మేడ మీద అబ్బాయ్ మూవీ రివ్యూ

Update: 2017-09-08 14:22 GMT

న‌టీన‌టులు: అల్ల‌రి న‌రేష్‌, నిఖిలా విమ‌ల్‌, అవ‌స‌రాల శ్రీనివాస్‌, హైప‌ర్ ఆది, జ‌య‌ప్ర‌కాష్‌

సంగీతం: షాన్ రెహ‌మాన్

సినిమాటోగ్ర‌ఫీ: ఉన్ని ఎస్‌.కుమార్‌

నిర్మాత: బొప్ప‌న చంద్ర‌శేఖ‌ర్‌

ద‌ర్శ‌క‌త్వం: జి.ప్ర‌జిత్‌

సినిమా పరిశ్రమలో కామెడీ హీరోగా పాతుకుపోయి భారీ హిట్స్ కొట్టకపోయినా... మంచి విజయాలే నమోదు చేస్తూ దూసుకుపోయిన అల్లరినరేష్ కి గత నాలుగేళ్లుగా ఒక్క విజయం కూడా లేదు. ఒకప్పుడు వరుస విజయాలతో నిలబడిన హీరో అల్లరి నరేష్ ఇప్పుడు వరుస పరాజయాలతో కొట్టుకుపోతున్నాడు. ఏ సినిమా చేసిన పరాజయమే చవిచూడడంతో ఇప్పుడు ప్రముఖ ఛానల్ లో జబర్దస్త్ తో ఫెమస్ అయిన హైపర్ ఆదిని పక్కన పెట్టుకుని 'మేడ మీద అబ్బాయి' అంటూ మరోసారి ప్రేక్షకులను నవ్వించడానికి వచ్చేస్తున్నాడు. జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ అంటే పడి చచ్చిపోయే ప్రేక్షకులు ఇప్పుడు ఈ సినిమాలో ఆది అల్లరి కామెడీ ఎలా వుండబోతుందో అనే దానిమీద విపరీతమైన ఆసక్తిని కనబర్చడంతోనే ఈసినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆదిని నమ్ముకుని ప్రజీత్ దర్శకత్వంలో అల్లరి నరేష్ ఈ సినిమా చేసాడు. మరి ఈ సినిమాతో అయినా అల్లరోడి ఫిట్ మారి విజయపథంలోకి దూసుకెళతాడో లేదో అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శ్రీను ( అల్లరి నరేష్) తల్లితండ్రులు, శ్రీను ని ఇంజినీరింగ్ చదివిస్తారు. అప్పుచేసి మరీ ఇంజినీరింగ్ చదువుతున్న శ్రీను(అల్లరి నరేష్) బాధ్యత లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ బిటెక్ లో ఉన్న 24 సబ్జక్ట్స్ లో ఫెయిల్ అవుతాడు. అయితే చదువులో టోటల్ గా ఫెయిల్ అయిన శ్రీను సినిమా రంగం వైపు దృష్టి పెడతాడు. మరి సినిమాలవైపు మళ్ళిన శ్రీను స్నేహితుడు ఆదితో కలిసి ఒక షార్ట్ ఫిలిం తీసి దాని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళికి చూపించి ఆయన మెప్పుపొంది.... ఆయన సహాయంతో స్టార్ డైరెక్టర్ అవ్వాలని కలలు కంటుంటాడు. అందుకోసం ముమ్మర ప్రయత్నాలు మొదలుపెడతాడు. అయితే శ్రీను పక్కింటిలోకి సింధు(నిఖిల్) అనే అమ్మయి దిగుతుంది. సింధు ని చూసిన శ్రీను... తనకి సింధుకి మధ్య ప్రేమ బంధం ఉన్నట్లుగా ఫ్రెండ్స్ దగ్గర కలరింగ్ ఇస్తాడు. కానీ సింధు, శ్రీనుని అస్సలు పట్టించుకోదు. మరి శ్రీను నిజంగానే సినిమా దర్శకుడు అయ్యాడా? శ్రీను ఫ్రెండ్స్ కి చెప్పింది విన్న సింధు ఏం చేస్తుంది? నిజంగానే సింధుకి శ్రీనుకి మధ్యలో ప్రేమ ఉంటుందా? అసలు శ్రీను కెరీర్ ఏ మలుపు తిరుగుతుంది? అనేది మాత్రం వెండితెరమీద వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు:

అల్లరి నరేష్ ఎప్పటిలాగే తన కామెడీతో మెప్పించాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో కామెడీ పండించాడు. ప్రేమికుడిగా అలా అలా అనిపించినా అల్లరోడు... దర్శకుడు కావాలని తపన పడే వ్యక్తిగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాకి బ్యాక్ బోన్ వంటివాడు హైపర్ ఆది. అల్లరి నరేష్ కి స్నేహితుడిగా చేసిన ఆది సినిమా మొత్తం అతని భుజాల మీద మోసాడా అనే లెవల్లో అతని డైలాగ్ డెలివరీ ఉంది. సినిమాకి బయట ఇంత క్రేజ్ రావడానికి హైపర్ ఆది అని డంఖా బజాయించి చెప్పినట్లే అతని పాత్రని దర్శకుడు బాగా హైలెట్ చేసాడు. ఇక హీరోయిన్ గా నటించిన నిఖిలకు నటనలో పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఉన్నంతలో నటించి మెప్పించింది. మిగతా నటీనటులు తమపరిధిమేర ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు:

అల్లరి నరేష్ సినిమా అంటేనే కామెడీ అనుకునే లెవల్లో అల్లరి సినిమాలు ఉండేవి. అయితే ఈ మధ్య అల్లరి నరేష్ నటించే సినిమాలన్నీ ప్రేక్షకుల తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ సినిమాలో కూడా దర్శకుడు కామెడీనే హైలెట్ గా తీసుకున్నాడు. హైపర్ ఆది సహాయంతో కామెడీ ట్రాక్ ని సెట్ చేసిన దర్శకుడు మెయిన్ కథను మాత్రం అడ్డదిడ్డలుగా చూపించి బోర్ కొట్టించాడు. కథ, కథనాలు బలంగా ఉండి ఇదే స్థాయిలో కామెడీ వర్కౌట్ అయినట్లయితే సినిమా మంచి విజయం సాధించేది. ఇక మేడ మీద అబ్బాయి మ్యూజిక్ విషయానికొస్తే ఈ సినిమాకి అందించిన సంగీతం చెప్పుకో దగిన స్థాయిలో ఆకట్టుకోదు. పాటలు ఈ సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా షాన్ రెహ‌మాన్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. సినిమాటోగ్రఫీ పర్వాలేదనేలా వుంది. కొన్ని సన్నివేశాలను చాలా అందంగా చూపించారు. ఎడిటింగ్ లో చాలా లోపాలున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో పలు సీన్స్ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. దర్శకుడు స్క్రీన్ ప్లే లో మరింత ఎంటర్టైన్మెంట్ ని జోడించినట్లయితే ఈసినిమా ఖచ్చితంగా విజయం సాధించేది. ఇక నిర్మాణ విలువలు ఓకె ఓకె గా వున్నాయి.

ప్లస్ పాయింట్స్: అల్లరి నరేష్, హైపర్ ఆది, కామెడీ సీన్స్, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం, ఎడిటింగ్

రేటింగ్: 2.5/5

Similar News