శివలింగ మూవీ రివ్యూ

Update: 2017-04-14 15:26 GMT

నటీనటులు: రాఘవ లారెన్స్‌, రితిక సింగ్‌, వడివేలు, భానుప్రియ

సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌

నిర్మాత: రమేష్‌ పి. పిళ్ళై

రచన, దర్శకత్వం: పి.వాసు

ఒకప్పుడు పి.వాసు డైరెక్ట్ చేసిన 'చంద్రముఖి' ఎంత పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో తెలిసిన విషయమే. ఆ తర్వాత మళ్ళీ పి.వాసుకి అంతటి హిట్‌ రాలేదు. ఇక రాఘవ లారెన్స్‌ 'ము'ని చిత్రంతో అందర్నీ భయపెట్టాడు. దానికి సీక్వెల్‌గా వచ్చిన 'కాంచన' కూడా సూపర్‌హిట్‌ అయింది. దాని తర్వాత వచ్చిన 'గంగ' కూడా అంతే సెన్సేషనల్ హిట్‌ అయింది. ఇక పి.వాసు హీరోగానే కాకుండా డైరెక్టర్‌గా కూడా మూడు హార్రర్‌ చిత్రాలతో వరస హిట్స్‌ కొట్టిన రాఘవ లారెన్స్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాంటి భారీ అంచనాలను క్రియేట్‌ చేసిన చిత్రం 'శివలింగ'.... ప్రేక్షకులకు ఏవిధంగా రీచ్ అయ్యిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ: అర్థరాత్రి ట్రైన్‌లోని ఒక కంపార్ట్‌మెంట్‌లో ఇద్దరే ఇద్దరు వుంటారు. అందులో ఒకడు గుడ్డివాడు. మరొక వ్యక్తి రహీమ్‌(శక్తి). అతనికి పావురం నేస్తం. టాయ్‌లెట్‌కి వెళ్ళబోయి మెయిన్‌ డోర్‌ దగ్గరికి వెళ్ళిన గుడ్డివాడిని గుర్తించిన పావురం రహీమ్‌ని ఎలర్ట్‌ చేస్తుంది. ప్రమాదం అంచుకి వెళ్ళిన గుడ్డివాడిని రహీమ్‌ రక్షిస్తాడు. గుడ్డివాడు మాత్రం రహీమ్‌ని ట్రైన్‌లో నుంచి తోయడంతో అతను చనిపోతాడు. తిరిగి చూస్తే అది ఆత్మహత్యగా కోర్టు ధృవీకరిస్తుంది. రహీమ్‌ ప్రియురాలు సంగీత మాత్రం అది హత్యగా నమ్ముతుంది. ఒక పోలీస్‌ కమిషనర్‌ని కలిసి సీక్రెట్‌గా కేస్‌ని రీ ఓపెన్‌ చేయిస్తుంది. ఈ కేసుని దర్యాప్తు చేసేందుకు సిబిసిఐడి ఆఫీసర్‌ గా శివలింగేశ్వర్‌(రాఘవ లారెన్స్‌)ను నియమిస్తారు. శివ... సత్యభామ(రితిక సింగ్‌)ని పెళ్ళి చేసుకుంటాడు. నాలుగేళ్ళుగా స్మశానం పక్కన ఖాళీగా వున్న ఓ బిల్డింగ్‌లో కాపురం పెడతారు శివ, సత్యభామ. కొన్నిరోజుల తర్వాత సత్యభామ విచిత్రంగా ప్రవర్తించడం శివ గమనిస్తాడు. ఆమెని రహీమ్‌ ఆత్మ ఆవహిస్తోందని తెలుసుకుంటాడు. సత్యభామ శరీరంలోకి రహీమ్‌ ఆత్మ ఎందుకు వస్తోంది? అసలు రహీమ్‌ హత్యకు, సత్యభామకు ఏదైనా సంబంధం వుందా? ఎవరికీ హాని చేయని రహీమ్‌ని చంపింది ఎవరు? నిజానికి రహీమ్‌ది హత్యా? ఆత్మహత్యా? మరి పోలీస్ ఆఫీసర్ గా శివ హత్య చేసిన వ్యక్తిని పట్టుకోగలిగాడా? అనేది తెలుసుకోవాలంటే తెర మీద శివలింగా ని వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు: 'ముని, కాంచన, గంగ' వంటి హర్రర్ చిత్రాలతో ప్రేక్షకుల్ని భయపెట్టడమే కాకుండా ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేసిన రాఘవ లారెన్స్‌ ఈ చిత్రంలోనూ అదే కొనసాగించాడు. తన పాత్ర పరిధి మేరకు ఎంటర్‌టైన్‌ చేసేందుకు బాగానే ట్రై చేశాడు. తన డాన్సులతో, ఫైట్స్‌తో తప్ప పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఎంటర్‌టైన్‌ చేసే అవకాశం క్యారెక్టర్‌ పరంగా లారెన్స్‌కి దక్కలేదనే చెప్పాలి. డిఫరెంట్‌ స్టెప్పులతో, డిఫరెంట్‌ ఫైట్స్‌తో ప్రేక్షకుల్ని థ్రిల్‌ చెయ్యగలిగాడు. ఇక 'గురు' చిత్రంతో ఆర్టిస్టుగా తనని తాను ప్రూవ్‌ చేసుకున్న రితిక సింగ్‌ ఈ చిత్రంలో పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఒక స్టెప్‌ పైకి వెళ్ళిందని చెప్పాలి. ఆత్మ ప్రవేశించిన తర్వాత రితిక పెర్‌ఫార్మెన్స్‌ ఎక్స్‌లెంట్‌గా వుంది. ఇక ఊర్వశి, వడివేలు తమ పరిధిమేర నటించారు..రహీమ్‌గా నటించిన డైరెక్టర్‌ పి.వాసు తనయుడు శక్తి తన క్యారెక్టర్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశాడు. తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. మిగతా వారు రాధారవి, జయప్రకాష్‌, భానుప్రియ ఫర్వాలేదు అనిపించారు.

సాంకేతిక వర్గం పనితీరు: ముందుగా డైరెక్టర్‌ పి.వాసు గురించి చెప్పాలంటే చంద్రముఖి తర్వాత మరోసారి ప్రేక్షకుల్ని భయపెట్టదానికి తగిన బలమైన కథ లేకపోవడం ఈ సినిమాకి కొంచెం మైనస్. అయితే సినిమాలో ఓపెనింగ్‌ సీన్‌ చూసిన తర్వాత సినిమాలో ఏదో వుంది అన్న క్యూరియాసిటీ క్రియేట్‌ చేసాడు దర్శకుడు. అయితే సినిమా ఆధ్యంతం అంత క్యూరియాసిటీని మేన్‌టేన్ చెయ్యలేకపోయాడు. రహీమ్‌ని హత్య చేసింది ఎవరు? అనే చిన్న సస్సెన్స్‌ని క్లియర్‌ చెయ్యడానికి కథను ఎన్నో మలుపులు తిప్పి ప్రేక్షకుల్లో అప్పటివరకు వున్న ఆసక్తిని కాస్తా నీరుగార్చారు. చివరికి ఒక సాదా సీదా క్లైమాక్స్‌తో సినిమా ముగిసిందనిపించారు. సర్వేష్‌ మురారి చేసిన ఫోటోగ్రఫీ ఎక్స్‌లెంట్‌ అని చెప్పాలి. థమన్‌ చేసిన పాటల్లో రెండు డాన్స్‌ నంబర్స్‌ బాగున్నాయి, ఒక మెలోడీ సాంగ్‌ కూడా బాగుంది. సినిమా మూడ్‌కి తగ్గట్టు, కథ, కథనాలకు తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పర్వాలేదనిపించారు.

ప్లస్ పాయింట్స్: రాఘవ లారెన్స్, రితిక సింగ్ నటన, బ్యగ్రౌండ్ స్కోర్, ఫోటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: కథ, కథనం,హర్రర్

రేటింగ్: 2 .5 /5

Similar News