నటీనటులు: నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది, రాజేంద్ర ప్రసాద్, చాందిని చౌదరి, అనన్య
సంగీతం: మణిశర్మ
నిర్మాత: ఆనంద్ ప్రసాద్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
'భలేమంచి రోజు' వంటి చిత్రంతో డైరెక్టర్ గా మారిన శ్రీరామ్ ఆదిత్య ఆ సినిమాతో మంచి పేరు సంపాదించాడు. సుధీర్ బాబు హీరోగా వచ్చిన 'భలేమంచి రోజు' చిత్రం సూపర్ హిట్ కాకపోయినా యావరేజ్ టాక్ తో మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్ టాలీవుడ్లోని నలుగురు యువ హీరోలు సుధీర్ బాబు, నారా రోహిత్, సందీప్ కిషన్, ఆది సాయికుమార్ లతో ఇప్పుడు 'శమంతకమణి' అనే మల్టి స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించాడు. అసలు ఇద్దరు హీరోలే కలిసి సినిమా చెయ్యడానికి జంకుతున్నఈ రోజుల్లో ఏకంగా నలుగురు హీరోలు కలిసి సినిమా చేశారు అంటే ఆ సినిమా కథ ఎంత బలంగా లేకపోతె వారు ఈ చిత్రం చెయ్యడానికి ఒప్పుకుంటారు. మరి 'శమంతకమణి' కథ మొత్తం ఒక కారు చుట్టూనే తిరుగుతుందని 'శమంతకమణి' ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. నారా రోహిత్ ఇన్వెస్టిగేషేన్ ఆఫీసర్ గా కనబడుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, ఆది, సుధీర్ బాబు లు కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. మరో సీనియర్ స్టార్ రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక కీ రోల్ చేస్తున్న ఈ శమంతకమణి పై మొదటినుండి మంచి అంచనాలున్నాయి. నలుగురు యంగ్ హీరోస్ కలిసి నటిస్తున్నారు అంటే సహజంగానే ఆ చిత్రంపై అమితాసక్తి నెలకొంటుంది. అందులోను కాస్త సస్పెన్సు థ్రిల్లర్ అనేసరికి ఇంకాస్త హైప్ క్రియేట్ అయ్యింది శమంతకమణి చిత్రం మీద. మరి ఇన్ని అంచనాలున్న ఈ శమంతకమణి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ: ఒక కోటీశ్వరుడి కొడుకు అయిన కృష్ణ(సుధీర్ బాబు) తన తండ్రి మీద అలిగి... తన తండ్రి ఒక వేలం పాటలో ఇష్టపడి కొనుకున్న 5 కోట్ల విలువచేసే ఓల్డ్ మోడల్ రోల్స్ రాయిస్ కారుని తీసుకుని ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకునేందుకు వెళతాడు. అయితే కృష్ణ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుని పూర్తయి బయటికి వచ్చేసరికి ఆ ఖరీదైన కార్ మిస్సవుతుంది. కృష్ణ తన కారు మిస్సయిందని పోలీస్ లకు ఫిర్యాదు చేస్తాడు. అయితే కృష్ణ తండ్రి కోటీశ్వరుడు అవడంతో ఆ కేసుని పోలీస్ శాఖ కూడా సీరియస్ గా తీసుకుంటుంది. ఈ కారు కేసుని ఎస్సై రంజిత్ కుమార్ (నారా రోహిత్) కు అప్పగిస్తుంది. మరి ఆ కేసు విషయంలో చాలా సీరీయస్ గా వున్న రంజిత్ కుమార్ కారు కొట్టేసిన దొంగల మీద ఫోకస్ పెడతాడు. కేసులో భాగంగా కృష్ణ పాల్గొన్న పార్టీకి వచ్చిన శివ (సందీప్ కిషన్) కార్తీక్ (ఆది), ఉమామహేశ్వరరావు (రాజేంద్ర ప్రసాద్)లతో పాటు కృష్ణను కూడా ఎస్సై రంజిత్ కుమార్ అనుమానిస్తాడు. విడివిడిగా వారిని ఇంటరాగేట్ చేస్తాడు. మరి ఆ ఇంటరాగేషన్ లో కారుని ఎవరు దొంగిలించారో ఎస్సై రంజిత్ కుమార్ కి తెలుస్తుందా..? అసలు శివ, కార్తీక్, కృష్ణ, ఉమా మహేశ్వరరావు కి ఉన్న సంబంధం ఏమిటి.? అసలు కారు వలన వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఆ కారు దొరికిందా లేదా? అనేది శమంతకమణిని వెండితెర మీద వీక్షించి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ: శమంతకమణి చిత్రంలో నటించిన నలుగురు యుంగ్ హీరోస్ ఎంతో బాగా నటించారు. కృష్ణ గా సుధీర్ బాబు, కార్తీక్ గా ఆది, శివ గా సందీప్ కిషన్, ఎస్సై రంజిత్ కుమార్ గా నారా రోహిత్ తమ పాత్రలకు న్యాయం చేశారు. నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం అనేది కొత్త కాదు. అతనింతకు ముందే పోలీస్ ఆఫీసర్ గా మెప్పించాడు. అతని పాత్ర ఆధ్యంతం సీరియస్ గా సాగినా అక్కడక్కడా నవ్వును తెప్పిస్తుంది. ఇక సందీప్ కిషన్ చాలా సహజ సిద్ధంగా పోకిరి కుర్రాడిగా మెప్పించాడు . ఇక సుధీర్ బాబు సీరియస్ పాత్రలో మెప్పించాడు . శమంతకమణి లో ఆది పాత్ర కాస్త చికాకు తెప్పిస్తుంది. ఇక ఉమా మహేశ్వరావు గా రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన నటన కనబర్చాడు. అలాగే హీరోయిన్స్ విషయానికొస్తే ఈ చిత్రంలో హీరోయిన్స్ కి ప్రాధాన్యం లేదు. ఎవరికివారే వారికిచ్చిన పాత్రల్లో మెప్పించారు. ఇక సీనియర్ నటి ఇంద్రజకి కూడా చెప్పుకోదగ్గ పాత్ర దొరకలేదు.
సాంకేతిక వర్గం పనితీరు: నలుగురు యువకులను ప్రధానంగా తీసుకుని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య శమంతకమణి కథను తయారు చేసుకున్నాడు. మొదట్లో ట్రైలర్ లో చూపించినట్టే సినిమా కథ మొత్తం శమంతకమణి కారు చుట్టూనే ఉంటుంది. సినిమా మొదలై ఎండ్ వరకు కారునే ప్రధాన పాత్ర పోషించింది. అయితే క్రైమ్ త్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించాలని డైరెక్టర్ అనుకున్నాడు. అయితే మనకు ట్రైలర్ లో కనిపించిన క్యూరియాసిటీ సినిమాలో కనబడదు. ఒక కారు ఎంతో విలువైంది కాబట్టే దాన్ని దొంగలు కొట్టెయ్యడం.... దాన్ని పోలీస్ లు కనిపెట్టడం వంటిది ఎన్నో సినిమాల్లో వచ్చేసింది. కథ పరంగా కొత్తగా శమంతకమణిలో మనకేం కనబడదు. అసలు కారు చుట్టూ కథను అల్లినపుడు కారు గురించి ప్రేక్షకులు ఎటువంటి థ్రిల్లింగ్ కలగదు. అసలా కారు స్పెషాలిటీ ఏమిటనేది క్లారిటీ ఇవ్వలేదు దర్శకుడు.ఇక మ్యూజిక్ విషయానికొస్తే మణిశర్మ సినిమాకు తగ్గ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. సినిమాలో ఉన్నది ఒకటే పాట. ఆ పాట ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు మరో పెద్ద ప్లస్. సీన్స్ కి తగ్గట్లుగా స్టైలిష్ విజువల్స్ తో సమీర్ రెడ్డి మెప్పించాడు. ఇక నిర్మాణ విలువలు విషయంలో కాస్త అసంతృప్తే కనబడుతుంది.
ప్లస్ పాయింట్స్: నలుగురు హీరోల నటన, సస్పెన్స్, కథనం, స్క్రీన్ ప్లే, కొన్ని కామెడీ సీన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్: కథ, దర్శకత్వం, రొటీన్ క్లైమాక్స్, ఫస్ట్ హాఫ్
రేటింగ్: 2.75 /5