బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
మూవీ నేమ్: శతమానం భవతి
తారాగణం: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్‌రాజ్, జయసుధ, నరేష్, ఇంద్రజ, ప్రవీణ్, సిజ్జు, రాజా రవీంద్ర తదితరులు
కెమెరా: సమీర్‌రెడ్డి
సంగీతం: మిక్కీ జె.మేయర్
ఎడిటింగ్: మధు
నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్
రచన, దర్శకత్వం: వేగేశ్న సతీష్
సంక్రాంతి పండగ ఎలాగున్నా సినిమాల సందడి మాత్రం విపరీతంగా వుంటుంది. స్టార్ హీరోల సినిమాలు ఒక దానితో ఒకటి పోటీ పడుతూ జనంలోకి వచ్చేస్తాయి. ఈ సంక్రాంతికి ఇద్దరు టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ల యొక్క 150, 100 సినిమాలు పండగ సందడిని చేస్తుండగా మధ్యలో శర్వానంద్ హీరోగా శతమానం భవతి వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా చేరింది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో సంక్రాంతి పండగలాంటి సినిమాగా శతమానం భవతి చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు వేగేశ్న సతీష్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ నిర్మించి అందర్నీ మెప్పించే దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు వున్నా అస్సలు భయపడకుండా, కంటెంట్ మీద నమ్మకం తో సంక్రాంతి బరిలోకి ఈ చిత్రం వచ్చింది. మరి ఆ చిత్రాలకు పోటీగా నిలబడే అంశాలు ఈ చిత్రంలో ఏం వున్నాయి? ఇప్పటివరకు ఎన్నో కుటుంబ కథా చిత్రాలు వచ్చాయి. మరి ఈ చిత్రంలో చూపించిన కొత్తదనం ఏమిటి? అనేది చూద్దాం.
కథ: ఒకప్పటి అనుబంధాలు, అప్యాయతలు, ప్రేమానురాగాలు ఇప్పుడు ఏ కుటుంబంలోనూ లేవు అనేది అందరికీ తెలిసిన సత్యమే. అది ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవడం వల్ల కావచ్చు, తల్లిదండ్రుల్ని వదిలి పిల్లలు ఉద్యోగ రీత్యా వేరే ప్రదేశాల్లో సెటిల్ అవ్వడం వల్ల కావచ్చు, పెరుగుతున్న టెక్నాలజీ వల్ల కావచ్చు. ఈ కథ విషయానికి వస్తే తన కొడుకులు, కూతురు పెళ్ళిళ్ళు చేసి భార్య జానకమ్మ(జయసుధ), తమ్ముడి కొడుకు కంగార్రాజు(నరేష్), మనవడు రాజు(శర్వానంద్)తో జీవితాన్ని గడుపుతుంటాడు రాఘవరాజు(ప్రకాష్‌రాజ్). కొడుకులు, కూతురు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా.. ఇలా వేర్వేరు దేశాల్లో ఉద్యోగరీత్యా సెటిల్ అయ్యారు. ఎనిమిది సంవత్సరాలు గడిచినా తల్లిదండ్రులను చూసేందుకు ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళు రారు. కొడుకుల్ని, కూతుర్ని, మనవళ్ళని, మనవరాళ్ళని చూడడానికి తనే అక్కడికి వెళ్ళేందుకు సిద్ధపడుతుంది జానకమ్మ. ఎన్నిసార్లు పిలిచినా రాని వాళ్ళకు ఒక మెయిల్ పంపిస్తాడు రాఘవరాజు. దాంతో మూడు కుటుంబాలు ఆత్రేయపురం వచ్చి వాలతాయి. రాజు తన మరదలు నిత్య(అనుపమ పరమేశ్వరన్)తో ప్రేమలో పడతాడు. ఎన్నిసార్లు పిలిచినా రాని కొడుకులు, కూతురు ఒక్క మెయిల్‌కే ఎలా వచ్చారు? ఆ మెయిల్‌లోని సారాంశం ఏమిటి? దాని వల్ల ఎలాంటి మనస్పర్థలు వచ్చాయి? రాజు, నిత్యల ప్రేమను పెద్దవాళ్ళు ఒప్పుకున్నారా? చివరికి కథ సుఖాంతమైందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
జానకమ్మ గా జయసుధ, రాఘవరాజుగా ప్రకాష్‌రాజ్ పెర్‌ఫార్మెన్స్ అదరగొట్టేసారు. వాళ్ళకి ఇలాంటివి కొట్టిన పిండే కాబట్టి..చక్కగా ఒదిగిపోయారు. మొదటి నుండి ఎంతో గమ్మత్తు గా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్న శర్వానంద్..ఈ సినిమాలోని తన పాత్రకు ప్రాణం పోశాడు. అతనికి, అతని నటనకి ఈ చిత్రం మరో మెట్టు అవుతుంది అనడంలో సందేహించాల్సిన అవసరం లేదు. కుందనపుబొమ్మలా వుంది కానీ.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హీరోకి మరదలుగా అతని వెంట తిరిగేందుకు, అప్పుడప్పుడు పాటలు పాడేందుకు తప్ప ఆమె క్యారెక్టర్‌కు అంత ప్రాధాన్యత లేదు. కొన్ని సీన్స్ లో మాత్రం ఆకట్టుకుంటుంది. కంగార్రాజుగా నరేష్ క్యారెక్టర్ కామెడీ కి బాగా ఉపయోగపడింది.ఇక మిగతావారంతా..తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పవచ్చు.
ఈ సినిమాకి మెయిన్ హైలెట్స్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్. పల్లెటూరు అందాల్ని ఎంతో అందంగా చూపించడంలో సమీర్‌రెడ్డి సక్సెస్ అవ్వగా, మిక్కీ జె.మేయర్ చేసిన పాటలు ఇంతకుముందు విన్న పాటల్లాగానే అనిపించినా వినసొంపుగా వున్నాయి. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశానికి తగ్గట్టుగా వుంది. సెకండాఫ్ కి ఇంకా ఎడిట్ చేయాల్సింది. ఫస్ట్ ఆఫ్ బావుంది. అనవసరమైన సన్నివేశాల్ని సెకండ్ ఆఫ్ లో ఇరికించినట్లు వున్నాయి. నిర్మాత దిల్ రాజు సినిమాని ఎప్పటిలానే చాలా రిచ్‌గా తెరకెక్కించాడు. డైరెక్టర్ సతీష్ వేగేశ్న తీసుకున్న లైన్ సీతమ్మ వాకిట్లో, గోవిందుడు అందరి వాడేలే.. తలపిస్తుంది. వాటితో పోల్చుకుంటే శతమానం భవతిలో కొత్తగా వుంది అని చెప్పడానికి ఏమీ లేదు. సినిమా లో ప్రతి సీన్ మనం అంతకుముందు చాలా సినిమాల్లో చూసిన ఫీలింగే కలుగుతుంది. ఇందులో డైరెక్టర్ అనుకున్న కొత్త పాయింట్.. పిల్లల్ని విదేశాల నుంచి రప్పించడానికి తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నానని చెప్పడం. అనవసరమైన కామెడీ సీన్స్, శ్రీనివాస కళ్యాణం, డబ్‌ష్మాష్ సీన్స్, రాఘవరాజు పెద్ద కొడుకు ఫ్లాష్ బ్యాక్ లవ్‌స్టోరీ, అప్పుడు ప్రేమించిన అమ్మాయితో ఇప్పుడు ఏకాంతంగా మాట్లాడడం, హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. తల్లిదండ్రుల వల్లే విదేశాలు..వెళ్లామని మరిచిపోయి అక్కడికి వెళ్ళగానే..అందరిని మర్చిపోయే వారికీ జ్ఞానోదయం చేయడానికి ఈ సినిమా చేసారు. పిల్లల కోసం వేయి కళ్ళతో ఎదురు చూసే తల్లిదండ్రుల కోసం సంవత్సరానికి ఒక్కసారైనా వారి దగ్గరకు రావాలన్న పాయింట్ మంచిదే కానీ..శతమానం భవతి సాగిన తీరు మాత్రం అందుకు కాన్వెన్సింగ్ గా అయితే లేదు. అయితే ఎలాంటి వల్గారిటీ లేకుండా మంచి మ్యూజిక్ వింటూ...కుటుంభం అంతా హాయిగా చూసే విధంగా అయితే సినిమా వుంది. సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన ఈ సినిమా..కలెక్షన్స్ తో పని లేకుండా..మంచి చిత్రంగా అయితే నిలబడుతుంది.
ఆఖరి మాట: ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు.. కానీ ఆచరించడమే కష్టం.
రేటింగ్: 3/5