మెంటల్ మదిలో మూవీ రివ్యూ

Update: 2017-11-24 10:31 GMT

ప్రొడక్షన్ హౌస్: ధర్మప్రద క్రియేషన్స్

నటీనటులు: శ్రీ విష్ణు, నివేత సేతురాజ్, అమృత శ్రీనివాస్, శివాజీ రాజా మొదలుగు వారు

సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి

నిర్మాత: రాజ్ కందుకూరి

దర్శకత్వం: వివేక్ ఆత్రేయ

శ్రీవిష్ణు ఇండస్ట్రీలోకి కేరెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి.. ఇలా హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. నారా రోహిత్ కి ఫ్రెండుగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన శ్రీవిష్ణు అటు సన్నాఫ్ సత్యమూర్తి, ఇటు ఉన్నది ఒకటే జిందగీలో కూడా హీరో ఫ్రెండ్ కేరెక్టర్ లో జీవించాడు. ఉన్నది ఒకటే జిందగీలో చేసింది చిన్న పాత్రే అయినా శ్రీవిష్ణు కేరెక్టర్ కి మంచి మార్కులు పడ్డాయి. అలాగే నారా రోహిత్ తో కలిసి నటించిన అప్పట్లో ఒక్కడుండేవాడులో కూడా శ్రీవిష్ణు నటన సూపర్బ్. ఇక ఇప్పుడు శ్రీవిష్ణు ని హీరోగా పెట్టి.. వివేక్ ఆత్రేయ అనే కొత్త దర్శకున్ని పరిచయం చేస్తూ పెళ్లి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి ఈ మెంటల్ మదిలో అనే ప్రేమకథని తెరకెక్కించాడు. పెళ్లి చూపులు వంటి చిన్న చిత్రాన్ని నిర్మించి మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న రాజ్ కందుకూరి ఆ చిత్రంతో తిరుగులేని హిట్ కొట్టాడు. చిన్న సినిమాగా విడుదలైన పెళ్లి చూపులు సినిమా సునామీలా ప్రభంజనం సృష్టించింది. ఇక ఇప్పుడు కూడా రాజ్ కందుకూరి... మెంటల్ మదిలో అనే చిత్రాన్ని నిర్మించాడు. పెళ్లి చూపులు నిర్మాత, ఒక చక్కటి హీరోతో రూపుదిద్దుకున్న మెంటల్ మదిలో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ చిత్రాన్ని కూడా బడా నిర్మాత సురేష్ బాబు సురేష్ బాబు సమర్పించేందుకు ముందుకు రావడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరి ప్రేక్షకుల అంచనాలు మెంటల్ మదిలో ఏ మాత్రం రీచ్ అయ్యిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

అరవింద్ కృష్ణ (శ్రీవిష్ణు ) కి సిగ్గు, మొహమాటం చాలా ఎక్కువ. అలాగే అన్నిటికి కన్ఫ్యుజ్ అయిపోతాడు. స్థిమితంగా ఆలోచన చేసే అలవాటు లేకపోవడం ఇతని బలహీనత. ఎవ్వరితోను తొందరగా కలవలేడు. ఎప్పుడు చూసినా అయోమయంలో మునిగి తేలుతూ ఉంటాడు. చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల అరవింద్ అమ్మాయిలంటే ఒక రకమైన అయిష్టత, భయం పెంచుకుంటాడు. ఇక తన కొడుక్కి ఉన్న ఈ కన్ఫ్యుషన్ పిచ్చి వల్ల తన కొడుకు ఎం అవుతాడో అని భయపడుతూ ఉంటాడు శివాజీ రాజా. ఎందుకంటే అరవింద్ కృష్ణ ఈ కన్ఫ్యుషన్ వల్ల అమ్మాయిలతో మాట్లాడటానికి కూడా భయపడతాడు. సరే పెళ్లి చేసి మార్పు తెద్దాం అని సంబంధాలు చూడటం మొదలు పెడతారు. అరవింద్ ప్రవర్తన వల్ల చాలా మ్యాచెస్ మిస్ మ్యాచ్ అవుతాయి. కాని స్వేచ్చ(నివేతా పెతురాజ్)ని చూసాక మాత్రం తన నిర్ణయం మార్చుకుంటాడు అరవింద్.ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. ఇక్కడ పెళ్లి ఫిక్స్ అయ్యాక అరవింద్ జాబ్ ముంబై కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ ముంబై లో అరవింద్ కి అమృత అనే అమ్మాయి దగ్గరవుతుంది. కొద్ది రోజులయ్యాక అరవింద్ స్వేచ్చకు ఫోన్ చేసి బ్రేక్ అప్ చెప్పేస్తాడు. ఇప్పుడు అరవింద్ కి మళ్ళి కన్ఫ్యుషన్ అసలు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని. ఫైనల్ గా అరవింద్ ఈ కన్ఫ్యుషన్ నుంచి బయటపడి ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు? అసలు అక్కడ ఏం జరిగింది.? ఇష్టపడిన స్వేచ్చను అరవింద్.. అమృత కోసమే ఎందుకు వద్దు అనుకున్నాడు? అనేవి తెలియాలంటే... మెంటల్ మదిలో సినిమాని వెండితెర మీద వీక్షించాల్సిందే.

నటీనటుల నటన:

అరవింద్ కృష్ణ పాత్ర లో శ్రీ విష్ణు ఇరగదీసాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా మొత్తం తన యాక్టింగ్ లో ఎలాంటి డౌన్ ఫాల్ లేకుండా మంచి నటనని కనబరిచాడు శ్రీ విష్ణు. కన్ఫ్యుషన్ అయ్యే ఒక అబ్బాయి క్యారెక్టర్ ని బాగా అడాప్ట్ చేసుకొని ఒక ఫీల్ తో క్యారీ చేసాడు శ్రీ విష్ణు. సిగ్గు బిడియం కలిగిన పాత్రలో చక్కని నటనతో ఆకట్టుకున్నాడు. పాత్రకు తగ్గట్టు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ తో శ్రీ విష్ణు నటన అద్భుతః.... పక్కింటి అబ్బాయిలా కనిపించి.... చాలా సహజంగా నటించాడు. ఇక హీరోయిన్ నివేత పేతు రాజ్ అయితే ఒక మోడ్రన్ గర్ల్ గా తన లైఫ్ మీద క్లారిటీ ఉన్న వ్యక్తి గా బాగా చేసింది. తెలుగు లో నివేత ది ఈ మూవీ ఫస్ట్ మూవీ యే అయినా గాని లేడీ నాని అనే బిరుదుని తెచ్చుకుంది నివేత. ఇదిలా ఉంటే ఈ సినిమా లో హీరో హీరోయిన్స్ కేరెక్టర్స్ తర్వాత మనం చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ శివాజీ రాజా. హీరో తండ్రి గా నటించిన ఆయనకి ఈ మూవీ ఒక మంచి పేరుని తెచ్చిపెడుతుంది. దాదాపు చాలా ఏళ్ళ తరువాత శివాజీ రాజా కి ఒక మంచి పాత్ర దొరికింది. అలాగే సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ చేసిన అమృత కూడా పోష్ గర్ల్ గా మంచి ఈజ్ చూపించింది. బబ్లీ లుక్, చలాకి యాక్టింగ్ తో మెప్పించింది. ఇక అనిత చౌదరి, రాజ్ ముదిరాజ్, కిరీటి ధర్మరాజు వారి వారి పాత్రల్లో మెప్పించారు.

దర్శకుడు:

దర్శకుడు వివేక్ ఆత్రేయ ఒక మంచి యూత్ఫుల్ సబ్జెక్టు తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాని ఏ కన్ఫ్యుషన్ పాయింట్ తో అయితే స్టార్ట్ చేసాడో అదే పాయింట్ ని చివరివరకు వరకు ఉంచి సక్సెస్ అయ్యాడు. అసలు ఏ మూవీకైనా కథ, కథనం ముఖ్యం కాని అన్ని మూవీస్ కి అన్ని సెట్ అవ్వవు, కాని వివేక్ ఆత్రేయ మాత్రం కథకి తగ్గ కథనం తో క్లారిటీ తో తను చెప్పాలి అనుకున్నది సోది లేకుండా చెప్పాడు. హీరో పాత్రని సహజ సిద్ధం గా చూపించి సక్సెస్ అయ్యాడు. అలాగే ఒక సింపుల్ కథని చక్కటి స్క్రీన్ ప్లే తో నడిపిస్తే మంచి ఫలితం ఉంటుందని... దర్శకుడు వివేక్ నిరూపించాడు. పెళ్లిచూపులు తరహాలోనే చాలా కూల్ గా, నీట్ గా, సాఫీగా సాగిపోతుంది ఈ మెంటల్ మదిలో. ఇక డెఫినిట్ గా వివేక్ ఆత్రేయ కి ఇండస్ట్రీ లో డైరెక్టర్ గా మంచి ఫ్యూచర్ ఉంటుంది.

సాంకేతికవర్గం పనితీరు:

ప్రశాంత్ విహారి అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి తన మ్యూజిక్ తో ప్రాణం పోసాడు. ఏదో సాంగ్స్ అంటే డ్యూయెట్ కోసమే అని కాకుండా సందర్బానికి తగ్గట్టు సంగీతాన్ని అందించాడు ప్రశాంత్. ముఖ్యంగా 'మనవి ఆలకించరాదటే' పాట తో క్లైమాక్స్ ని పీక్స్ కి తీసుకెళ్ళి పోయాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ ని కూడా అద్భుతంగా అందించాడు ప్రశాంత్. అలాగే సినిమాటోగ్రాఫర్ అయిన వెదరామన్ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ తో సినిమాని ఒక ఆర్ట్ ఫిలిమ్‌ లాగ తీర్చిదిద్దాడు. సినిమాకి సహజత్వం క్రియేట్ చెయ్యడంలో సినిమాటోగ్రఫీ సక్సెస్ అయ్యింది. అలాగే సినిమాకి ఆర్ట్ వర్క్ ని అందించిన మనీషా సత్యవోలు కూడా కథని ముందుకి నడిపే క్రమం లో తన వంతు కృషి చేసి మంచి ఆర్ట్ వర్క్ ని అందించింది. ఇకపోతే... ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే.. సినిమా స్థాయి మరోలా ఉండేది. ఇక ఇండస్ట్రీ లో స్టార్ హీరోస్ డేట్స్ కోసం వెయిట్ చేసి కోట్ల డబ్బులు ఖర్చుపెట్టి సినిమాలు తీసే నిర్మాతలు ఉన్న ఈరోజుల్లో కేవలం ఒక షార్ట్ ఫిలిం మేకర్ తీసుకువచ్చిన కథని నమ్మి సినిమా తీసి... ఆ కథకి మళ్ళి స్టార్స్ ని పెట్టకుండా శ్రీ విష్ణు లాంటి కుర్ర హీరో తో వెళ్లి మూవీస్ పై తనకి ఎంత ప్యాషన్ ఉంది అనేది నిరుపించుకున్నాడు రాజ్ కందుకూరి. రాజ్ కందుకూరి అందించిన నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా ఆకట్టుకునేలా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

శ్రీవిష్ణు నటన, నివేత సేతురాజ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ స్లో కథనం, ట్విస్ట్ లు లేకపోవడం.

రేటింగ్: 3.0 /5

Similar News