'యుద్ధం శరణం' మూవీ రివ్యూ

Update: 2017-09-08 09:33 GMT

నటీనటులు: నాగ‌చైత‌న్య‌, శ్రీకాంత్‌, లావ‌ణ్య త్రిపాఠి, రావు ర‌మేష్‌, రేవ‌తి

సంగీతం: వివేక్ సాగ‌ర్‌

నిర్మాత: ర‌జ‌నీ కొర్ర‌పాటి

ద‌ర్శ‌క‌త్వం: కృష్ణ మారిముత్తు

త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్న నాగ చైతన్య కు పెళ్ళికి ముందు విడుదలైన చిత్రం 'యుద్ధం శరణం'. ఈ చిత్రం తర్వాత నాగ చైతన్య రెండు మూడు సినిమాలు చేస్తున్నప్పటికీ ప్రస్తుతానికి ఈ చిత్రం గురించే ఎక్కువ రోజులు మాట్లాడుకుంటారు. ఎందుకంటే రెండు మూడు సినిమాలు లైన్ లో ఉన్నప్పటికీ అవి చైతు పెళ్లి తర్వాతే పట్టా లెక్కే ఛాన్స్ ఉండడం... పెళ్లి తర్వాత షూటింగ్స్ కి కొన్ని రోజులు గ్యాప్ రావడం వంటి విషయాలతో ఎక్కువరోజులు 'యుద్ధం శరణమే'... జనాల నోళ్ళలో నానుతుంది.'రారండోయ్ వేడుక చూద్దాం' వంటి హిట్ సినిమా తర్వాత నాగ చైతన్య చేసిన 'యుద్ధం శరణం' మీద కూడా మంచి అంచనాలున్నాయి. అందులోను ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ విలన్ గా కనిపించడం, రేవతి వంటి బడా నటులు ఈ సినిమాలో భాగం కావడం వంటి వాటితో సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయ్యింది. లావణ్య త్రిపాఠి కూడా ఈ సినిమాలో మొదటిసారిగా హాట్ గా గ్లామర్ షో చేసింది. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో చాలా పద్దతిగల అమ్మాయిగా కనిపించిన లావణ్య ఈ 'యుద్ధం శరణం'లో మొదటిసారిగా మోడరన్ అమ్మాయిలా కనిపిస్తుంది. ఈ సినిమాని రాజమౌళి ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడైన, అభిరుచి గల నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించడంతో ఈ సినిమాలో ఎంతోకొంత విషయం ఉన్నదని అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. మరి ఈ సినిమాని మాస్ ఎంటర్టైనర్ గా నాగ చైతన్య చిన్ననాటి ఫ్రెండ్ దర్శకుడు కృష్ణ మారిముత్తు ఎలా తెరకెక్కించాడు.? నాగ చైతన్య కి తన ఫ్రెండ్ కృష్ణ, పెళ్ళికి ముందు ఎలాంటి విజయం అందించాడు.? అలాగే మాస్ అచ్చిరాని నాగ చైతన్య మళ్ళీ యాక్షన్ కమ్ థ్రిల్లర్ తో ఎలా ఆకట్టుకోబోతున్నాడు? ఇక విలన్ గా టర్న్ తీసుకుని హీరోగా మెప్పించిన శ్రీకాంత్ మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా ఎలా ఆకట్టుకున్నాడు.? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

క‌థ‌:

డాక్టర్స్ అయిన ముర‌ళీ దంప‌తులు (రావు ర‌మేశ్‌, రేవ‌తి) సమాజానికి ఎదో ఒకటి చెయ్యాలనే తలంపుతో కష్టపడుతుంటారు. మురళి దంపతులకి ఇద్ద‌రు అమ్మాయిలు.... ఒక‌ అబ్బాయి. అబ్బాయి అర్జున్ (నాగ‌చైత‌న్య‌). అర్జున్ డ్రోన్ డిజైనింగ్ చేస్తుంటాడు. కుటుంబం అంటే ఎంతో ఇష్టపడే అర్జున్ కి తన తల్లితండ్రుల ఆసుపత్రిలో ట్రైనింగ్ కోసం వచ్చిన మురళి స్నేహితుడు కూతురు అంజలి (లావ‌ణ్య త్రిపాఠి)తో పరిచయం పెంచుకుంటాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమకి దారితీస్తుంది. అర్జున్, అంజలి ప్రేమలో మునిగితేలుతుండగా... ప‌ద‌వుల‌ను ఆశించిన రాజ‌కీయ‌నాయ‌కుడు (వినోద్ కుమార్‌) సిటీ లో బాంబులు పెట్టిస్తాడు. ఆ బాంబులు పెట్టడానికి నాయ‌క్ (శ్రీకాంత్‌)ను వాడుకుంటాడు వినోద్ కుమార్. ఇలాంటి సంఘటలు జరిగే టైం లోనే అనుకోకుండా అర్జున్ తల్లితండ్రులు ,మురళి దంపతులు చ‌నిపోతారు. అలాగే అర్జున్ అక్కాచెల్లెళ్లు కూడా ప్రమాదంలో పడతారు. అసలు అర్జున్ తల్లితండ్రులు ఎలా చనిపోతారు? వారిది హ‌త్యా? అనుకోని ప్ర‌మాద‌మా? అసలు నాయక్ చేసిన బాంబు బ్లాస్ట్ వల్లనే ముర‌ళీ దంప‌తులు చనిపోతారా? తల్లితండ్రుల మరణానికి కారణాలు అర్జున్ కి తెలుస్తాయా? అర్జున్ విలన్ తో పోరాటం చేస్తూనే కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? ఇన్ని సస్పెన్సు లకు తెర దించాలి అంటే ఖచ్చితంగా 'యుద్ధం శరణం' సినిమాని వెండితెర మీద వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు:

అర్జున్ గా నాగ చైతన్య నటన బావుంది. కాకపోతే గౌత మీనన్ 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంలో నాగ చైతన్య కేరెక్టర్ ఎలా ఉంటుందో.... ఈ 'యుద్ధం శరణం' లో కూడా చైతు కేరెక్టర్ దాదపు అలానే ఉంటుంది. నటన పరంగా నాగ చైతన్య కి పెట్టడానికి ఏమి లేదు. కానీ ఎక్కడా చైతు పాత్ర కొత్తగా కనిపించదు. అలాగే హీరోయిన్ లావణ్య కేవలం గ్లామర్ గా మాత్రమే కనబడింది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. డాక్టర్ అంజలిగా కాస్త మెప్పించింది. ఇక నటుడు శ్రీకాంత్ విలన్ గా బాగానే మెప్పించాడు. కానీ శ్రీకాంత్ పాత్రని ఎక్కువ బలం గా చూపించలేదు. పాత్ర బలహీనంగా ఉండడం వలన శ్రీకాంత్ ఆ పాత్రలో తేలిపోయినప్పటికీ అతని యాగ్రెసివ్ చూపులు, క‌ర‌కైన చేష్ట‌ల‌తో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌తో ఆక‌ట్టుకున్నాడు . పెళ్లి చూపులు ఫెమ్ ప్రియదర్శి ఈ చిత్రంలో చైతు కి స్నేహితుడిగా మెప్పించాడు. రావు రమేష్.. రేవతి తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు:

అసలు దర్శకుడు కృష్ణ 'యుద్ధం శరణం’ కథ ఎలా ఉండబోతుంది అనేది టీజర్, ట్రైలర్లలోనే దాదాపుగా రివీల్ చేసేసాడు. రొటీన్ కథతో కొత్తగా ట్రై చేసాడు కానీ వర్క్ అవుట్ అవ్వలేదు. విజువల్ గా కొంచెం కొత్తగా కనిపించినా... సినిమాలో కథ బలంగా లేకపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు. ఫస్ట్ హాఫ్ అంతా అందమైన కుటుంబం, హీరో హీరోయిన్స్ మధ్య సాగే లవ్ ట్రాక్ ని అందంగా చూపించిన దర్శకుడు సినిమా ద్వితీయార్ధం అంతా యాక్షన్ సన్నివేశాలతోనే నింపేసాడు. అసలు ఒక రోజులో ఓ పాతికేళ్ల కుర్రాడు అటు పోలీసుల‌ను ప‌ట్టించుకోకుండా..... ఇటు ఓ మాఫియా స్థాయి డాన్‌ను అంత తేలిగ్గా ఎలా ఎదుర్కోగ‌లిగాడో ప్రేక్షకులకు అర్ధం కానీ విషయం. ఇక పెళ్లి చూపులకి అందమైన మ్యూజిక్ అందించిన వివేక్ సాగర్ యుద్ధం శరణం పాటల విషయంలో నిరాశ పరిచాడు. కొత్తగా ఏదో చేద్దామని ప్రయత్నించాడు కానీ అది బెడిసికొట్టింది. పాటలు ఒకట్రెండు మినహా మిగతావి ఆకట్టుకునేలా లేవు. అలాగే . వివేక్ సాగర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ పూర్తిగా ట్రాక్ తప్పి పేలవంగా వుంది . విసువల్ పరంగా కొత్తగా అనిపించినా స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం తేడా కొట్టింది. నికేత్ సినిమాటోగ్రఫీ బావుంది. చాలా సన్నివేశాలను చాలా స్టైలిష్ గా చూపించాడు. ఎడిటింగ్ విషయంలో మరికాస్త శ్రద్ద పెట్టి ఉంటె ఈ యుద్ధం శరణంతో నాగ చైతన్య హిట్ కొట్టేవాడు. అలాగే నిర్మాణ విలువలు బావున్నాయి.

విశ్లేషణ:

దర్శకుడు నాగ చైతన్య కి చిన్ననాటి స్నేహితుడు కృష్ణ. అతని మీద నమ్మకంతోనే నాగ చైతన్య ఈ సినిమా చేసాడు. అయితే కృష్ణ మాత్రం చైతు నమ్మకాన్ని వమ్ముచేశాడు.హీరోని కొత్తగా చూపించాలని ఏ దశలోనూ దర్శకుడు అనుకోలేదు. కాబట్టి నాగచైతన్య పాత సినిమా ఏదో చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. మరి శ్రీకాంత్ హీరో నుండి విలన్ గా చేస్తున్న ఈ సినిమాని వారాహి చలన చిత్రం వంటి నిర్మాణ సంస్థ తెరకెక్కించడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ శ్రీకాంత్ పాత్రని హైలెట్ చెయ్యడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. శ్రీకాంత్ తన కెరీర్ ని విలన్ గానే స్టార్ట్ చేసాడు. అప్పట్లో శ్రీకాంత్ విలన్ గా బాగా మెప్పించాడు. ఆతర్వాత హీరోగా చేసాక మళ్ళీ ఇన్నాళ్ళకి విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన యుద్ధం శరణం శ్రీకాంత్ కి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అలాగే పెళ్ళికి ముందు మంచి విజయం అందుకుని మంచి మెమొరీతో పెళ్ళికి సిద్ధమవ్వాలనుకున్న చైతు ఆశలు ఈ చిత్రం అడియాసలు చేసింది. ఓవరాల్ గా ఈ చిత్రంతో నాగ చైతన్య ఒక ప్లాపుని జేబులో పెట్టుకుని పెళ్లి పీటలెక్కబోతున్నాడు.

ప్లస్ పాయింట్స్: నాగ చైతన్య, కొన్ని ట్విస్టులు, శ్రీకాంత్, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: కథ, కథనం, దర్శకత్వం, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్,స్క్రీన్ ప్లే

రేటింగ్: 2.5 /5

Similar News