రివ్యూ: అజ్ఞాత‌వాసి

Update: 2018-01-10 02:32 GMT

టైటిల్‌: అజ్ఞాత‌వాసి

జాన‌ర్‌: ఫ్యామిలీ & యాక్ష‌న్ డ్రామా

నటీనటులు: పవన్ కళ్యాణ్, అను ఇమ్మానుయేల్, కీర్తి సురేష్, కుష్బూ, బొమ‌న్ ఇరానీ, ముర‌ళీశ‌ర్మ‌ త‌దిత‌రులు

సినిమాటోగ్రఫీ: మనికందన్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

మ్యూజిక్ : అనిరుధ్‌ రవిచంద్ర‌న్‌

నిర్మాత: రాధాకృష్ణ

దర్శకత్వం: త్రివిక్రమ్

సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ

ర‌న్ టైం: 158 నిమిషాలు

రిలీజ్ డేట్‌: 10 జ‌న‌వ‌రి, 2018

మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు, సినీ వర్గాల వారు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా అజ్ఞాత‌వాసి. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కెరీర్‌లో 25వ సినిమాగా తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో పాటు త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌, అనిరుధ్ మ్యూజిక్, కీర్తి సురేష్‌, అను ఎమ్మాన్యుయేల్ లాంటి ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు హీరోయిన్లుగా న‌టించ‌డం, భారీ ప్రి రిలీజ్ బిజినెస్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే విడుదలైన పాటలు మరియు టీజర్‌, ట్రైలర్‌లు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఈ సినిమా స‌రికొత్త రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుంద‌ని కూడా ట్రేడ్ వ‌ర్గాలు ముందు నుంచి అంచ‌నాల‌తో ఉన్నాయి. ప‌వ‌న్‌కు త్రివిక్ర‌మ్ అత్తారింటికి దారేది సినిమాతో కెరీర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇచ్చిన త‌ర్వాత ప‌వ‌న్ న‌టించిన గోపాల‌...గోపాల బిలో యావ‌రేజ్ అయితే, స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, కాట‌మ‌రాయుడు సినిమాలత నిరాశ‌ప‌రిచిన ప‌వ‌న్ ఈ సినిమాతో స్కై రేంజ్‌లో ఉన్న అంచ‌నాలు అందుకున్నాడా ? లేదా ? అన్న‌ది తెలుగుపోస్ట్‌.కామ్ స‌మ‌గ్ర స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:

కోట్ల ట‌ర్నోవ‌ర్ ఉన్న ఓ ఫార్మా కంపెనీ ఓన‌ర్ విందా (బొమ‌న్ ఇరానీ). ఈ కంపెనీలో డైరెక్ట‌ర్ దీన‌బంధు కొడుకు సీతారాం (ఆది పినిశెట్టి) సీఈవో పోస్టు మీద క‌న్నేసి విందాతో పాటు అత‌డి కొడుకుని చంపిస్తాడు. దీంతో విందా మెద‌టి భార్య కృష్ణ‌వేణి (ఇంద్ర‌జ‌) కొడుకు అయిన అభిషిక్త భార్గ‌వ (ప‌వ‌న్ క‌ళ్యాణ్‌) ఎంట్రీ ఇచ్చి త‌న తండ్రి చావుకు కార‌కులైన వారిని చంపి, ఆ కోట్ల రూపాయ‌ల వ్యాపార సామ్రాజ్యాన్ని ద‌క్కించుకోవాల‌నుకుంటాడు. ఈ ప్ర‌యాణంలో విందా రెండో భార్య ఇంద్రాణి ( ఖుష్బూ)తో అత‌డికి ఎలాంటి అనుబంధం ఉంటుంది. సూర్య‌కాంతం (అను ఎమ్మాన్యుయేల్‌), సుకుమారి (కీర్తి సురేష్‌)లు అత‌డి జీవితంలోకి ఎలా వ‌చ్చారు ? మ‌రి అభిషిక్త భార్గ‌వ బాల సుబ్ర‌హ్మ‌ణ్యంగా ఎందుకు మారాల్సి వ‌చ్చింది ? చివ‌ర‌కు అభిషిక్త భార్గ‌వ త‌న తండ్రి విందా, ఇంద్రాణిల క‌ల‌ను ఎలా నెర‌వేర్చాడ‌న్నదే ఈ సినిమా స్టోరీ.

నటీన‌టులు ఏం చేశారంటే...

అత్తారింటికి దారేది సినిమాలో హీరోయిన్ల‌తో స‌ర‌సాలు, సీన్లు ఎలా ఉంటాయో ? ప‌వ‌న్ అక్క‌డ ఏం చేశాడో ఇక్క‌డ కూడా ఇద్ద‌రు హీరోయిన్ల‌తోనూ అదే చేశాడు. కాక‌పోతే ఇక్క‌డ అను ఇమ్మాన్యుయేల్‌కు, కీర్తి సురేష్‌కు కావాల్సిన‌ప్పుడ‌ల్లా గ‌ట్టిగా వాటేసుకునే సీన్లు మాత్రం ఆరేడు ఉంటాయి. అక్క‌డ స‌మంత - ప్ర‌ణీత మ‌ధ్య ప‌వ‌న్ కామెడీ, రొమాన్స్ సీన్లు స్ట్రాంగ్‌గా ఉంటే ఇక్క‌డ అంతే బ‌లంగా వీక్‌గా ఉన్నాయి. ప‌వ‌న్ అభిషిక్త భార్గ‌వ‌గాను, బాల సుబ్ర‌హ్మ‌ణ్యంగా రెండు పాత్ర‌ల్లో హావ‌భావాలు, న‌ట‌న, సింపుల్ స్టెప్స్ అల‌వాటైన రీతిలోనే చేసేశాడు. ఇక హీరోయిన్ల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కీర్తీ సురేష్‌, అను ఎమ్మాన్యుయేల్‌కు ప‌వ‌న్ హ‌గ్‌లు ఇచ్చేందుకు పోటీ ప‌డ్డాడు. కీర్తి కాస్త సంప్ర‌దాయంగా ఉంటే అను మాత్రం అందాలు బాగానే ఆర‌బోసేసింది. త్రివిక్ర‌మ్ సినిమాల్లో హీరోయిన్ల‌కు ఇంత వీక్ క్యారెక్ట‌ర్లు ఉండ‌డం ఇదే ప్ర‌థ‌మం. సినిమాకు వీళ్లు ఎంత మాత్రం హెల్ఫ్ అవ్వ‌లేదు. ఇక చాలా రోజుల త‌ర్వాత తెలుగులో న‌టించిన సీనియ‌ర్ హీరోయిన్ ఖుష్బూను త్రివిక్ర‌మ్ వాడుకోవ‌డంలో ఫెయిల్ అయ్యాడు. అత్తారింటికి దారేదిలో న‌దియాతో పోలిస్తే ఖుష్బూ క్యారెక్ట‌ర్ ఓ మూల‌కు కూడా స‌రిపోదు. త‌న‌కు ఇచ్చిన సీన్ల వ‌ర‌కు ఆమె న్యాయం చేసినా ఆమె క్యారెక్ట‌ర్‌ను ఎలివేట్ చేయ‌డంలో మాత్రం త్రివిక్ర‌మ్ ఫెయిల్ అయ్యాడు. విల‌న్‌గా చేసిన ఆది పినిశెట్టిని ముందుగా చూపిస్తే ఎంత భ‌యంక‌ర‌మైన విల‌నో అనుకుంటారు... చివ‌ర‌కు ఈ క్యారెక్ట‌ర్ తాటాకు టపాకాయ చీదేసిన‌ట్టు తుస్సుమ‌నిపించాడు. వీక్ విల‌నిజం ఉండ‌డంతో ఇటు హీరోయిజం కూడా ఎలివేట్ అవ్వ‌లేదు. త‌నికెళ్ల భ‌రణి, వెన్నెల కిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి ఫ‌స్టాఫ్‌లో చేసిన కామెడీ జ‌స్ట్ యావ‌రేజ్‌. ఇక సెకండాఫ్‌లో ముర‌ళీశ‌ర్మ‌, రావూ ర‌మేష్ మీద తీసిన కామెడీ సీన్లు న‌వ్వూ ఏడుపూ రాన‌ట్టుగా ఉన్నాయి.

సాంకేతిక‌త :

సాంకేతికంగా చూస్తే అన్ని విభాగాల కంటే మ‌నికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ కాస్త ఎఫ‌ర్ట్ పెట్టిన‌ట్టు ఉంది. సినిమాకు ఎక్కువుగా క్లోజ‌ప్ షార్ట్‌లే అవ‌స‌ర‌మ‌య్యాయి. కొన్ని సీన్ల‌కు అవ‌స‌రం లేక‌పోయినా కెమేరాను ఫేస్ మీద ఫోక‌స్ చేసిన‌ట్లుంది. సాంగ్స్ పిక్చ‌రైజేష‌న్ బాగుంది. సినిమా కోసం నిర్మాతలు పెట్టిన ఖ‌ర్చును తెర‌పై చ‌క్కగా ప్ర‌జెంట్ చేసి సినిమాకు ఫ్రెష్‌లుక్ తీసుకువ‌చ్చాడు. ఏఎస్‌.ప్ర‌కాష్ ఆర్ట్ వ‌ర్క్ సీన్ల‌కు త‌గిన‌ట్టుగా ఉంది. కార్పొరేట్ క‌ల్చ‌ర్ వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబించేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. సినిమా అంతా ఒకే టైప్ లొకేష‌న్ల‌లో ఉండ‌డంతో ఇక్క‌డ ఆర్ట్ వ‌ర్క్‌లో మ‌రీ అంత క్రియేటివిటి లేదు. అనిరుధ్ మ్యూజిక్‌లో థియేట‌ర్ నుంచి భ‌య‌ట‌కు వ‌చ్చాక ఒక్క పాట అయినా గుర్తుంటే ఒట్టు. ఇక ఆర్ ఆర్ గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. అన్ని సీన్ల‌కు ఒకే ఆర్ ఆర్‌తో నెట్టుకొచ్చేశాడు. ఈ మాత్రం మ్యూజిక్‌కు త్రివిక్ర‌మ్ కోట్లు పోసి కోలీవుడ్‌కు వెళ్లి అనిరుధ్‌ను తీసుకురావాలా ?

సీనియ‌ర్ ఎడిట‌ర్ కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావును త్రివిక్ర‌మ్ ఇబ్బంది పెట్టాడో ? లేదా ? ఆయ‌నే త్రివిక్ర‌మ్ తీసిన సీన్లు క‌దా ? తాను ఎక్క‌డ కోత పెట్టేస్తే బాగుండ‌దేమోన‌ని మొహ‌మాటానికి పోయాడో గాని సినిమాలో చాలా సీన్లు ల్యాగ్ అయ్యి సినిమాను బోర్ కొట్టించేశాయి. సినిమాలో ఓ సీన్ రేజ్ అవుతుంద‌ని అనుకుంటే వెంట‌నే మ‌ళ్లీ డౌన్ అయిపోయేది. క‌నీసం కొన్ని లాగ్ సీన్లు లేపేసిన‌ట్ల‌యితే సినిమా కాస్త స్పీడ్ అయినా అయ్యి ఉండేది. ఫ‌స్టాఫ్‌లో చాలా ల్యాగ్ ఉంటే సెకండాఫ్‌లో రావు ర‌మేష్‌, ముర‌ళీ శ‌ర్మను ప‌వ‌న్ బెల్టుతో కొట్టే సీన్లు రిపీట్ ఎందుకు చేశారో ? అర్థం కాదు. చిన‌బాబు నిర్మాణ విలువ‌లు రాజీ ప‌డ‌కుండా ఖ‌ర్చు చేశారు.

విశ్లేషణ :

ఓ హిట్ సినిమా నుంచి ప్రేర‌ణ పొంది.. దానికి కొంత సెంటిమెంట్‌, ఎమోష‌న‌ల్ మిక్స్ చేసి, అందులో త‌న పాత సినిమాల స్టైల్‌నే కాపీ కొట్టేసి త్రివిక్ర‌మ్ ఈ సినిమా తీసిన‌ట్టు ఉంది. టైంను వేస్ట్ చేసేవాళ్ల‌ను వీడు టైంను కేక్ తిన్న‌ట్టు తింటున్నాడ‌ని అంటుంటారు. త్రివిక్ర‌మ్ కూడా ఈ సినిమాలో టైంను అలాగే తినేశాడు. సినిమా స్టార్టింగ్ నుంచి మెయిన్ స్టోరీలోకి ఎంట‌ర్ కావ‌డానికి 35 నిమిషాల టైం వేస్ట్‌. సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక రావు ర‌మేష్‌, ముర‌ళీశ‌ర్మ‌ల‌తో కామెడీ కిచీడీ చేసేసి కొడ‌కా కోటేశ్వ‌ర‌రావా సాంగ్‌ను బ‌లవంతంగా ఇరికించేసి మ‌రో 25 నిమిషాలు టైం వేస్ట్‌...ఫ‌స్టాఫ్‌లో హీరోయిన్ల‌తో వ‌చ్చే వేస్ట్ సీన్లు ఇలా చెప్పుకుంటే పోతే సినిమాను న‌డిపించాల‌ని న‌డిపించిన‌ట్టుగా ఉందే త‌ప్పా ఆస‌క్తిక‌రంగా సినిమాను ప్ర‌జెంట్ చేసిన‌ట్టు లేదు.

ముందుగా ఊహించినట్లుగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్షన్ సన్నివేశాలు బావున్నాయి. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సన్నివేశం, ఇంటర్వెల్ బ్యాంగ్ ఫస్ట్ హాఫ్ లో హై లైట్ అయిన అంశాలు. ఫన్నీ సీన్స్ లో సైతం పవన్ వన్ మాన్ షో కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ స్లో గా సాగడం, హీరోయిన్లతో వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టించడం ఫస్ట్ హాఫ్ లో మైనస్‌లు. ఇక ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌తో సినిమాపై ఆస‌క్తి కాస్త పెరుగుతుంది. త్రివిక్ర‌మ్ సెకండాఫ్‌లో మ్యాజిక్ చేస్తాడ‌ని చూసిన వాళ్ల‌కు చుక్క‌లే క‌న‌ప‌డ‌తాయి. సెకండాఫ్‌లో మెయిన్ స్టోరీ రివీల్ అయినా ఏ మాత్రం ఆస‌క్తి లేకపోవ‌డంతో ఆక‌ట్టుకోలేదు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు సాదాసీదాగా సాగాయి. కానీ పవన్ కళ్యాణ్ మార్క్ యాక్షన్ సీన్స్ చిత్రాన్ని నిలబెడుతూ వచ్చాయి. సినిమా గ్రాఫ్ ఎక్క‌డా పెర‌గ‌లేదు. ఎక్క‌డైనా ఓ సీన్ రైజ్ అయితే ఆ వెంట‌నే గ్రాఫ్ ఒక్క‌సారిగా ప‌డిపోయేది.

మ‌ధ్య‌లో బెల్టుతో కామెడీ చేసే సీన్‌లో ప‌వ‌న్ త‌మ్ముడు సినిమాలోని శాకుంత‌ల‌క్క‌య్యా సీన్‌ను గుర్తుకు తెచ్చాడు. ఇక ప‌వ‌న్ అంటే ఇష్టం అని హీరోయిన్లు కీర్తి సురేష్‌, అను ఎమ్మాన్యుయేల్ చెంప దెబ్బ‌లు కొట్టుకుంటూ ఫైటింగ్‌కు దిగే సీన్‌లో హాస్యం పండ‌లేదు స‌రిక‌దా... అది హాస్యాస్ప‌దం అయ్యింది. హీరోయిన్ల‌కు ప్రాధాన్య‌మే లేదు. ప‌వ‌న్ హీరోయిన్‌తో సీన్ చేస్తున్నాడంటే థియేట‌ర్ల‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్ విజిల్స్ బ్రేక్ లేకుండా ప‌డుతుంటాయి. అలాంటి మ్యాజిక్ సీన్లు ఇక్క‌డ త్రివిక్ర‌మ్ ఒక్క‌టి కూడా బ‌లంగా రాసుకోలేదు. ఓవరాల్ గా అజ్ఞాత‌వాసి సాధార‌ణ ప్రేక్ష‌కుడినే కాదు పవన్ ఫాన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేదు.

త్రివిక్ర‌మ్ ఎలా తీశాడంటే...

ఫ్రెంచ్ సినిమా లార్గోవిచ్‌లోని మూల‌క‌థ‌ను బేస్ చేసుకుని త్రివిక్ర‌మ్ ఈ సినిమా తీశాడ‌న్న ఆరోప‌ణ‌లు ముందు నుంచి ఉన్నాయి. ఆ సినిమా చూసిన వాళ్లు ఈ సినిమా చూస్తే త్రివిక్ర‌మ్ మూల‌క‌థ‌ను కాపీ కొట్టిన‌ట్టు క్లీయ‌ర్‌గా అర్థ‌మ‌వుతుంది. ఆ సినిమాలో ఉన్న‌ట్టే కోట్ల‌కు సంప‌న్నుడైన ఓ వ్య‌క్తిని చంపేస్తే అత‌డి మొద‌టి భార్య కొడుకు వ‌చ్చి వాళ్ల‌కు బుద్ధి చెప్పి ఆ వ్యాపార సామ్రాజ్యానికి ఎలా వార‌సుడు అయ్యాడ‌న్న‌దే ఈ సినిమా స్టోరీ. ఇలా సాదాసీదా క‌థ‌ను సినిమాగా తీసేట‌ప్పుడు ఎన్నో మ‌లుపులు ఉండాలి.... ఎంతో ఉత్కంఠ ఉండాలి... బ‌ల‌మైన ఫ్యామిలీ అనుబంధాలు, ఉద్వేగాలు, సంతోషాలు ఉండాలి. త్రివిక్ర‌మ్‌కు ఇవ‌న్నీ కొట్టిన పిండే కానీ ఎందుకో ఈ సినిమాలో వాటిని ఈ క‌థ‌లో దినుసులుగా వేయ‌లేక‌పోయాడు. త్రివిక్ర‌మ్ మార్క్ భావోద్వేగాలు గాని, కామెడీ గాని, పంచ్‌లు గాని ఏవీ పండ‌లేదు. త్రివిక్ర‌మ్ పెన్ను ప‌వ‌ర్ చాలా అంటే చాలా త‌గ్గిపోయింది. సాధార‌ణ ప్రేక్ష‌కుల సంగ‌తి ఎలా ఉన్నా ప‌వ‌న్ వీరాభిమానులు సైతం థియేట‌ర్ల‌లో కుర్చీలోనుంచి లేచి విజిల్స్ వేసే సీన్ ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా తీయ‌లేక‌పోయాడు. సెకండాఫ్ ముర‌ళీశ‌ర్మ‌-రావూ ర‌మేష్‌ల‌ను బెల్టుతో కొట్టే సీన్ త‌ర్వాత కోటేశ్వ‌ర‌రావు సాంగ్ వ‌ర‌కు ఇంకా ఏదో ఉంటుద‌ని ఎదురు చూసిన ప్రేక్ష‌కుడికి అస‌లు ఈ సినిమా త్రివిక్ర‌మే తీశాడా ? లేదా ? అసిస్టెంట్ల‌తో తీయించేశాడా ? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. సినిమాలో ఏ సీన్ ఎందుకు వ‌స్తుందో అర్థం కాదు...త్రివిక్రమ్‌కు లాజిక్ లెస్ సీన్లు ఎక్కువ తీయ‌డ‌న్న పేరుంది. ఈ సినిమాలో అలాంటి వాటికి కొద‌వే లేదు. ఓ సీన్‌కు ముందు వెన‌కా కంటిన్యుటీ ఉండ‌దు. త్రివిక్ర‌మ్ సినిమాలు అంటే బ‌ల‌మైన సీన్ల మ‌ధ్య‌లో వీక్ సీన్లు ప‌డుతుంటాయి. అలాంటిది అజ్ఞాత‌వాసిలో వీక్ సీన్ల మ‌ధ్య‌లో త్రివిక్ర‌మ్ మార్క్ బ‌ల‌మైన సీన్ ఎక్క‌డ దొరుకుతుందా ? అని వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి.

ప్ల‌స్ పాయింట్స్ (+) :

- ప‌వ‌న్‌కళ్యాణ్‌ను మిన‌హాయిస్తే సినిమాటోగ్ర‌ఫీ, కొన్ని డైలాగులు

మైన‌స్ పాయింట్స్ (-):

- ప్లాట్ న‌రేష‌న్‌

- త్రివిక్ర‌మ్ సినిమాల‌న్నింటిలోనూ వీక్ స్టోరీ

- స్క్రీన్ ప్లే & డైరెక్ష‌న్‌

- న‌వ్వు రాని కామెడీ సీన్లు

- ప్రాధాన్యం లేని హీరోయిన్లు

- ఎడిటింగ్‌

- రీ రికార్డింగ్‌

Similar News