నటీనటులు: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్, నాజర్, సత్యం రాజేష్, పృద్వి, ప్రిన్స్, సురేఖ వాణి, శ్యామల, సత్య కృష్ణ
మ్యూజిక్ డైరెక్టర్: మిక్కీ జె మేయర్
నిర్మాత: నల్లమలపు శ్రీనివాస్, మధు
డైరెక్టర్: శ్రీను వైట్ల
మెగా హీరో వరుణ్ తేజ్ 'ముకుంద' సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా నుండి విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమా సినిమాకి మంచి నటన ను ప్రదర్శిస్తూ తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని హీరోగా నిలబడడానికి ట్రై చేస్తున్నాడు. 'ముకుందా, కంచె, లోఫర్' తో విభిన్న చిత్రాలతో అలరిస్తున్న వరుణ్ తేజ్ ఇప్పుడు... ఒకప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా ఉన్న శ్రీను వైట్ల తో 'మిష్టర్' చిత్రం చేసాడు. ఒకప్పుడు కామెడీ నే నమ్ముకుని చిత్రాలని డైరెక్ట్ చేసిన శ్రీను కి చాలా సినిమాలే హిట్టయ్యాయి. కానీ ఇప్పుడు 'ఆగడు. బ్రుస్ లీ' చిత్రాలతో రేసులో వెనుకబడ్డ శ్రీను వైట్ల బడా హీరోలతో హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. కానీ 'ఆగడు, బ్రుస్ లీ' చిత్రాలు నిరాశ పరచడం తో మళ్ళీ కామెడీ ని నమ్ముకుని మెగా హీరో వరుణ్ తేజ్ తో 'మిష్టర్' చిత్రాన్ని తీసాడు. ఇక ఈ చిత్రంలో హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠి లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హెబ్బా పటేల్ మోడ్రెన్ లుక్ లో ఇరగదీస్తుంటే... లావణ్య త్రిపాఠి మాత్రం పల్లెటూరి అమ్మాయిగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిస్తుంది. మరి ట్రైలర్స్, సాంగ్స్ చూసిన వారు డైరెక్టర్ శ్రీను వైట్ల తన గత సినిమాల ఫ్లేవర్ ని ఈ సినిమాలో కలగలిపినట్లు చేబుతున్నప్పటికీ ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి రెండు ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న డైరెక్టర్ శ్రీను వైట్ల మళ్ళీ ఫామ్ లోకి రావాలంటే ఈ 'మిష్టర్' చిత్రం హిట్ అవడం ఎంతో ముఖ్యం. అలాగే వరుణ్ కూడా హీరోగా ఇండస్ట్రీలో నిలబడాలంటే 'మిష్టర్' చిత్రం హిట్ అవడం అతనికి కంపల్సరీ. మరి ఈ ఇద్దరికీ 'మిష్టర్' చిత్రం ఎలాంటి ఫలితాన్నిచ్చిందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ: కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దులో ఉండే ఒక గ్రామం పిచ్చయ్య నాయుడు( నాజర్)కంట్రోల్ లో ఉంటుంది. అయితే నాజర్ కి ఆ గ్రామంపై పెత్తనం చెలాయించడం అనేది సామాన్యంగా ఆయన చేతికి రాదు. లక్ష్మీ నరసింహ స్వామి ముందు ఊరిలోజరిగే కర్రసాములో ఎవరు గెలిస్తే వారికి ఆ ఊరి మీద పెత్తనం చేసే హక్కు వస్తుంది. అయితే పిచ్చయ్య నాయుడుకి గుండప్ప నాయుడికి(తనికెళ్ళ భరణి) మధ్య జరిగిన కర్ర సాములో పిచ్చయ్య నాయుడు గెలుస్తాడు. అప్పటినుండి ఆ ఊరి మీద పెత్తనం పిచ్చయ్య నాయుడు చేతిలోనే ఉంటుంది. అప్పటినుండి గుండప్ప నాయుడు, పిచ్చయ్య నాయుడిపై పగ పెంచుకుంటాడు. అయితే ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న అడవుల్లో రంగురాళ్ల దొరుకుతాయని శరద్ కేల్కర్‌కి తెలుస్తుంది. వాటిని ఎతికి పట్టుకోవడం కోసం గుండప్ప నాయుడు సహాయం తీసుకుంటాడు శరత్. ఇక పిచ్చయ్య నాయుడు మనవడు జై( వరుణ్)విదేశాల్లో ఉంటాడు. అక్కడే ఉంటున్న జై ఇండియా నుండి స్పెయిన్ కి వచ్చిన ప్రియని తీసుకురావడానికి ఎయిర్ పోర్ట్ కివెళతాడు. అయితే ప్రియకి బదులు జై, మీరా (హెబ్బా పటేల్) ను తీసుకొస్తాడు. ఇక మీరా ని చూసిన క్షణంలోనే మీరాతో ప్రేమలో పడతాడు. మీరాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సమయంలో మీరా, సిద్ధార్థ్ (ప్రిన్స్ )ను లవ్ చేస్తుందని తెలుసుకుంటాడు. మీరా కూడా ఇదే విషయం చెప్పి ఇండియాకి వెళ్ళిపోతుంది. ఇక ఇండియాలో మీరా కి సహాయం చెయ్యడానికి వచ్చిన జై కి మార్గ మధ్యలో చంద్రముఖి (లావణ్య త్రిపాఠి) తారసపడింది. ఆమె ఒక రాయల వంశానికి చెందిన అమ్మాయి. అయితే అనుకోని పరిస్థితుల్లో జైకి చంద్రముఖి కి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. కానీ అప్పటికే చంద్రముఖి పెళ్లి శరత్ తో ఖాయం చేస్తారు పెద్దలు. ఇక చంద్రముఖి కోసం శరత్ కి జై కి మధ్యన కర్రసాము జరుగుతుంది. అసలు మీరాకొచ్చిన సమస్య ఏమిటి? జై, చంద్రముఖిని ప్రేమిస్తాడా? అసలు చంద్రముఖికి జై కి నిశ్చితార్ధం ఎందుకు జరుగుతుంది? శరత్ కేల్కర్ కి జై కి మధ్యన జరిగిన కర్రసాములో ఎవరు గెలుస్తారు? ఈ విషయాలన్నీ తెలియాలంటే ఖచ్చితంగా తెర మీద మిష్టర్ చిత్రాన్ని వీక్షించాల్సిందే.
నటీనటుల పాత్ర: వరుణ్ తేజ్ నటనలో మంచి గ్రెస్ చూపించాడు, డాన్స్ లో ఫైట్స్ లో బాగానే ఇంప్రూవ్ అయ్యాడు. చాల రిచ్ లుక్ లో కనిపించాడు వరుణ్, జై కేరెక్టర్ కి బాగా సూట్ అయ్యాడనిపించింది. ఇక హీరోయిన్స్ లో హెబ్బా పటేల్ చాల రిచ్ గా మోడరన్ గర్ల్ గా కనిపించింది. అలాగే అందాల ఆరబోతలో ఎప్పటిలాగే రొటీన్ గా కనిపించింది హెబ్బా. ఇక మరో హీరోయిన్ లావణ్య త్రిపాఠి లంగా వోణిలో ట్రెడిషనల్ లుక్ లో అదర గొట్టింది. కానీ ఆమెకి ఎక్కడా అందాల ఆరబోతకు ఛాన్స్ ఇవ్వలేదు. చంద్రముఖి కేరెక్టర్ లో లావణ్య ఒదిగిపోయి ఎప్పటిలానే మంచి నటన ప్రదర్శించింది. ఇక నాజర్, తనికెళ్ళ భరణి పెద్దమనుషులుగా బాగానే నటించారు. రఘుబాబు, షేకింగ్ శేషు కామెడీ పరవాలేదనిపించింది. సురేఖ వాణి, సత్య కృష్ణ, శ్యామల వారి పరిధిమేర ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు: ముందుగా మనం దర్శకుడు శ్రీను వైట్ల గురించి మాట్లాడుకోవాలి. శ్రీను వైట్ల ఇండస్ట్రీలోకి 'ఆనందం' సినిమాతో అడుగుపెట్టాడు. అప్పటి నుండి కామెడీకి పెద్ద పీట వేస్తూ సినిమాలు హిట్ కొట్టుకుంటూ టాప్ డైరెక్టర్స్ రేంజ్ కి ఎదిగిన శ్రీను వైట్లకి రచయితలు గోపి మోహన్, కోన వెంకట్ లు బాగా హెల్ప్ చేశారు. వారు రాసిన కథలతోనే మంచి చిత్రాలు చేసిన శ్రీను కి కోన వెంకట్ తో గొడవ పడడం దగ్గరనుండి కష్టాలు మొదలయ్యాయి. ఇక కోన ని పక్కన పెట్టేసి గోపి మోహన్ సహాయంతో సినిమాలు చేస్తున్న శ్రీను కి ప్లాపులు వెంటాడుతున్నాయి. 'ఆగడు, బ్రుస్ లీ' చిత్రాల పరాజయం తర్వాత ఎట్టకేలకు మెగా హీరో వరుణ్ తో 'మిష్టర్' చిత్రాన్ని తెరకెక్కించాడు శ్రీను వైట్ల. ఇక ఈ చిత్రం కూడా కొద్దిగా కామెడీ ని నమ్ముకుని చేసాడనే అనిపిస్తుంది. అసలు కథ లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేసాడు శ్రీను వైట్ల. ఒక కేరెక్టర్ కి మరో కేరెక్టర్ కి సంబంధం లేకుండా చేసి హడావిడి చేసేసాడు. సినిమాని రిచ్ గా అయితే మలచగలిగాలిగాడు గాని కొత్తదనంలేకుండా చేసేసాడు. విన్న ప్రతి డైలాగ్, సీన్ కూడా ఎక్కడో విని, చూసినట్టు ఉంటుంది. ఇక కామెడీ ఎక్కడా నవ్వు తెప్పించదు. సెకండ్ హాఫ్ మరీ బోర్ కొట్టించే విధంగా వుంది. ఇక గోపి మోహన్ కథను ఎలా సినిమాగా చేయాలనుకుని శ్రీను వైట్లకి ఇచ్చాడో అర్ధం కానీ పరిస్థితి. ఇక ఎడిటింగ్ లో కూడా చాలా లోపాలున్నాయి. కెమెరామేన్ గుహన్ పనితనం సినిమాకు కొద్దిగా ప్లస్ అయింది. లొకేషన్లు కూడా బాగా చూపించాడు. రోడ్ సీన్లు, కార్ ఛేజ్‌లు, స్పెయిన్ అందాలు, పల్లెటూరి అందాలు ఇలా స్క్రీన్ మీద ప్రతి లొకేషనూ చాలా ఫ్రెష్‌గా, కలర్ఫుల్గా, కొత్తగా కనిపించింది. ఇక పాటల విషయానికి వస్తే మిక్కీ జె మేయర్ మ్యూజిక్ ఆకట్టుకోలేక పోయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్: వరుణ్ తేజ్, స్పెయిన్ ఎపిసోడ్
మైనస్ పాయింట్స్: కథ,కథనం, దర్శకత్వం, మ్యూజిక్, ఎడిటింగ్, సెకండ్ హాఫ్
రేటింగ్: 1.5 /5