుబలి ద బిగినింగ్' తోనే ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్న బాహుబలి చిత్రం 'బాహుబలి ద కంక్లూజన్' ట్రైలర్స్ తో, పోస్టర్స్ తో ఈ చిత్రానికి అయిన ఖర్చు 250 కోట్ల కంటే ప్రేక్షకుల అంచనాలు 1000 కోట్లు దాటేశాయి. ఐదేళ్ల కఠోర శ్రమతో రాజమౌళి నడుం బిగించి తన స్వప్నానికి తెరరూపమిచ్చి బాహుబలి పార్ట్ 1 మరియు పార్ట్ 2 లని తెరకెక్కించాడు. బాహుబలి మొదటి పార్ట్ తోనే తెలుగువాడి గొప్పదనాన్ని చాటి చెప్పిన కీర్తిని మూటగట్టుకున్నాడు ఎస్ ఎస్ రాజమౌళి. రాజమౌళి బాహుబలి అనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం తన కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి పనులు చెఇంచేసాడు. భార్య రామ తో కాస్ట్యూమ్ డిజైనరుగా... కొడుకు కార్తీక్ ని తనకి హెల్పేర్ గా... కీరవాణి భార్య వల్లి గారిని లైన్ ప్రొడ్యూసర్ గా... అబ్బో ఇలా తన కుటుంబాన్ని మొత్తం బాహుబలి కోసమే కష్టపడేలా చేసాడు జక్కన్న. ఇక ఈ చిత్రం కోసమే గత ఐదేళ్లుగా కష్టపడుతున్న మరొక వ్యక్తి హీరో ప్రభాస్. ప్రభాస్ దాదాపు మూడున్నరేళ్లు ఒక్క బాహుబలి కోసమే తన కాలాన్ని వెచ్చించాడు. రాజమౌళి తీసిన బాహుబలి మీద ఎంత నమ్మకం లేకపోతె ప్రభాస్ అలా అన్ని సంవత్సరాలు త్యాగం చేస్తాడు. ఇక భల్లాల దేవునిగా బాహుబలి 1 లో అత్యంత క్రూరంగా.. పథకాలు రచిస్తూ పాలన చేసినట్లే పార్ట్ 2 లో కూడా రాణా అదరగొట్టేస్తాడని యాక్షన్ ట్రైలర్ లో తిలకించాము. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే అనుష్క మొదటి భాగంలో డీ గ్లామరగా కనిపించింది. బాహుబలిలో దేవసేన రాణిగా ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చెయ్యడానికి కత్తి సాము, మల్ల యుద్ధంలో నైపుణ్యం ప్రదర్శిస్తూ ఆకట్టుకోవడానికి సిద్ధంగా వుంది. ఇక తమన్నా విషయానికి వస్తే ఆమె అవంతిక రోల్ ఎక్కువగా పార్ట్ 1 లోనే చూపించేసాడు జక్కన్న. ఇక పార్ట్ 2 లో తమ్మన్న రోల్ ఎలా వుండబోతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక రాజమాతగా రమ్యకృష్ణ అదరగొట్టేసే పాత్రని పోషించింది. బాహుబలి లో ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన వారు మరొకరన్నారు. వారే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిగారు బాహుబలి పార్ట్ 1 సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని అదరగొట్టేసిన ఈయన, పార్ట్ 2 పాటల్ని కూడా ఆ లేవల్లోనే దంచేసాడు. బాహుబలిలో చివరిగా చెపుకోవసిన వారు నిర్మాతలు. నిర్మాతలు శోభు, ప్రసాద్ లు రాజమౌళి తీసిన గత చిత్రాల హిట్స్ తో ఆయన మీద నమ్మకంతో లేదనకుండా బాహుబలి కోసం ఖర్చు చేశారు. అయితే బాహుబలి మొదటి పార్ట్ కి వారికి ఎంత లాభం వచ్చిందో తెలియదు గాని మాకేం మిగలేదనే చెబుతున్నారు వారు. మరి పార్ట్ 1 లో డబ్బు వెనకేసుకోలేకపోయినప్పటికీ 'బాహుబలి ద కంక్లూజన్' కోసం మాత్రం ఎడాపెడా ఖర్చు పెట్టేసారు. రాజమౌళి ఎలా కావాలంటే అలా ఖర్చు పెట్టి ఇలాంటి నిర్మాతలు కూడా ఉంటారని నిరూపించారు. మరి బాహుబలి ద బిగినింగ్ లో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేసి కథని బాహుబలి ద కంక్లూజన్ కోసం దాచి పెట్టి.... అలాగే పార్ట్ 1 లో కేవలం యుద్ధ సన్నివేశాలు, గ్రాఫిక్స్ మాయాజాలం, విజువల్ ఎఫక్ట్స్ తో మెస్మరైజ్ చేసిన రాజమౌళి అండ్ టీమ్ ఇప్పుడు బాహుబలి ద కంక్లూజన్ తో ఎలా ఆకట్టుకుంటారో సమీక్షలో తెలుసుకుందాం.

కథ: బాహుబలి మొదటి పార్ట్ ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుండి బాహుబలి 2 మొదలవుతుంది, కట్టప్ప బాహుబలిని చంపడం అనే సస్పెన్సు తో ఎండ్ అయిన పార్ట్ 1 నుండి పార్ట్ 2 లోకి వచ్చి చూడగా... బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాల్సి వచ్చిందో చెప్పేందుకుగతంలోకి వెళతాడు కట్టప్ప.

మాహిష్మతి సామ్రాజ్యానికి రాజుగా బాహుబలిని శివగామి(రమ్యకృష్ణ) తర్వాత రాజుగా ప్రకటిస్తుంది. తన కొడుకు భళ్లాల దేవుడిని (రాణా)ని సైన్యాధికారిగా నియమిస్తుంది. బాహుబలిని రాజుగా ప్రకటించడం.. భళ్లాల దేవుడికి అయన తండ్రి బిజ్జల దేవుడు (నాజర్) కి నచ్చదు. వారు బాహుబలికి వ్యతిరేఖంగా మాహిష్మతి సామ్రాజ్యంలో కుట్రలు చేస్తుంటారు. తప్పుడు ప్రచారం చేస్తూ బాహుబలిని గద్దె దించాలని ప్లాన్ చేస్తుంటారు. అదే సమయంలో బాహుబలి... విశ్వాస పాత్రుడు కట్టప్ప(సత్యరాజ్) దేశమంతా సంచరించి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏమిటో కనుక్కోవాలని రాజమాత శివగామి పంపిస్తుంది. ఆ సమయంలో కుంతల దేశపు యువరాణి దేవసేనతో బాహుబలి ప్రేమలో పడతాడు. తాను ప్రేమించిన సంగతి దేవసేనకి తెలిసే సమయానికి బాహుబలి అనూహ్య పరిణామాలు ఎదుర్కొంటాడు. ఆ అనూహ్య పరిణామాలేమిటి? దేవసేనని బాహుబలి పెళ్లాడాడా? భళ్లాల దేవుడు రాజుగా గద్దెనెక్కడా? అసలు అత్యంత విశ్వాస పాత్రుడైన కట్టప్ప బాహుబలిని చంపడమేమిటి? ఇవన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బాహుబలి ద కంక్లూజన్ వెండితెర మీద వీక్షించాల్సింధే.

నటీనటులు : మూడేళ్ళ కాలాన్నీ, ఎనలేని కష్టాన్నీ వెచ్చిస్తూ ‘బాహుబలి’ కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్‌ని ప్రశంసించి తీరాలి. శ్రమించి, సాహసించి, అభినయించి అన్ని రకాలుగా ఆకట్టుకున్న ప్రభాస్‌ శివుడిగా మెరిసిపోయాడు. బాహుబలిగా వెలిగిపోయాడు. రానా కూడా భల్లాలదేవుని పాత్రకు తన ఎంపిక సరైనదేనని నిరూపిస్తూ నటుడిగా తన సత్తా చూపించాడు. క్రూరత్వం కలిగిన హావభావాలతోనే కాక స్వచ్ఛమైన ఉచ్ఛారణతోనూ మంచి మార్కులు కొట్టేశాడు. అనుష్క దేవసేన యువరాణిగా బాగా ఆకట్టుకుంది. లుక్ తో పాటే నటన పరంగా కూడా ప్రభాస్ తో పోటీ పడింది. ఇక ఈ భాగంలో తమన్నాకి చెప్పుకోదగ్గ రోల్ లేదు. ఉన్నంతలో పర్వాలేదనిపించింది. .రాజమౌళి ముందునుంచీ చెప్పినట్టు శివగామి పాత్రకు రమ్యకృష్ణ, బిజ్జాలదేవా పాత్రకు నాజర్‌ ప్రాణం పోశారు. కట్టప్ప పాత్రకు సత్యరాజ్‌ సింహాసనానికి కట్టుబడి ఉండే వ్యక్తిగా నూటికి నూరు శాతం ఆకట్టుకున్నాడు. మిగిలిన వారు వారి పరిధిమేర నటించారు.

సాంకేతిక వర్గం : వరుస విజయాలు సాధిస్తూ, సినిమా సినిమాకీ తన స్థాయిని పెంచుకుంటూ దక్షిణాది అగ్ర దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి ‘బాహుబలి’ని వండ్రఫుల్‌గా విజువలైజ్‌ చేశారనడంలో సందేహం లేదు. అయితే మొదటి భాగంలో ఆయన క్వాలిటీ పైనే ఎక్కువ కాన్‌సన్‌ట్రేట్‌ చేయడంతో కంటెంట్‌ ఎఫెక్ట్‌ అయింది. ‘మగధీర’, ‘ఈగ’ చిత్రాల్లో అద్భుతంగా పండిన ప్రేమకథలు ఆ కథనాలకు ఆక్సిజన్‌గా మారితే ‘బాహుబలి’లోని లవ్‌ ట్రాక్‌ ఈ కథకే మేజర్‌ వీక్‌ పాయింట్‌ అయింది. అలాగని ఇది ప్రేమకథ కాదులే.. కొన్ని పాత్రల బాంధవ్యాలు, భావోద్వేగాలతో సాగే కథనం అనుకుందామంటే భావం తెలిపే సందర్భాలే తప్ప ఉద్వేగంగా సాగే సన్నివేశాలు కొరవడ్డాయి. ఈ పార్ట్‌లో ‘బాహుబలి’ని సెకండాఫ్‌ కోసం దాచినట్టు, ఈ కథలోని భావోద్వేగాలన్నిటినీ రాజమౌళి సెకండ్‌ పార్ట్‌ కోసం ఉంచినట్లు కనపడుతుంది...

బాహుబలి ద కంక్లూజన్ లో ఇప్పుడు కథకు పెద్ద పీట వేశాడు దర్శకుడు రాజమౌళి. సెకండ్ పార్ట్ మొత్తాన్ని క్లారిటీగా కళ్ళకు కట్టినట్టు చూపించి సక్సెస్ అయ్యాడు. చివరివరకు కథను ఆసక్తిగా సాగించడంలో రాజమౌళి పూర్తిగా సఫలుడయ్యాడు. అనుష్క, ప్రభాస్ యుద్ధ సన్నివేశాలు.. రాణా, ప్రభాస్ ల మధ్యన వచ్చే యుద్ధ సన్నివేశాలను ఎంతో గొప్పగా తెరకెక్కించాడు. పంచ పాండవుల పవర్‌ని బాహుబలిగా, వందమంది కౌరవుల క్రౌర్యాన్ని భల్లాలదేవాగా మార్చి ఈ దాయాదుల గాథను సృష్టించారా అనిపించేటట్ట్లు ‘బాహుబలి’ కథను సిద్ధం చేసిన విజయేంద్రప్రసాద్‌ మహాభారతంలోని ప్రతి పాత్రకూ ఓ పరమార్ధం వున్నట్లే ఈ కథలోని ప్రతి పాత్రకూ ఓ ప్రత్యేకతను ఆపాదించే ప్రయత్నం చేశారు. కీరవాణి తనదైన నేపథ్య సంగీతంతో, తనకు మాత్రమే సొంతమైన శైలిలో ‘బాహుబలి’ని అప్పుడప్పుడూ అంతెత్తుకు లేపేసినా ... బాహుబలిలో పాటలు పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. పార్ట్ 2 లో ఒక్క రొమాంటిక్ పాట లేకపోవడం కాస్త ప్రేక్షకులను నిరాశపరిచె విషయమే. ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబు శిరిల్‌, సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ రాజమౌళి కలకు రూపమివ్వడంలో తమ ప్రావీణ్యాన్నంతటినీ తెరపై పరిచారు. వీరిద్దరి పనితనమే మాహిష్మతి రాజ్యాన్ని ప్రతి ఫ్రేమ్‌లోనూ రంగ రంగ వైభవంగా చూపిందనడంలో సందేహం లేదు. అలాగే సీనియర్‌ ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస మోహన్‌, ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్‌తో బాటు ఇతర టెక్నీషియెన్స్‌ అందరూ కూడా అభినందనీయులే. ఎందుకంటే కంటెంట్‌ వైజ్‌ ఎలా వుందో ఎనలైజ్‌ చెయ్యొచ్చు కానీ ఎఫర్ట్‌ వైజ్‌ మాత్రం యూనిట్‌లోని ప్రతి ఒక్కరినీ ఎప్రిషియేట్‌ చేసే తీరాల్సిన అవుట్‌పుట్‌ ఇది. ఇక నిర్మాణాత్మక విలువలు గురించి వేరే చెప్పక్కర్లేదు. ప్రతి సీన్ లోను భారీ పని తనం ఉట్టిపడింది.

ప్లస్‌ పాయింట్స్‌ : ప్రభాస్‌, రానా పెర్‌ఫార్మెన్స్‌, అనుష్క, కథ, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, కామెడీ, బ్యాగ్రౌండ్ స్కోర్, రాజమౌళి విజువలైజేషన్‌,యుద్ధ సన్నివేశాలు, గ్రాఫిక్స్‌, ఇంటర్వెల్ సీన్స్

మైనస్ పాయింట్స్: సినిమా నిడివి, ఎడిటింగ్, సంగీతం, స్క్రీన్ ప్లే, పవర్ ఫుల్ డైలాగ్స్ లేకపోవడం

రేటింగ్: 3 .5 /5

Similar News