విడుదల తేదీ : 14 జనవరి 2018
నటీనటులు : రాజ్ తరుణ్, చిత్ర శుక్ల, సితార, ప్రియదర్శి తదితరులు
నిర్మాణ సంస్థ : అన్నపూర్ణ స్టూడియోస్
కూర్పు : శ్రీకర్ ప్రసాద్
సంగీతం : శ్రీ చరణ్ పాకాల
ఛాయాగ్రహణం : కే.ఎల్.విజయ్
నిర్మాత : నాగార్జున అక్కినేని
రచన, దర్శకత్వం : శ్రీ రంజని
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కిన ఉయ్యాలా జంపాల చిత్రంతో వెండితెరకి హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ తిరిగి ఆ సంస్థ లో పని చేయటానికి దాదాపు నాలుగు సంవత్సరాలు నిరీక్షించాడు. ఉయ్యాలా జంపాల తరువాత అంతకంటే పెద్ద హిట్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకి రావటానికి ఈ నిరీక్షణ అని ప్రొమోషన్స్ లో చెప్పిన రాజ్ తరుణ్ పలుకులలో వాస్తవం ఎంత? ప్రయోగాలకి ఎప్పుడూ ముందుండే నాగార్జున ఈ సారి సెల్వ రాఘవ దర్శకత్వ శాఖలో పని చేసిన అనుభవం వున్న లేడీ కి దర్శకత్వ అవకాశం ఇస్తూ కంటెంట్ ని, అది హేండిల్ చేయగల సమర్ధతలని మాత్రమే నమ్మి మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ లో శ్రీ రంజని కి అవకాశం ఇచ్చారు. మరి నిజంగానే నాగ్ నమ్మకం సరైనదేనా? ఈ సంక్రాంతి పండుగకి రంగులరాట్నం రంగుల గాలిపటాలలా ఎగరగలదా లేదా పూర్తి విశ్లేషణలో తెలుసుకుందాం పదండి.
కథ : బాగా నిరాశ నిస్పృహలకు లోనైన విష్ణు(రాజ్ తరుణ్) ప్రస్తుత జీవితం నుంచి ఆరు మాసాలు వెనక్కి వెళ్లి జ్ఞాపకాలని నెమరేసుకుంటాడు. విష్ణు తల్లి(సితార) విష్ణు కి పెళ్లి సంబంధం సెట్ అవ్వాలనే కోరికతో వివిధ ప్రయత్నాలలో భాగంగా పార్క్ లు, యోగ క్లాస్ ల వద్ద లైవ్ పెళ్లి చూపులు లా విష్ణు ని వెంటబెట్టుకుని తీసుకెళ్తుంతుంది. అలా ఎదురైనా ఒక సంబంధం లో పెళ్లి కూతురు విష్ణు ని పెళ్లి తరువాత మీ అమ్మ ఎక్కడ ఉంటుంది అని అడిగిన ప్రశ్నతో అప్పటి వరకు పెళ్లి పై ఎలాంటి స్పష్టత లేని విష్ణు కి ఎలాంటి అమ్మాయి తన జీవితంలోకి రావాలి అనేదాని పై స్పష్టత వస్తుంది. తన కొల్లీగ్, ప్రాణ స్నేహితుడైన శివ(ప్రియదర్శి) తో చేసే సరదా కాలక్షేపాలతో జీవితం సాఫీగా సాగిస్తున్న విష్ణు కి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ముఖం కనిపించని విధంగా హెల్మెట్ మరియు స్కార్ఫ్ ధరించి నియమ నిబంధనలు శిరసావహించి అమ్మాయి తారసపడుతుంది. ఆమె పద్ధతి వింతగా అనిపించి నోరు పారేసుకుంటాడు విష్ణు. ఒక రోజు అనుకోకుండా ఒక పెళ్ళికి పిలవని అతిధులుగా హాజరు అవుతారు విష్ణు, శివ. అక్కడ కీర్తి(చిత్ర శుక్ల) ని చూసి మనసు పారేసుకుంటాడు విష్ణు. తనతో పరిచయం పెంచుకోవటానికి తపిస్తుంటాడు. అదే వేడుక లో తనకి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద తారసపడింది పెళ్లి లో కలిసిన కీర్తినే అని తెలుసుకున్న విష్ణు తన ప్రేమ ఫలించటానికి ఎం చేసాడు? విష్ణు ని కీర్తి ఇష్టపడటానికి విష్ణు తల్లి ఎలాంటి పాత్ర పోషించింది అనేది తెరపైనే చూడాలి.
నటీనటులు : రాజ్ తరుణ్, ప్రియదర్శి, సితార మినహాయిస్తే చిత్రంలో కనిపించే నటీనటుల్ని ప్రేక్షకుడు గుర్తుపట్టలేడు. అంత మంది ఫ్రెష్ ఆర్టిస్ట్ లు అయినప్పటికీ కథ ముందుకు సాగటంలో నటీనటులు తమ వంతు నటనతో సహకరించారు. మరొక సారి ప్రేమ మరియు కుటుంబ సెంటిమెంట్ ల మేళవింపు కథలో హీరోగా నటించిన రాజ్ తరుణ్ చాలా సెట్టిల్డ్ గా నటించి మెప్పించాడు. సితార దూరం ఐన సందర్భాలలో రాజ్ తరుణ్ పలికించిన హావభావాలు అభినందనీయం. చిత్ర శుక్ల తాను పోషించిన కీర్తి పాత్రకి సరిగ్గా నప్పినట్టు అనిపించేలా పెర్ఫర్మ్ చేసింది. గ్లామర్ ఇమేజ్ కి పెద్దగా ఇమడని అమ్మాయిలా కనిపించే చిత్ర శుక్ల కి నటనకి స్కోప్ వున్న కథానాయిక పాత్ర రంగులరాట్నం లో దక్కింది అని చెప్పాలి. చిత్ర శుక్ల కూడా ఈ పాత్రలో చాలా సహజమైన నటనతో ఆకట్టుకుంది. ప్రియదర్శి ఎప్పటిలానే తన టైమింగ్ తో కొద్దిగా నవ్వించగలిగాడు. ఇతర తారాగణం మొత్తం వారి వారి పాత్రల పరిమితుల మేర చక్కగా నటించారు.
సాంకేతిక వర్గం : అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం లో తెరకెక్కే చిత్రాలలో ప్రేక్షకుడు కోరుకునే క్వాలిటీ అందించటంలో రంగులరాట్నం బృందం కూడా సఫలమైయింది. అద్భుతమైన విజువల్ క్వాలిటీ తో పాటు విజయ్ కెమెరా పనితనం ప్రేక్షకుడిని ముగ్ధుడిని చేయక మానదు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో అనూప్ రూబెన్స్ సంగీతం మాత్రమే వింటున్న ప్రేక్షకుడికి కొంచం ఆటవిడుపుగా శ్రీ చరణ్ పాకాల నేపధ్య సంగీతం ఆహ్లాదపరిచింది కానీ పాటల విషయంలో ఒక ప్రేమ కథకి కావలసిన రీతిలో స్వరాలూ అందలేదని చెప్పాలి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కథకి తగట్టుగా ప్రేక్షకుడిని కథలో లీనం చేసే విధంగా వుంటూ అన్వాన్టేడ్ షాట్స్ చొరబడకుండా జాగ్రత్త వహించింది.
శ్రీ రంజిని రచించిన కథ తెలుగు ప్రేక్షకుడికి పరిచయం లేని కొత్త తరహా ప్రేమ కథ అని చెప్పలేము కానీ ప్రేమ, మదర్ సెంటిమెంట్ ల కలబోతగా కథని ప్రెసెంట్ చేయటానికి శ్రీ రంజిని రచనా చాతుర్యం బాగానే పనిచేసింది. కథనం నడిపే విషయంలో మాత్రం ఫస్ట్ హాఫ్ సాగినంత ఎంగేజింగ్ గా సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే నడపడంలో తడబడింది. మేకింగ్ పరంగా కొత్త ప్రయత్నాలు ఏమి కనపరచలేనప్పటికీ ఫీల్ గుడ్ సినిమా కి కావలసిన రీతిలో కథ స్క్రీన్ పై ప్రెసెంట్ చేయటం లో కొంత వరకు సక్సెస్ ఐయింది లేడీ డైరెక్టర్ శ్రీ రంజిని.
ప్లస్ పాయింట్స్ :
నటీనటులు
నేపధ్య సంగీతం
ఛాయాగ్రహణం
ఫస్ట్ హాఫ్
మైనస్ పాయింట్స్ :
సాంగ్స్
సెకండ్ హాఫ్ డ్రాగ్స్
రెగ్యులర్ ప్లాట్
రేటింగ్: 2.75 /5