లక్కున్నోడు మూవీ రివ్యూ

Update: 2017-01-26 11:26 GMT

నటీనటులు: మంచు విష్ణు, హన్సిక, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్

మ్యూజిక్ డైరెక్టర్: అచ్చు రాజమణి , ప్రవీణ్ లక్కరాజు

నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ

డైరెక్టర్: రాజ్ కిరణ్

మంచు విష్ణు కి తన కెరీర్ లో ఇప్పటివరకు ఒక మాదిరి సూపర్ హిట్ అంటూ ఏది లేదు. 'ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా, ఆడోరకం - ఈడోరకం ' చిత్రాలతో ఓమాదిరి హిట్స్ కొట్టినప్పటికీ ఒక్క మంచి సినిమాతో ఆహా మంచు విష్ణు అనే రేంజ్ సినిమా ఏది లేకుండా పోయింది విష్ణుకి. ఇక మోహన్ బాబు కొడుకుగానే ఎక్కువ పేరుపొందిన విష్ణు ఇటు సినిమా రంగం లో తానేంటో నిరూపించుకోవాలని ఆరాటపడుతూనే.... మరోపక్క వ్యాపార రంగంలో కూడా దూసుకెళుతున్నాడు. అయితే మంచు విష్ణు తాజాగా 'లక్కున్నోడు' చిత్రంతో ప్రేక్షకులని మెప్పించి హిట్ కొట్టాలని తాపత్రయ పడుతున్నాడు. హన్సికతో మరోసారి జోడి కడుతున్న విష్ణు ఫస్ట్ లుక్ తోనే ఆ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాడు. ఇక ట్రైలర్స్, సాంగ్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేసిన విష్ణు తన చిత్రాన్ని ఫిబ్రవరికి విడుదల చెయ్యాలనుకున్నాడు. కానీ అనూహ్యం గా రిపబ్లిక్ డే రోజునే 'లక్కున్నోడు' చిత్రాన్ని విడుదల చేసి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసిన విష్ణు వారినుండి 'లక్కున్నోడు'తో లక్కులాంటి మెప్పు ఎంతవరకు పొందుతాడో సమీక్షలో తెలుసుకుందాం.

కథ: దురదృష్టాన్ని వెంటపెట్టుకుని తిరుగుతుంటాడు లక్కీ( మంచు విష్ణు) అనే కుర్రాడు. అతనికున్న ఏకైక కారణం దురదృష్టం. ఆ దురదృష్టం అనే నెపంతోనే లక్కీ తండ్రి కూడా లక్కీతో సరిగ్గా ఉండడు. అసలు అతనేం చేసినా కూడా దురదృష్టం అతన్ని వెంటాడుతుంది. అంతటి దురదృష్టంలోనూ లక్కీ కి పద్మావతి ( హన్సిక) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఇక ఆ పరిచయాన్ని లక్కీ ప్రేమగా ఫీల్ అవుతుంటాడు. అయితే పద్మావతి మాత్రం ప్రతి ఒక్క విషయాన్నీ పాసిటివ్ అనే కోణంలోనే చూస్తూ ఉంటుంది. అలా లక్కీ, పద్మావతిలా పరిచయంలో ఉండగా లక్కీ చెల్లికి పెళ్లి కుదురుతుంది. అయితే పెళ్లి కోసం లక్కీ కొంత డబ్బుని తీసుకెళుతుండగా.. డబ్బు పోతుంది. మళ్ళీ దురదృష్టం లక్కీని వెంటాడింది. అలంటి సమయంలో లక్కీ చేసేది లేక తండ్రికి తెలిస్తే చంపేస్తాడనే భయంతో సూయిసైడ్ చేసుకోవాలనుకుంటారు. ఈలోపు లక్కీకి ఒక వ్యక్తి పరిచయమవుతాడు. అతను లక్కీ కి ఒక సంచి ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటే కోటి రూపాయలిస్తానని చెబుతాడు. మరి ఆ వ్యక్తి లక్కీ కి కోటి రూపాయలిచ్చాడా? అసలతను జాగ్రత్త చేయమన్న బాగ్ లో ఏముంటుంది? అసలు లక్కీ ఆత్మ హత్యను ఎందుకు వాయిదా వేసుకున్నాడు? లక్కీ జీవితంలో పద్మావతి పాత్ర ఎంత? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వెండితెర మీద లక్కున్నోడు చిత్రాన్ని వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు: లక్కీగా మంచిము విష్ణు ఎనర్జీ లుక్స్ తో అదరగొట్టాడనే చెప్పాలి. కానీ డాన్స్ లు, ఫైట్స్ ని ఎప్పటి మాదిరిగానే పర్వాలేదనిపించారు .ఈ కథలో దురదృష్టవంతుడు అనే పాత్రని మంచు విష్ణు బాగానే చేసాడనిపించింది. ఇక ప్రొడ్యూసర్ ఈ లక్కున్నోడు సినిమాలో విలన్ కూడా... ఎం.వి.వి.సత్యనారాయణ విలన్ పాత్రను తన పరిధిమేర నటించాడు. ఇక హీరోయిన్ హన్సిక, మంచు విష్ణు తో రెండోసారి జోడి కట్టింది. ఇక హన్సిక కూడా తన నటనతో పర్వాలేదనిపించింది. తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్ లు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం: ముందుగా దర్శకుడు రాజ్ కిరణ్ గురించి చెప్పుకోవాలంటే దర్శకుడు 'లక్కున్నోడు' కథని సింపుల్ గా రెండు గంటల్లో చూయించే ప్రయత్నం చేసాడు. ఒక కామెడీకి స్కోప్ లేదు, అసలు ఈ దురదృష్టవంతుడు అనే కుర్రాడు ఒక్కసారిగా 'లక్కున్నోడు' ఎలా అయ్యాడో అస్సలు అర్ధం కానీ లాజిక్. మరీ ఇదే లైన్ తో దర్శకుడు రాజ్ కిరణ్ రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఏ విధం గా సీట్ల లో కూర్చోబెడదామనుకున్నాడో? ఎవరికీ అర్ధం కాదు. ఇక పాటల విషయానికి వస్తే అచ్చు రాజమణి మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అలాగే పాటలు కూడా చాలా చప్పగా వున్నాయి. పి.జి.విందా సినిమాటోగ్రఫీ కూడా అంతంత మాత్రంగానే వుంది.

ఏదిఏమైనా మరోసారి మంచు విష్ణుకి కాలం కలిసిరాలేదని చెప్పాలి. మంచి హిట్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేద్దామని ఆశపడినప్పటికీ కథను ఎంపిక చేసుకోవడంలో మరోసారి విష్ణు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. సరిగ్గా కథను ఎంచుకోక పోవడం మరోసారి మైనస్ అయ్యింది. ఇక మోదం బాబు ఒక చోట కనిపించినా అది ఈ చిత్రానికి అసలు ప్లస్ అయ్యే ఛాన్స్ ఏమాత్రం లేదనేది.... ఈ చిత్రం చూసిన వాళ్ళకి బాగా అర్ధమవుతుంది.

ప్లస్ పాయింట్స్: మంచు విష్ణు నటన, ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్: దర్శకుడు, కామెడీ, కథ, కథనం, పాటలు, ఎడిటింగ్

రేటింగ్: 1.75/5

Similar News