వంగవీటి మూవీ రివ్యూ

Update: 2016-12-23 13:28 GMT

నటీ నటులు: వంశీ చాగంటి, సందీప్ కుమార్, కౌటిల్య, నైనా గంగూలీ, ప్రజ్ఞ

మ్యూజిక్ డైరెక్టర్: రవి శంకర్

నిర్మాత: దాసరి కిరణ్ కుమార్

దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ తాను ఏం చెయ్యాలనుకుంటాడో దాన్ని చేసి చూపించే రకం. అసలు అనంతపురం రాజకీయాలను రక్త చరిత్ర రూపంలో సినిమా తెరకెక్కించి పెద్ద సాహసమే చేసాడు. పరిటాల రవీంద్ర, సూరి మధ్యన నడిచే పగా ప్రతీకారాలను... వారు హత్యగావింపబడిన విధానాన్ని... ఎవ్వరి బెదిరింపులకు భయపడకుండా, ఒత్తిళ్లకు తలొగ్గకుండా తెరకెక్కించిన వర్మ ఇప్పుడు ఒకప్పటి విజయవాడ రాజకీయాలపై ఒక సినిమాని డైరెక్ట్ చెయ్యాలని ముచ్చటపడి ఈ వంగవీటి చిత్రాన్ని తెరకెక్కించాడు. రౌడీ ఇజం పుట్టిందే బెజవాడలో అని గొప్పగా చెప్పుకునే కుర్రకారు మధ్యన రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని ఎలా చూపిస్తాడో... వంగవీటితో మోహన రంగాని విలన్ గా చూపిస్తాడా.. లేక హీరోగా ఎలివేట్ చేసి చూపిస్తాడా అని వంగవీటి రంగ అభిమానులు చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. మరో పక్క దేవినేని నెహ్రూ కుటుంబాన్ని ఎలా తెర మీద చూపిస్తాడో అనే ఉత్కంఠ విజయవాడ వాసులలో ఏర్పడేలా చేయగలిగాడు. ఇక ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం అప్పుడు వంగవీటి ఫ్యామిలీని వర్మ కలవడం.... అక్కడ వంగవీటి కొడుకు రాధా, వంగవీటి రంగా భార్య... రంగాకి సంబందించిన వంగవీటి చిత్రంలో రంగాని ఎటువంటి బ్యాడ్ యాంగిల్ చూపించినా ఊరుకోమని వర్మకి వార్నింగ్ కూడా ఇచ్చారు. అక్కడ నుండి వర్మ మళ్ళీ దేవినేని నెహ్రూ ని భేటీ అవ్వడం... నెహ్రూ వర్మ కి పూర్తి మద్దతివ్వడం వంటి అంశాలు సినిమాపై ఆశక్తిని పెంచేలా చేశాయి. ఇక ఈ సినిమాకి రామ్ గోపాల్ వర్మ వాయిస్ ఓవర్ ఇవ్వడం... ఒక పాట కూడా పాడడం వంటివి సహజం గానే సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. అలాగే వంగవీటి చిత్రానికి ఇటు రాజకీయ పోకడలను, అటు సినీ గ్లామర్ నూ అద్దిన వర్మ ఈ సినిమాతో ఇక సినిమా దర్శకత్వానికి గుడ్ బై చెబుతానని చెప్పడం కూడా ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. మరి ఇన్ని అంచనాల మధ్యన ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వంగవీటి వర్మ ప్రయత్నం ఎంతవరకు ఫలించిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

1970 లో బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా రాజకీయ ప్రస్థానం తో... వర్మ వాయిస్ ఓవర్ తో సినిమా మొదలవుతుంది. చ‌ల‌సాని వెంక‌ట‌ర‌త్నం ఒక వర్గానికి చెందిన విప్లవ పార్టీ నాయకుడు. బెజవాడలో పెద్ద పేరున్న రౌడీ. తన మాట వినేవారికి సహాయం చేస్తూ మాట వినని వారిని కత్తులతో బెదిరిస్తూ... జనాల్ని భయాందోళనలకు గురి చేస్తుంటాడు. అయితే రాధా అనే వ్యక్తి మాత్రం చలసానికి భయపడడు. అలాంటి రాధని చలసాని తన గ్రూప్ లో చేర్చుకుంటాడు. ఇక రాధా ఆ గ్రూప్ లోకి అడుగుపెట్టిన తర్వాత అతని ఎదుగుదల, పగని, ప్రత్యర్దులని మట్టుపెట్టడం, వారి ఎత్తుగడలని చూసిన చలసాని వెంకట రత్నం తట్టుకోలేక రాధని తీవ్రంగా అవమానిస్తాడు. ఆ అవమానాన్ని భరించలేని రాధా అతని అనుచరులతో కలిసి చలసానిని చంపేస్తారు. ఇక అప్పటినుండి రాధ పెద్ద రౌడీగా బెజవాడలో ఎదుగుతాడు. ఇక రాధా గ్రూప్ లోకి కాలేజ్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున చేరతారు. వారిలో దేవినేని గాంధీ, నెహ్రు, ముర‌ళి కూడా వుంటారు. రాధా మాట విని వీరు చిన్న చిన్న గొడవలు అల్లర్లు సృష్టిస్తారు. అయితే ఒక సెటిల్మెంట్ గొడవలో రాధని కొందరు చంపేస్తారు. ఇక రాధా మరణం తో సీన్ లోకి మోహన్ రంగా వస్తాడు. ఇక బెజవాడలో రాజకీయం గా, రౌడీ ఇజంలో రంగా పాతుకుపోతాడు. మురళి, నెహ్రు కూడా రాధా మీద వున్న అభిమానంతో రంగాకి సపోర్ట్ చేస్తారు. అయితే వంగవీటి కుటుంబానికి దేవినేని కుటుంబానికి గొడవలు జరిగి రెండు కుటుంబాలు దూరమైపోతాయి. మళ్ళీ కలవనంతగా ఇద్దరి మధ్యన అగాధం ఏర్పడుతుంది. దేవినేని గాంధీ యువతని రెచ్చగొడుతున్నాడని తెలుసుకున్న రంగా, దేవినేని గాంధీ కి వార్నింగ్ ఇస్తాడు. అది ఖాతరు చెయ్యకుండా గాంధీ తన పని తానూ చేసుకుపోతాడు. ఇది భరించలేని రంగా, దేవినేని గాంధీ ని చంపించేస్తాడు. ఇక గాంధీ మరణం తో దేవినేని కుటుంబం, వంగవీటి కుటుంబం మళ్ళా కలవనంత దూరమైపోతారు. అయితే దేవినేని మురళి తన అన్నని చంపిన వారిని వరసబెట్టి చంపేస్తుంటాడు . అలాగే రంగాని కూడా చంపుతానని బెదిరిస్తాడు మురళి. అయితే ఈ మాటలను సీరియస్ గా తీసుకున్న రంగా మురళిని కూడా చంపేస్తాడు. క్రమంగా రంగా రాజకీయాలకు దూరమవడం.... దేవినేని నెహ్రు రాజకీయాల్లోకి రావడం తో రంగాని కూడా కొంతమంది హతమారుస్తారు. మరి రంగాని చంపిందెవరు? అసలు ఈ రౌడీయిజం రంగాతో అంతమైందా? లేక అలాగే కొనసాగుతుందా? నెహ్రు కి రంగా హత్యలో ఉన్న పాత్ర ఏమిటి అనేది తెర మీద చూడల్సిందే.

నటీనటులు:

వంగవీటి రాధ పాత్రలో నటుడు శాండీ ఎంట్రీ, చిన్న రౌడీగా వంగవీటి ఎదుగుదల, దేవినేని నెహ్రూ, దేవినేని గాంధీ రోల్స్ లో ఆయా నటులు ఒదిగిపోయారు. వంగ‌వీటి రాధాకృష్ణ పాత్ర‌లో ఒకలా, రంగా పాత్ర‌లో మ‌రో బాడీ లాంగ్వేజ్‌లో వేరియేష‌న్ చూపుతూ చ‌క్కగా నటించేసాడు. డైలాగ్స్ డెలివ‌రీ ఎక్కడా మైనస్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఇక రత్నకుమారి రోల్ లో హీరోయిన్ నైనా గంగూలీ తన నటనతో పాత్రకు న్యాయం చేకూర్చిందనే చెప్పాలి.

సాంకేతిక వర్గం:

ముందుగా మనం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పుకోవాలి. వర్మ జీవిత కథల ఆధారం గా సినిమాలను తెరకెక్కిచడంలో దిట్ట అని రక్త చరిత్ర వంటి చిత్రాన్ని తెరకెక్కించి ప్రూవ్ చేసాడు. ఇప్పుడు వంగవీటి చిత్రాన్ని కూడా తనదైన స్టయిల్లో వర్మ ఎక్కువ రక్తపాతాన్ని చూపెట్టకుండా కత్తులు కఠారులతో మేనేజ్ చేసేసాడు. చలసాని వెంకటరత్నం నుంచి రంగా వరకు జరిగిన మర్డర్స్ ని వర్మ తన ఈ సినిమాలో హైలైట్ చేశాడు. వర్మ మార్క్ డైలాగుల్లో మరి కొంత పంచ్ ఉంటే బాగుండేది. ఇక మోహన రంగా పాత్రని ఇంకొంచెం ఎలివేట్ చేసి చూపిస్తే సినిమా ఎక్కడికో వెళ్లిపోయేదనే గూగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వర్మ బెజవాడ రౌడీ ఇజాన్ని, రక్త చరిత్రని బాగానే చూపించాడు. ఇక పాటల విషయానికి వస్తే విశంక‌ర్ అందించిన ట్యూన్స్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించాయి. నా పేరే కుమారీ అనే మొదటి పాట 1980 నాటి రొమాంటిక్ సీన్స్ ని తలపించింది. పూర్ క్వాలిటీతో కూడిన మాంటేజ్ సాంగ్స్ కాస్త అసహనానికి గురి చేసినా... రామ్ గోపాల్ వర్మ పాడిన వంగవీటిపాట పర్వాలేదనిపించింది. ఇక వర్మ వినిపించిన వాయిస్ ఓవర్ చప్పగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. చైత‌న్య‌ప్ర‌సాద్‌, రాధాకృష్ణ రాసిన డైలాగ్స్ ఓకె గా వున్నాయి. రాహుల్ శ్రీవాత్స‌వ్‌, కె.దిలీప్ వ‌ర్మ‌, సూర్య చౌద‌రి సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ప్ర‌తి సీన్‌ను ఎఫెక్టివ్‌గా తెరకెక్కించడం లో బాగానే వీరు స‌క్సెస్ అయ్యారు.

ప్లస్ పాయింట్స్: నటీనటులు, బ్యాగ్రౌండ్ స్కోర్, డైలాగ్స్, దర్శకత్వం, కథ

మైనస్ పాయింట్స్: పాటలు, స్లో నేరేషన్, క్లైమాక్స్

రేటింగ్: 2 .5 / 5

Similar News