నటీనటులు: అజిత్, కాజల్ అగర్వాల్, అక్షర హాసన్, వివేక్ ఒబరాయ్
సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్
నిర్మాతలు: అర్జున్ త్యాగరాజన్, సెంథిల్ త్యాగరాజన్
దర్శకత్వం: శివ
కోలీవుడ్ హీరో అజిత్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. దర్శకుడు శివ - అజిత్ కాంబినేషన్ లో వచ్చిన 'వీరం, వేదాళం' వంటి వరుస విజయాలు తర్వాత ఈ కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ 'వివేకం'. రెండు హిట్ సినిమాల తర్వాత మరోమారు ఈ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అలాగే హీరో అజిత్ కి ఈ 'వివేకం' చిత్రం 25 వ చిత్రం కావడం మరో విశేషం. తమిళంలో 'వివేగం' గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో 'వివేకం'గా డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. అజిత్ సినిమాలు తెలుగులో విడుదలవుతున్నాయి అంటే ఆ సినిమాలకు మంచి క్రేజే ఉంటుంది. అయితే అజిత్ సినిమాలకు ఇతర తమిళ హీరోల వలే తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. ఎందుకంటే అజిత్ తెలుగు మార్కెట్ ని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోడు. కాకపోతే అజిత్ సినిమా తెలుగులో వస్తుంది అంటే సినిమాపై భారీ అంచనాలే ఉంటాయి. తమిళనాట అజిత్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. అలాగే తెలుగులోనూ అజిత్ కి మంచి క్రేజ్ వుంది. ఇక కోలీవుడ్ లో అజిత్ హిట్ సినిమాలను ఇక్కడ స్టార్ హీరోలు రీమేక్ లు కూడా చేస్తుంటారు. డైరెక్టర్ శివ - అజిత్ ల కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్. శివ డైరెక్ట్ చేసే చిత్రాలు అన్నీ కథా బలమున్నవే కావడం ఇక్కడ విశేషం. మరి ఈ చిత్రంలో అజిత్ ఇంటర్పోల్ ఆఫీసర్ గా తన రియల్ లుక్ తో కనిపిస్తున్నాడు. అలాగే హీరోయిన్స్ గా కాజల్ అగర్వాల్, అక్షర హాసన్లు అజిత్ కి జోడిగా నటించారు. ఇక కాజల్ అగర్వాల్ అయితే అజిత్ భార్యగా చీరకట్టులో చాలా అందంగా కనిపిస్తుందని... వివేకం ట్రైలర్స్ లో చూపించారు. అలాగే మరో హీరోయిన్ కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ ఒక మోడ్రెన్ అమ్మాయిలా చేస్తున్న ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ 'వివేకం' చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
అజయ్‌కుమార్(అజిత్), ఆర్యన్(వివేక్ ఒబెరాయ్) క్లోజ్ ఫ్రెండ్స్. అజయ్ సీక్రెట్ ఏజెన్సీలో పేరు మోసిన ఏజెంట్. ఎవరికీ దొరక్కుండా దాక్కునే టెర్రరిస్టులను పట్టుకుని చంపేస్తుంటాడు... అజయ్ కుమార్ అలియాస్ ఏ.కే. అజయ్ కుమార్ తన వైఫ్ హాసిని( కాజల్) తో చాలా సంతోషంగా ఉంటాడు. ప్రపంచంలో అణు శక్తి ద్వారా భూకంపాలు క్రియేట్ చేసి దాని ద్వారా క్యాష్ చేసుకోవాలని కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తుంటాయి. అందులో భాగంగా ప్లుటోనియం అణుబాంబును పేల్చాలనుకుంటారు. అందుకు సంబంధించిన రెండు డివైజ్‌లను తయారు చేస్తారు. అయితే ఆ డివైజ్ లను ఒక చోట దాచిపెడతారు వారు. వాటిని ఎక్కడ దాచిపెట్టారా కనుక్కుని వాటిని నాశనం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని భావించి ,ఏ. కె అండ్ ఆర్యన్ మరో ముగ్గురు స్నేహితులు వాటి కోసం వేట మొదలు పెడతారు. వాటిని కనిపెట్టే క్రమంలో ఏ కె కి నటాషా(అక్షర హాసన్) పరిచయం అవుతుంది. ఇక ఆ డివైజ్ లు కూడా నటాషా దగ్గరే ఉన్నాయని ఏ కె కనిపెడతాడు. అయితే ఆ డివైజ్ లను నాశనం చేసే పనిలో నటాషాకి కూడా భాగం ఇవ్వాలనుకుంటాడు ఏకే. కానీ ఈలోపు నటాషా హత్యకి గురవుతుంది. అలాగే ఏ కె ని చంపడానికి కూడా ప్లాన్ చేస్తారు కొందరు. చంపడానికి కుదరకపోయేసరికి అజయ్ కుమార్ మీద టెర్రరిస్ట్ ముద్ర వేస్తారు. అలా ముద్ర వెయ్యడమే కాకుండా ఏ కె భార్య హాసినిని కూడా బంధిస్తారు. మరి అజయ్ తన భార్య హాసినిని రక్షిస్తాడా? అలాగే ఆ డివైజ్ లని నాశనం చేస్తాడా? అసలు ఏ కె ని టెర్రరిస్ట్ గా ముద్ర వేసింది ఎవరు? నటాషాని చంపినవారెవరు? ఈ విషయాలను తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వివేకం సినిమాని వెండితెర మీద వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు:
అజిత్ ఈ సినిమాలో చేసిన యాక్షన్ మాత్రం సూపర్బ్ అనే రీతిలో ఉంది. అజిత్ ఒరిజినల్ లుక్, స్టయిల్ అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. అజిత్ పెర్‌ఫార్మెన్స్ పరంగా చాలా కేర్ తీసుకున్నాడు. యాక్షన్ సీన్స్ సైతం ఎంతో రిస్క్ తీసుకొని చేశాడు. హీరోయిన్ కాజల్ ఒక గృహిణి పాత్రలో ఓకే అనిపించింది. చీర కట్టులో ఆమె అందం అదరహో అనే రీతిలో ఉంది. ఇక స్టైలిష్ విలన్ గా నటించిన వివేక్ ఓబెరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమాలో ఎంతో కీలకమైన పాత్రలా అనిపించే నటాషా క్యారెక్టర్‌లో అక్షరహాసన్ నటించింది. సినిమా స్టార్టింగ్ ఈ క్యారెక్టర్‌ని బాగా హైలైట్ చేసి ఒక్కసారిగా ఆ క్యారెక్టర్‌ని చంపెయ్యడంతో కథ మీద ఇంట్రెస్ట్ పూర్తిగా పోతుంది. ఇక మిగతా నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు:
డైరెక్టర్ శివ గురించి చెప్పాలంటే ఈ సినిమా కోసం అతను రాసుకున్న కథలోనే పెద్ద లోపం వుంది. అది అతనికి మాత్రమే అర్థమైతే చాలు అనుకున్నాడు. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు అర్థం కావాలన్న వివేకాన్ని కోల్పోయాడు. విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఎంత అద్భుతంగా వున్నా విషయం లేకపోతే ఏ సినిమా అయినా పరాజయాన్ని చవి చూడాల్సిందే. వివేకం సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. వెట్రి సినిమాటోగ్రఫీ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అని చెప్పాలి. సినిమా మొత్తం యాక్షన్ సీన్స్‌తో నిండి వుంటుంది. ఫైట్‌మాస్టర్స్ కూడా ఫైట్స్‌ని డిఫరెంట్‌గా కంపోజ్ చేశారు. నైట్ ఎఫెక్ట్‌లో ఫారిన్‌లో తీసిన యాక్షన్ ఎపిసోడ్ అద్భుతంగా అనిపిస్తుంది. అలాగే రైల్వే ట్రాక్ పక్కన తీసిన ఫైట్ కూడా బాగుంది. అలాగే హీరోయిన్‌ని చంపడానికి విలన్ గ్యాంగ్ ఇంటికి వచ్చినపుడు హీరో దూరంగా వుండి వాళ్ళని మట్టుపెట్టే యాక్షన్ సీన్‌ని కూడా అద్భుతంగా చేశారు. ఇలా ఈ సినిమాలో అద్భుతం, మహా అద్భుతం అని చెప్పుకోవడానికి యాక్షన్ సీక్వెన్స్‌లు మాత్రమే మిగిలాయి. ఇక అనిరుధ్ అందించిన మ్యూజిక్ సినిమా పెద్ద మైనస్ అని చెప్పాలి. ఇందులో ఆకట్టుకునే పాటలు లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా లౌడ్‌గా వుంటూ రణగొణ ధ్వనిలా అనిపిస్తుంది తప్ప ఏ సీన్‌లోనూ ఆకట్టుకోదు. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్ మెయిన్‌టెయిన్ చేసి చాలా రిచ్‌గా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని రూపొందించారు. నిర్మాతలు పెట్టిన ఖర్చంతా స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.
విశ్లేషణ:
అజిత్‌కి తమిళ్ మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అతన్నుంచి వారు కోరుకునేవి చప్పట్లు కొట్టించే డైలాగ్స్, థ్రిల్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్, మంచి పాటలు. వివేకం విషయానికి వస్తే ఇందులో కేవలం యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సీన్స్ పైనే ఎక్కువ శ్రద్ధ చూపించినట్టు కనిపిస్తుంది. ఈ కథలో ఇంకా చాలా ఎలిమెంట్స్ జోడించారు. అయితే అవి సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఏ సెంటర్స్ ఆడియన్స్‌కీ అర్థంకాని కథ ఇది. సీన్స్ అన్నీ స్పీడ్‌గా వెళ్లిపోవడం, మధ్య మధ్యలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ రావడం, ఏ క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తుందో అర్థం కాకపోవడం వంటివి సినిమాలో కోకొల్లలుగా కనిపిస్తాయి. కేవలం మనం యాక్షన్ సీక్వెన్స్‌లు చూడడానికే సినిమాకి వచ్చామా అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. సినిమాలో ఏ సీన్‌కీ లాజిక్ అనేది వుండదు. హీరోని విలన్స్ ఎన్ని గన్స్‌తో కాల్చినా తప్పించుకుంటాడు. ఒకవేళ బుల్లెట్స్ దిగినా ప్రాణాలతో తిరిగి వస్తుంటాడు. ఇలాంటి సీన్స్ మనం ఎన్నో సంవత్సరాలుగా మన సినిమాల్లో చూస్తున్నాం. ఈ సినిమాలో అవే రిపీట్ అయ్యాయి. సినిమాలో ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే కథ¸, ఆకట్టుకునే కథనం, అందరికీ అర్థమయ్యే డైలాగ్స్, మధ్య మధ్య వచ్చే మంచి పాటలు, ఎంటర్‌టైన్‌మెంట్, థ్రిల్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ సమపాళ్ళలో వుంటేనే రెండున్నర గంటల సేపు సినిమా చూసే అవకాశం వుంటుంది. కేవలం స్టైలిష్ టేకింగ్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఆడియన్స్‌ని కట్టిపడెయ్యాలనుకోవడం కరెక్ట్ కాదు. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. చెప్పాలనుకున్న పాయింట్ ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది డైరెక్టర్ ఆలోచించలేదు. దీంతో సినిమా స్టార్టింగ్ నుంచే కన్‌ఫ్యూజన్ మొదలవుతుంది. సినిమా ఎండ్ అయ్యేవరకు అదే కన్‌ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది. విలన్‌ని హీరో ఎదుర్కొనే క్లైమాక్స్ ఫైట్‌లో హీరోని ఎంకరేజ్ చేస్తూ హీరోయిన్ పాట పాడడం చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి సీన్స్ కొన్ని దశాబ్దాలుగా మన సినిమాల్లో చూస్తున్నాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎంత కష్టపడినా ఒక నాసిరకం క్లైమాక్స్‌తో సినిమాని ఎండ్ చెయ్యడంతో యూనిట్ పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయింది. ఫైనల్‌గా చెప్పాలంటే విషయం లేకుండా హై టెక్నికల్ వేల్యూస్‌తో స్టైలిష్ మూవీగా రూపొందిన వివేకం చూడాలంటే కాస్తయినా వివేకం వుండాలి. బి, సి సెంటర్స్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఈ సినిమా చూస్తారు తప్ప కథపరంగా ఏమాత్రం ఎంజాయ్ చెయ్యలేరు.
ప్లస్ పాయింట్స్: అజిత్ పెరఫార్మెన్సు, యాక్షన్ సీన్స్, సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, నిర్మాణ విలువలు, అక్షర హాసన్
మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్, మ్యూజిక్, ఎడిటింగ్, కథ, కథనం, దర్శకత్వం, లాజిక్ లేని కొన్ని సీన్స్
రేటింగ్: 2.0 /5