భాగమతి మూవీ రివ్యూ

Update: 2018-01-26 08:10 GMT

నటీనటులు : అనుష్క శెట్టి, జయరాం, ఉన్ని ముకుందన్, ఆషా శరత్, ప్రభాస్ శ్రీను, ధనరాజ్, మురళి శర్మ, తలైవాసల్ విజయ్, విద్యుల్లేఖ రామన్ తదితరులు

ఛాయాగ్రహణం : ఆర్.మది, సుశీల్ చౌదరి

కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు

సంగీతం : ఎస్.థమన్

నిర్మాణ సంస్థ : యూ.వి.క్రియేషన్స్

నిర్మాతలు : వంశి కృష్ణ రెడ్డి, ప్రమోద్

రచన, దర్శకత్వం : అశోక్.జి

విడుదల తేదీ : 26 జనవరి 2018

భాగమతి:

తెలుగు చలన చిత్రాలలో కొంత కాలం పాటు హారర్ మరియు హారర్ కామెడీ చిత్రాలు రాజ్యమేలి, ఈ మధ్యనే ప్రేక్షకులకి మొహం మొత్తటంతో పెద్దగా ప్రేక్షాకాదరణ పొందలేకపోతున్నప్పటికీ యూ.వి.క్రియేషన్స్ వారు భాగమతి చిత్రాన్ని సెమి హారర్ జోనర్ లో తీయటానికి వారికి వున్న ప్రగాఢ నమ్మకం అనుష్క శెట్టి. అరుంధతి చిత్రంతో ఎలాంటి స్టార్ హీరోల ఇమేజ్ లేకుండా కేవలం తన అభినయంతో సక్సెస్ చేసిన చరిత్ర ఆమెకి ఉండటంతో ట్రాక్ రికార్డు పరిశీలిస్తే దర్శకుడు అశోక్ కి గత రెండు చిత్రాలు డిజాస్టర్స్ అయినప్పటికీ యూ.వి.క్రియేషన్స్ వారు ధైర్య సాహసాలు ప్రదర్శించి భారీ వ్యయంతో చిత్రాన్ని నిర్మించారు. సినిమా భారం మొత్తాన్ని తానే మోస్తున్న అనుష్క భాగమతి చిత్రాన్ని అరుంధతి స్థాయిలో నిలపటంలో సఫలమైయిందా? ఈ ప్రక్రియలో దర్శకుడు అశోక్ పాత్ర ఎంత? ఈ వివరాలని పూర్తి సమీక్షలో తెలుసుకుందాం పదండి.

కథ :

తన ప్రియుడు శక్తి(ఉన్ని ముకుందన్) ని హతమార్చినందుకు కారాగార శిక్ష అనుభవిస్తున్న చంచల(అనుష్క శెట్టి) నుంచి కేంద్ర మంత్రి ఈశ్వర్ ప్రసాద్(జయరాం) అక్రమాల చిట్టా రాబట్టటానికి అనధికారిక విచారణ నిమిత్తం సి.బి.ఐ అధికారి వైష్ణవి నరసింహన్(ఆషా శరత్) ఎవరికీ అనుమానం రాని ప్రదేశం చూసి అక్కడికి చంచల ని బదిలీ చేయమని ఏ.సి.పి(మురళి శర్మ) కి హుకుం జారీ చేస్తుంది. తన తమ్ముడు శక్తి హత్యా కేసులో చంచలకి జైలు శిక్ష పడినా తనపై వ్యక్తిగత కక్ష తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న ఏ.సి.పి ఈ అవకాశం వాడుకుంటూ చంచలని అటవీ ప్రాంతంలో జనసమూహారం లేని ఒక పాడు బడ్డ బంగ్లా కి షిఫ్ట్ చేసి అక్కడ విచారణకి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఆ బంగ్లా లో రాత్రిల్లు వంటరిగా గడుపుతున్న చంచల ని ఆవహించిన భాగమతి ఆత్మ వెనుక వున్న కథ ఏమిటి? కేంద్ర మంత్రి ఈశ్వర్ ప్రసాద్ గుట్టు రట్టు చేసేందుకు చంచలనే సి.బి.ఐ ఎందుకు టార్గెట్ చేసింది? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే శక్తీ ని చంచల ఎందుకు హత్య చేసింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే వెండితెరపై భాగమతి చిత్రం చూడాల్సిందే.

నటీనటులు :

ట్రైలర్స్ చూసిన నాటి నుంచి అందరూ ఊహించినట్టుగానే అనుష్క శెట్టి తన నట విశ్వరూపం చూపించేసింది. చంచల అనే ఐ.ఏ.ఎస్ అధికారి పాత్రకి కావాలసిన హుందా తనాన్ని, హత్య కేసులో ముద్దాయిగా వున్న చంచల అయోమయపు పరిస్థితిని, భాగమతి ఆత్మ ఆవహించిందని నమ్మించే సన్నివేశాలలో వైవిధ్యమైన హావభావాలతో అనుష్క శెట్టి ఇన్ని వేరియేషన్స్ చూపాల్సిన పాత్రకి తానే న్యాయం చేయగలనని చాటి చెప్పే విధంగా అభినయం ప్రదర్శించి ఆడిటోరియం మొత్తాన్ని ఆకట్టుకుంది. కథలో అత్యంత కీలక పాత్రలో కనిపించిన జయరాం తో సహా తక్కువ నిడివి కలిగిన ఉన్ని ముకుందన్ లు తమ పాత్రల పరిమితిలో బాగా నటించారు. మురళి శర్మ, ఆషా శరత్, బాపినీడు ఉన్నత అధికారుల పాత్రలలో హుందా గా నటించగా ధనరాజ్ మరియు ప్రభాస్ శ్రీను లు వారి సబ్ ఆర్డినెట్స్ గా కాసేపు నవ్వులు పంచె ప్రయత్నం చేశారు కానీ నవ్వించాలని వారు చేసిన శ్రమ ఫలించలేదు.

సాంకేతిక వర్గం :

ఆఫ్ స్క్రీన్ టెక్నీషియన్స్ విషయానికి వస్తే ముందుగా ప్రస్తావించాల్సిన విభాగాలు ఆర్ట్, ఛాయాగ్రహణం, సంగీతం. భాగమతి అనే పాత్ర చుట్టూ అల్లిన కథ మెయిన్ ప్లాట్ కి సంబంధం లేని ఒక కట్టు కథ అని ప్రేక్షకుడికి రివీల్ అయ్యే వరకు ప్రేక్షకుడు భాగమతి కథ తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూసే విధంగా ఆర్ట్ విభాగం భాగమతి బంగ్లా సెట్ డిజైన్ చేయటంలో నూటికి నూరు శాతం సక్సెస్ ఐయింది. ఎస్.థమన్ అందించిన స్వరాలతో పాటు నేపధ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ప్రతి సన్నివేశాన్ని తన నేపధ్య సంగీతం తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తూ ప్రేక్షకులకి హర్రర్ చిత్రాలలో కొత్త అనుభూతిని ఇచ్చే ప్రయత్నం చేసాడు థమన్. అంత అద్భుతమైన సెట్స్ మరియు లొకేషన్స్ ని చిత్రీకరించడంలో, దర్శకుడు చెప్పే కథకి ప్రేక్షకుడు లీనమయ్యే విధంగా షాట్ కంపోసిషన్ చేసి కెమెరా తో మాయ చేయటంలో ఛాయాగ్రాహకులు మది పడిన శ్రమ తెరపై కనిపిస్తుంది. ఆయన ఫ్రెమింగ్స్ కి తగిన లైటింగ్ ఎఫెక్ట్స్ తో పాటు హర్రర్ చిత్రానికి తగిన సౌండ్ ఎఫెక్ట్స్ మరియు సౌండ్ మిక్సింగ్ ల విభాగాలు కూడా తమ శక్తికి మించి పనిచేసి నాణ్యమైన పనితనాన్ని కనపరిచాయి.

ఎడిటింగ్ విషయానికి వస్తే చిత్ర ప్రథమార్ధం లో అక్కడక్కడా అనవసరపు షాట్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకుడు క్షమించే రీతిలో సాగటంతో అవి పెద్దగా ఆక్షేపణలు కాలేదు కానీ ఎడిటర్ కత్తెర ద్వితీయార్ధం లో మాత్రం దొరికిపోతుంది. ఒక మెయిన్ ప్లాట్ కి సంభంధం లేని సబ్ ప్లాట్ ని రివీల్ చేస్తున్న సన్నివేశాలు ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించే విధంగా వున్నాయంటే ఎడిటర్ వైఫల్యం తెలుస్తుంది. దర్శకుడు అశోక్ తాను రాసుకున్న కథని తెరకెక్కించే ప్రాసెస్ లో మేకింగ్ లో కొత్తదనాన్ని చూపించకుండా సౌండ్ ఎఫెక్ట్స్ మరియు నేపధ్య సంగీతాన్ని ఎక్కువగా నమ్ముకుని పని పూర్తి చేశారు. సౌండ్ ఎఫెక్ట్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరించినప్పటికీ కథలో పట్టు లేకపోవటంతో ద్వితీయార్ధం వచ్చేసరికి ప్రేక్షకుడిని కథలోని ముఖ్య ఉద్దేశంలో లీనం చేయటంలో అశోక్ విఫలమయ్యారు. ఒక కట్టు కథ కల్పించి దాన్ని మెయిన్ ప్లాట్ కి అనుగుణంగా నడిపే కథనం కూడా ప్రేక్షకుడికి విసుగుతెప్పిస్తుంది. కథ, కథనాల ని ఎంపిక చేసుకోవటంలో యూ.వి.క్రియేషన్స్ వారి ఫెయిల్ అయినప్పటికీ వారి నాణ్యమైన నిర్మాణ విలువలతో అద్భుతమైన విజువల్స్ తో వారి మార్క్ చూపించగలిగారు.

ప్లస్ పాయింట్స్ :

అనుష్క శెట్టి

ఆర్ట్

ఛాయాగ్రహణం

నేపధ్య సంగీతం

సౌండ్ మిక్సింగ్

మైనస్ పాయింట్స్ :

స్టోరీ

స్క్రీన్ ప్లే

ఎడిటింగ్

డైరెక్షన్

రేటింగ్ : 2 /5

Similar News