లై మూవీ రివ్యూ

Update: 2017-08-11 12:03 GMT

నటీనటులు : నితిన్, మేఘ ఆకాష్, అర్జున్, రవి కిషన్,

సంగీతం : మణిశర్మ

నిర్మాత : రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర

దర్శకత్వం : హను రాఘవపూడి

ఈరోజు ఆగష్టు 11 న రెండు భారీ బడ్జెట్ సినిమాలతో నితిన్ లై చిత్రం పోటీకి దిగింది. మాస్ డైరెక్టర్ బోయపాటి జయ జానకి నాయక, రానా హీరోగా వస్తున్న నేనే రాజు - నేనే మంత్రి చిత్రాలు కూడా ఈరోజు ఆగష్టు 11 నే బరిలోకి దిగాయి. మరి నితిన్ - హను రాఘవపూడి లు ఇంతగా పట్టుబట్టి రెండు పెద్ద సినిమాలకు ఎదురెళ్ళడం అంటే వారి సినిమాపై వారికి ఎంతో కాన్ఫిడెన్స్ ఉండి ఉండాలి కదా. నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ఔట్పుట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోనే ఈ చిత్రాన్ని అలా భారీ చిత్రాల మీద పోటీకి దింపారనిఅర్ధమవుతుంది. లై టైటిల్ కి తగ్గట్టుగానే ఈ చిత్రంలో ప్రేమ, ఇంటిలిజెన్స్, విలనిజాన్ని సమ పాళ్ళలో చూపించాడు దర్శకుడు హను రాఘవపూడి. ఈ చిత్రంలో హీరోహీరోయిన్స్ ఇద్దరూ అబద్దాలతోనే పరిచయమై ఆ అబద్దాలను పక్కన పెట్టేసి ప్రేమించేసుకోవడం చూస్తుంటే కథ లో ఎటువంటి ట్విస్టులు ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. అలాగే మొదటిసారి సీనియర్ హీరో అర్జున్ లై చిత్రంలో విలనిజాన్ని పద్మనాభం గా పండించబోతున్నాడు. అర్జున్ కి నితిన్ కి మధ్య జరిగే డ్రామా లై చిత్రానికే హైలెట్ అనేలా లై టీజర్, ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం కాబోతున్న మేఘ ఆకాష్ ఈ చిత్రంలో చైత్రగా కనిపించబోతుంది. నితిన్, మేఘ ఆకాష్ చేసే రొమాన్స్ మనకు పాటలు, ట్రైలర్ లో తెలిసింది. అమ్మాయి కొత్తదే అయినా అటువంటి ఛాయలేమి బయటికి కనబడకుండా మేఘ గ్లామర్ గా కనిపించింది. నితిన్ కి మేఘాకి మధ్యన నడిచే లవ్ ట్రాక్ ఈ సినిమాలో కొత్తగా ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటరైన్మెంట్ ఎలిమెంట్స్ తో సాగిపోతూ ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర మాత్రం అదిరిపోయే ట్విస్ట్ తో ఈ చిత్రం మరో స్థాయికి వెళ్లడం చూస్తుంటే లై చిత్రంతో నితిన్ - హను లు కలిసి భారీ హిట్ కొట్టేలాగే కనబడుతున్నారు. మరి పూర్తి సస్పెన్సు , మైండ్ గేమ్ తో తెరకెక్కిన ఈ లై చిత్రం ప్రేక్షకులులకు ఎంతవరకు చేరువ కాగలిగిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

సత్యం(నితిన్) లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అవసరానికి అబద్దాలు చెప్పడమే కాకుండా నిత్యం అబద్దపు జీవితాన్నే కొనసాగిస్తుంటారు. ఒక గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఆ అమ్మాయితో పాటే అమెరికా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వాలంటూ కలలు కంటూ ఉంటాడు. అటువంటి టైంలోనే చైత్ర(మేఘ ఆకాష్) సత్యానికి పరిచయం అవుతుంది. వారిద్దరూ అబద్దాలు చెప్పుకుంటూనే తమ పరిచయాన్ని కంటిన్యూ చేస్తారు. ఐతే వారి పరిచయంతో ఇద్దరిలో ప్రేమ చిగురిస్తుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. వారి పేమకథ సాఫీగా సాగుతున్నప్పుడు వారి జీవితాల్లోకి పద్మనాభం(అర్జున్) ఎంట్రీ ఇస్తాడు. పద్మనాభం వలన సత్యం అనేక సమస్యలు ఎదుర్కొంటాడు. సత్యానికి పద్మనాభానికి మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటాయి. పద్మనాభంతో నిత్యం సత్యం ఫైట్ చేస్తూనే ఉంటాడు అసలు పద్మనాభం ఎవరు? సత్యానికి పద్మనాభానికి ఉన్న సంబంధం ఏమిటి? సత్యం, చైత్రలు ప్రేమలో గెలుస్తారా? చైత్ర కి సత్యానికి పెళ్లవుతుందా? అసలు పద్మనాభంతో సత్యం ఎందుకు గొడవ పడతాడు.? ఇవన్నీ తెలియాలంటే మీరు వెండితెర మీద లై చిత్రాన్ని కన్నులారా వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు:

సత్యం పాత్రలో నితిన్ స్టైలిష్ లుక్ లో బాగా ఆకట్టుకున్నాడు. సత్యం పాత్రకు తగినట్లు పెరఫార్మెన్సు తో నితిన్ తగిన న్యాయం చేసాడు. ఎమోషన్ సీన్స్ తోపాటు , యాక్షన్ సీన్స్ లోను నితిన్ ఇరగదీసే పెరఫార్మెన్సు చేసాడు. హీరోయిన్ తో లవ్ సీన్స్ లో కూడా నితిన్ బాగా మెప్పించాడు. అర్జున్ వంటి పవర్ ఫుల్ విలన్ తో ఫైటింగ్ సన్నివేశాల్లో నితిన్ మంచి నటనతో ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ కి కొత్తగా పరిచయమైన హీరోయిన్ మేఘ ఆకాష్ కూడా అందంతోపాటు అభినయంలోనూ మంచి మార్కులే కొట్టేసింది. హీరోయిన్ కి పెద్దగా ప్రాముఖ్యత లేకున్నా ఉంన్నంతలో బాగానే మెప్పించింది మేఘ. ఇక మొదటి సారి తెలుగులో విలన్ గా పాత్రలో కనిపించిన అర్జున్ లై సినిమాకే హైలెట్. మైండ్ గేమ్ తో కట్టిపడేసాడు. యాక్షన్ సన్నివేశాల్లో తనదైన శైలిలో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాడు. ఇక మిగిలిన నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు:

రెండు సినిమాలుమాత్రమే డైరెక్ట్ చేసిన హను రాఘవపూడి ఎంతో ఎక్సపీరియెన్స్ ఉన్న దర్శకుడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కథను నమ్మి సినిమాను చేసాడు కాబట్టే సక్సెస్ అయ్యాడు. మైండ్ గేమ్ కాన్సెప్ట్ ని హను బాగానే హ్యాండిల్ చేయగలిగాడు. కాకపోతే స్క్రీన్ ప్లే విషయంలో హను మరికాస్త శ్రద్ద పెట్టి ఉండాల్సింది. ఇక లై చిత్రానికి మణిశర్మ అందించిన మ్యూజిక్ పర్వాలేదనిపించింది. ఒకటి రెండు పాటలు మాత్రమే ఆకట్టుకున్నాయి. మిగిలిన పాటలు మాములుగా ఉన్నాయి. కానీ మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ ని మాత్రం అదరగొట్టేసాడు. కొన్ని సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఆ సీన్స్ నే హైలెట్ చేసాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. అమెరికాలోని సన్నివేశాలను రిచ్ గా చూపించడమే కాదు బాగా హైలెట్ చేసాడు. ఎడిటింగ్ కాస్త వీక్ గా వుంది. సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలను సాగదీసినట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కథానుసారంగా వున్నాయి.

విశ్లేషణ:

నితిన్ ఇప్పుడు మీడియం బడ్జెట్ హీరోగా మారాడు. వరుస హిట్స్ తోపాటు గత ఏడాది అ.. ఆ చిత్రంతో అతని స్థాయి అమాంతం పెరిగింది. ఆ చిత్రం తర్వాత ఒక మంచి కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని.... ఈ సినిమా చేసాడు. కథలోని కొత్తదనం చూసి, హను రాఘవపూడి ట్రాక్ రికార్డ్ చూసి నితిన్ ఈ సినిమా కి కమిట్ అయ్యాడు. అయితే నితిన్ నమ్మకాన్ని హను నిలబెట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఎందుకంటే నితిన్ సినిమా అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం చూస్తారు. కానీ లై లో అలాంటివి లేవు. కథనం కూడా ఆసక్తికరంగా కట్టిపడెయ్యలేదు. అలాగే హను స్క్రీన్ ప్లే ని నడిపించడంలో కాస్త విఫలమయ్యాడనే చెప్పాలి. క్లైమాక్స్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టాల్సింది. అయినా ఒక వర్గం ప్రేక్షకులను లై బాగానే ఎంటర్టైన్ చెయ్యగలదని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్: అర్జున్ నటన, నితిన్, సస్పెన్స్ సీన్స్, మైండ్ గేమ్, బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: ఎడిటింగ్, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, క్లైమాక్స్

రేటింగ్: 2.5/5

Similar News