నిర్మాణ సంస్థ: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
నటీనటులు: సుమంత్, ఆకాక్ష సింగ్, మిర్చి కిరణ్, కార్తీక్ అడుసుమిల్లి, మాస్టర్ సాత్విక్, బేబి ప్రీతి అస్రాని
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
నిర్మాత: రాహుల్ యాదవ్ నెక్క
దర్శకత్వం: గౌతమ్ తిన్నసూరి
అక్కినేని కాంపౌండ్ నుండి హీరోగా తెర మీదకి వచ్చిన సుమంత్ కెరీర్ లో చాలా ఒడిడుకులు ఎదుర్కున్నాడు. అక్కినేని వారసులుగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య, అఖిల్ లు ఇండస్ట్రీలో హీరోలుగా ఎదుగుతున్న కూడా సుమంత్ కి మాత్రం సరైన ప్లాట్ ఫామ్ ఉన్నా కూడా ఇండస్ట్రీలో సెటిలవడానికి లక్కు కలిసిరాలేదని చెప్పాలి. అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా.. బ్యాగ్రౌండ్ గట్టిగా ఉన్నప్పటికీ సుమంత్ మాత్రం హీరోగా నిలదొక్కులేకపోయాడు. నాగేశ్వర రావు సుమంత్ ని ఎలాగైనా నిలబెట్టాలని చేసిన ప్రయత్నాలేమీ సక్సెస్ కాలేదు. గత ఏడెనిమిదేళ్ళుగా ఒకటి అరా సినిమాల్లో నటిస్తున్న సుమంత్ కెరీర్ ముగిసి పోయింది అనుకున్న తరుణంలో గౌతమ్ తిన్నసూరి, సుమంత్ కి మళ్ళీ రావా కథని వినిపించడం.. వీరి కలయికలో ఈ సినిమా పట్టాలెక్కడం జరిగింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్, అక్కినేనివారి కొత్తకోడలు సమంత కూడా పాల్గొనడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే మళ్ళీ రావా ట్రైలర్, పోస్టర్స్ కూడా సినిమా మీద ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగించాయి. ఎన్నాళ్లగానో విజయం కోసం ఎదురు చూస్తున్న సుమంత్ కి ఈ మళ్ళీ రావా సినిమా ఎలాంటి విజయాన్ని అందించిందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
9 వ తరగతి చదువుతున్న కార్తీక్, అంజలిలు మంచి స్నేహితులు. అంత చిన్న వయసులోనే ఆ స్నేహం కాస్తా ప్రేమాగా మారుతుంది. అంజలి, కార్తీక్ ల ప్రేమ విషయం ఇంట్లోని వారికి తెలుస్తుంది. అంజలి తల్లి తండ్రులు కార్తీక్ తో అంజలి ప్రేమను ఒప్పుకోరు. అంత చిన్న వయసులో వారు ప్రేమించుకోవడం ఇష్టం లేకపోవడం ఒక కారణమైతే.. కార్తీక్ అంటే అంజలి పేరెంట్స్ కి అసలు నచ్చదు. అంజలి, కార్తీక్ ల ప్రేమను ఒప్పుకోకపోవడానికి అది రెండో కారణం. అలా వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారి తల్లితండ్రులు వారిని కలుసుకోకుండా చేస్తారు. తిరిగి మళ్ళీ 13 ఏళ్ళ తర్వాత కలిసిన అంజలి(ఆకాంక్ష) కార్తీక్ (సుమంత్) లు మళ్ళీ ప్రేమలో పడతారు. తమ ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది కాబట్టే మళ్ళీ కలుసుకున్నామనుకుంటారు. ఇద్దరు తమ ప్రేమను గెలిపించుకుని.. పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలని డిసైడ్ అవ్వడమే కాదు.. కార్తీక్, అంజలిలు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే పెళ్లి కోసం రిజిస్టర్ ఆఫీస్ కి చేరుకున్న కార్తీక్ కి అంజలి షాక్ ఇస్తుంది. అక్కడ కార్తీక్ తో పెళ్ళికి నో చెప్పేసి అంజలి అమెరికా వెళ్ళిపోతుంది. అసలు అంజలి కార్తీక్ తో పెళ్ళికి నో చెప్పడానికి గల కారణాలేమిటి? కార్తీక్ ని పిచ్చిగా ప్రేమించిన అంజలి ఎందుకు వదిలి వెళ్ళిపోతుంది? మరి అమెరికా వెళ్లిన అంజలి తిరిగొచ్చి.. కార్తీక్ ని కలుస్తుందా? అసలు అంజలి, కార్తీక్ ల పెళ్లి జరుగుతుందా? అనేది తెలియాలి అంటే మళ్ళీ రావా సినిమాని వెండితెరమీద వీక్షించాల్సిందే.
నటీనటుల నటన:
సుమంత్, కార్తీక్ గా బాగానే ఆకట్టుకున్నాడు. నటన పరంగా సుమంత్ కొత్తగా చేసింది ఏమిలేదు. ఎప్పటిలాగే నటనతో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ గా కూడా సుమంత్ బాగానే మెప్పించాడు. ఒక మెచ్యుర్డ్ లవర్ గా సుమంత్ నటన బావుంది. చాలా గ్యాప్ రావడం వల్ల బాగా పేరున్న ఒక హీరోని చూస్తున్నాం అనే ఫీలింగ్ కలగకపోవడం ఒక రకంగా ప్లస్. ఇంకోరకంగా మైనస్ అని చెప్పాలి. కొన్నిచోట్ల సుమంత్ డల్ నెస్ ఇబ్బంది పెడుతుంది. అంజలిగా హీరొయిన్ ఆకాంక్ష సింగ్ నటన పర్వాలేదనిపించినప్పటికీ.. నటనలో ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉంది. ఎమోషన్స్ ని పలికించడంలో మాత్రం ఆకాంక్ష సక్సెస్ అయ్యింది. ఇక కార్తీక్, అంజలి చిన్నప్పటి పాత్రలూ వేసిన మాస్టర్ సాత్విక్, బేబి ప్రీతి అస్రాని మాత్రం తమ నటనతో చంపేశారు. వారు ఆకట్టుకునేలా నటించి మెప్పించారు. మిగతా నటీనటులు అంటే.. ఈ సినిమాలో నటీనటులు చాలా తక్కువ మంది ఉన్నారు. వారు కూడా ఉన్నంతలో నటించి మెప్పించారు.
దర్శకుడు:
దర్శకుడు గౌతం తిన్ననూరి కథ పట్ల చాలా స్పష్టంగా ఉన్నాడు. కథ ఓ అన్నంత గొప్పగా అనిపించకపోయినా.. దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చెయ్యడంలో తడబడ్డాడు. డెస్టినీ అనేది రాసిపెట్టి ఉంటే మనకు కావాల్సిన వాళ్ళు ఎలాగైనా మన దగ్గరికి వస్తారు అనే పాయింట్ చుట్టూ ఒక సింపుల్ ప్రేమ కథ రాసుకున్నాడు. ఇలాంటి స్టొరీ లైన్ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. అప్పుడెప్పుడో వచ్చిన ఉదయ కిరణ్ మనసంతా నువ్వే కూడా ఇదే లైన్ మీదే ఉంటుంది. అందులో చివరి దాకా హీరో, హీరొయిన్ కలుసుకోరు. ఇందులో మధ్యలోనే కలుసుకుంటారు. అదే తేడా. టీనేజ్ లో ఇద్దరి మధ్య ఎంత ఘాడమైన ప్రేమ ఉందో ఎస్టాబ్లిష్ చేయడానికి గౌతం ఎక్కువ టైం తీసుకోవడం కొంత అసహనానికి గురి చేస్తుంది. ఒకే ప్రేమ కథని త్రీ జనరేషన్ లో బాగానే నేరేట్ చేసిన దర్శకుడు... ఆ విషయంలోనూ అక్కడక్కడా ప్రేక్షకులుకు అసహనాన్ని తెప్పించాడు.
సాంకేతికవర్గం పనితీరు:
సంగీత దర్శకుడు శ్రావణ్ భరద్వాజ్..... చక్కని ఫీల్ ఉన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు మనసును వెంటాడే రెండు చక్కని పాటలు కూడా ఇచ్చిన శ్రవణ్ చాలా మటుకు సినిమాను కాపాడుకుంటూ వచ్చాడు. అసలు సంగీతమే ఈ సినిమాకి మంచి బలమని చెప్పొచ్చు. అంతేకాదు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టాడు శ్రావణ్ భార్గవ్. సినిమాటోగ్రఫీ బావుంది. కొన్ని సీన్స్ ని అందంగా చూపెట్టడంలో సినిమాటోగ్రఫీని అభినందించాలి. ఎడిటింగ్ విషయంలో మరి కాస్త ఫోకస్ పెట్టాల్సింది. ఎడిటింగ్ వర్క్ వీక్ గా వుంది. అలాగే నిర్మాణ విలువలు కూడా ఓ అన్నంతగా లేకపోవడంతో సినిమా కూడా మాములుగానే అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్: నటీనటుల పనితీరు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎమోషన్స్,
మైనస్ పాయింట్స్: స్లో నేరేషన్, తక్కువ నటీనటులు, ఎడిటింగ్, దర్శకత్వం, సినిమా స్టార్టింగ్
రేటింగ్: 2.5 /5