రాజుగారి గది 2 మూవీ రివ్యూ

Update: 2017-10-13 08:39 GMT

ప్రొడక్షన్ కంపెనీ: పీవీపీ సినిమా

నటీనటులు: నాగార్జున, సమంత, అశ్విన్, సీరత్ కపూర్, తేజస్వి మడివాడ, వెన్నెల కిషోర్, నరేష్, షకలక శంకర్, ప్రవీణ్

మ్యూజిక్ డైరెక్టర్: ఎస్ ఎస్ థమన్

సినిమాటోగ్రఫీ : ఆర్.దివాకరన్

నిర్మాత: ప్రసాద్ వి. పొట్లూరి

దర్శకత్వం: ఓం కార్

రాజుగారి గది తో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న ఓం కార్... ఇప్పుడు రాజుగారి గదికి సీక్వెల్ గా రాజుగారి గది2 ని తెరకెక్కించాడు. రాజుగారి గదిలో ఒక గదిని బేస్ చేసుకుని సినిమా మొత్తం ఫుల్ కామెడీతోనే నడిపించిన ఓం కార్ ఇప్పుడు రాజాగారి గది2 లో కూడా అదే ఫార్ములాని ఉపయోగించాడనే విషయం రాజుగారి గది2 ట్రైలర్ లో తెలుస్తుంది. షకలక శంకర్, వెన్నెల కిషోర్ వంటి వారితో కామెడీని దిట్టంగా దట్టించడమే కాదు.... ఒక సస్పెన్స్ థ్రిల్లర్ టైపులోనే కాక హర్రర్ కామెడీ ఫిలిం గా ఈ సినిమాని తెరకెక్కించాడు. కేవలం కామెడీ మాత్రమే ఈ సినిమాకి ఎస్సెట్ కాదు. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున నటించడం కూడా పెద్ద ఎస్సెట్. నాగార్జున ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న హీరో కావడం ఈ సినిమాలో మానసిక వైద్యుడిగా నటించడానికి ఒప్పుకోవడంతోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగడానికి కారణమయ్యాయి. కేవలం నాగార్జున మాత్రమే కాదు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన సమంత కూడా ఈ సినిమాలో ఒక అమ్మాయి ఆత్మగా కనిపిస్తుంది. కేవలం నాగార్జున, సమంత ల స్టార్ స్టేటస్ లు మాత్రమే కాక ఇప్పుడు వీరిద్దరూ మామకోడలైన కారణంగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి వచ్చేసింది. ఇక రాజుగారి గది కన్నా గది 2 లోనే ఎక్కువ కామెడీ డోస్ ఉండడం.... ఒక ఆత్మ పడే క్షోభ ని ఎమోషన్ ల టచ్ అయ్యేలా తెరకెక్కించడం, వాటితోపాటు హర్రర్ ఎలిమెంట్స్ ఉండడం వంటి విషయాలతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడడమే కాదు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ అంచనాల నడుమ రాజుగారి గది 2 ఈ రోజే పేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సీక్వెల్ దర్శకుడు ఓం కార్ కి ఎలాంటి విజయాన్ని అందించింది. సమంత పెళ్లి తర్వాత విడుదలవుతున్న ఈ చిత్రంతో సమంత ఎంతటి సంతోషాన్ని సొంతం చేసుకుందో అనే విషయం సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

వ్యాపారం నిమిత్తం ముగ్గురు ఫ్రెండ్స్ అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్ కలిసి ఓ పెద్ద బంగ్లాను కొంటారు. ఆ పాత బంగ్లాను ఓ రిసార్ట్‌గా మారుస్తారు. కొన్నాళ్లకు ఆ రిసార్ట్‌లో దెయ్యం ఉన్నట్లు తెలుసుకుంటారు. దీంతో రిసార్ట్‌లో దెయ్యం ఉందని తెలిస్తే ఎవరూ రారని భయపడి ఓ చర్చి ఫాదర్‌ (నరేష్)ని సంప్రదిస్తారు. ఆ ఫాదర్ దెయ్యాన్ని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించి విఫలం కావడంతో ఇలాంటి దెయ్యాలను వెళ్లగొట్టాలంటే ఇండియాలోనే టాప్ 5 మెంటలిస్ట్‌లలో ఒకరైన రుద్ర(నాగార్జున)ని పిలిపిస్తారు. మెంటలిస్ట్‌ రుద్ర కళ్లలోకి చూస్తూనే మనసులో ఏం అనుకున్నారో చెప్పేస్తుంటాడు. ఆ రిసార్ట్స్ లో ఉన్న దెయ్యాన్ని వెళ్లగొట్టేందుకు రిసార్ట్‌కి వెళ్తాడు రుద్ర. అయితే ఆ దెయ్యం ఆత్మగా మారి రుద్రలోకి ప్రవేశిస్తుంది. దీంతో పెద్ద పెద్ద దెయ్యాల పనిపట్టిన రుద్రకి ఈ ఆత్మకథ చాలెంజ్‌గా మారుతుంది. రిసార్ట్‌లో ఆత్మ ప్రతీకారాన్ని కోరుకుంటుంది. అసలు ఆత్మ కథ ఆలా ఎందుకు భయపెడుతుంది.? అసలు ఆ ఆత్మ కథ ఏమిటి? ఎందుకు ఆత్మగా మారి ఆ రిసార్ట్‌లోనే ఉంది? అనేది మాత్రం రాజుగారిది గది 2 ని వెండితెర మీద వీక్షించాల్సిందే.

నటీనటుల పాత్ర:

రాజుగారి గది 2 సినిమా మొత్తం నాగార్జున, సమంత పాత్రల చుట్టూతానే తిరుగుతుంది. నాగార్జున మెంటలిస్ట్ గా రుద్ర కేరెక్టర్ లో అద్భుతంగా నటించాడు. రుద్ర పాత్రలో నాగార్జున జీవించాడనడంలో సందేహమే లేదు. మెంటలిస్ట్ గా రుద్ర ఆత్మని కట్టడి చెయ్యడం... ఆత్మ విషయంలో ఎమోషనల్ గా వుండే సన్నివేశంలో నాగార్జున ఇరగదీసాడు. ఇక ఈ సినిమాకి మరో మెయిన్ కేరెక్టర్ అమృత పాత్ర. సమంత, అమృత పాత్రలో అద్భుతంగా జీవించింది. అమృత ఆత్మగా మారడం... ఆత్మగా క్షోభించడం, తన ఫ్లాష్ బ్యాగ్ గురించి చెప్పేటప్పుడు ఎమోషన్స్ ని, పేస్ లోని ఎక్సప్రెషన్స్ ని సమంత అద్భుతంగా పలికించింది. సెకండ్ హాఫ్ మొత్తం సమంత, నాగార్జున మీదనే నడుస్తుంది. ఇక సమంత తండ్రిగా రావు ర‌మేష్‌ మెప్పించాడు. అమృత తండ్రిగా ఎమోషనల్ సన్నివేశాల్లో రావు నటన సూపర్. ఇక హీరో అశ్విన్ రాజుగారి గది మొదటి పార్ట్ లో లాగే ఇప్పుడు రాజుగారి గది 2 లోను అతని పాత్రకున్న ప్రాముఖ్యతను తెలియజేసింది. సినిమా ఆసాంతం సీరియస్ నెస్ తో ఆహ్లాదంగా కనబడి మెప్పించాడు. ఇక సీరత్ కపూర్ పాత్ర గ్లామరస్ గా ఆకట్టుకుంది. ఉన్నంతలో పర్వాలేదనిపించింది. ఇక మిగిలిన అభిన‌య, నందు, వెన్నెల‌కిషోర్‌, అశ్విన్‌, ప్ర‌వీణ్‌, షకలక శంకర్ లు తన పరిధిమేర బాగానే కామెడీ పండించి ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఒక చిన్న సీన్ లో రాజుగారి గది దర్శకుడు ఓం కార్ కూడా మెరిశాడు.

సాంకేతికవర్గం పనితీరు:

ఓం కార్ సినిమా పరిశ్రమలోకి తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి దర్శకుడిగా మారి కామెడీని నమ్ముకుని సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. రాజుగారి గది మొదటి పార్ట్ ని హర్రర్ కామెడీగా తెరకెక్కించి అద్భుతమైన హిట్ కొట్టాడు. మళ్ళీ అదే కామెడీని బేస్ చేసుకుని ఇప్పుడు రాజుగారి గది 2 ని తెరకెక్కించాడు. ఓం కార్ మ‌ల‌యాళ సినిమాలో మెయిన్ పాయింట్‌ను తీసుకుని దాన్ని తెలుగు ప్రేక్షకులు క‌నెక్ట్ అయ్యేలా తెర‌కెక్కించిన తీరును మాత్రం కచ్చితంగా అభినందించి తీరాలి. అయితే ఓం కార్ ఈసారి కేవలం చిన్న నటీనటులతోనే సరిపెట్టకుండా సీనియర్ హీరో నాగార్జున, టాప్ హీరోయిన్ సమంతలు ఈ సినిమాకి సెలెక్ట్ చేసుకుని సినిమా మొదలుపెట్టినప్పుడే సగం సక్సెస్ సాధించాడు. ఈ సినిమాలో మెయిన్ కేరెక్టర్స్ గా నాగార్జున, సమంత ల పాత్రలను డిజైన్ చేసాడు. అసలు హీరో అశ్విన్ పాత్ర కంటే మెంట‌లిస్ట్ పాత్ర‌ అయిన నాగార్జున పాత్ర‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేసేలా స‌న్నివేశాలు త‌యారు చేశాడు దర్శకుడు ఓం కార్. ఫ‌స్టాఫ్‌లో హీరో క్రైమ్ కేసును పోలీసుల స‌పోర్ట్‌తో సాల్వ్ చేసే స‌న్నివేశం తో స‌హా, క్లైమాక్స్‌లో కూడా హీరో, అస‌లు వ్య‌క్తిని ప‌ట్టుకునే స‌న్నివేశం ఈ సినిమాకి మెయిన్ ప్లస్. అలాగే సెకండ్ హాఫ్ లో సమంత ని ఆత్మగా ఎంటర్ చేయించడమే కాదు... సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ఆత్మగా మారిన అమృత, మెంటలిస్ట్ రుద్ర పాత్రల చుట్టూతానే కథని అల్లాడు. కాకపోతే రాజుగారి గది మొదటి పార్ట్ లో ఉన్న కామెడీని ఈసారి మిస్ చేసాడు ఓం కార్. రాజుగారి గది 2 లో ఓ... అన్నంత కామెడీ మాత్రం లేదు. మొదటి పార్ట్ లో ఉన్న కామెడీ లా ఈ గది 2 లో కూడా ఉందనుకుని ప్రేక్షకుడు థియేటర్ కి వెళితే మాత్రం నిరాశే మిగులుతుంది. రాజుగారి గది 2 లో సరైన కామెడీకి చోటివ్వలేదు దర్శకుడు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే దివాక‌ర‌న్ ప్ర‌తి సన్నివేశాన్ని ఎంతో రిచ్‌గా కనబడేలా తెరకెక్కించాడు. సంగీతం విషయాన్ని వస్తే ఎస్ ఎస్ థమన్ రాజుగారి గది 2 కి అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. ముఖ్యంగా ఆత్మ‌ను చూపించే సంద‌ర్భంలో బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. ఎడిటింగ్ విషయానికొస్తే మాత్రం చిన్న చిన్న లోపలే గాని పెద్దగా లోపాలు కనిపించవు. ఇక ఈ సినిమాకి నిర్మాణ విలువలు మాత్రం బావున్నాయి.

ప్లస్ పాయింట్స్: నాగార్జున, సమంత, మిగతా నటీనటులు నటన, బ్యాగ్రౌండ్ స్కోర్, సెకండ్ హాఫ్, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: కామెడీ లేకపోవడం, ఫస్ట్ హాఫ్

రేటింగ్: 3.0/5

Similar News