ప్రొడక్షన్ హౌస్: అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్
నటీనటులు: అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్, జగపతి బాబు, రమ్యకృష్ణ, అజయ్, అనీష్ కురువిల్లా, సత్యకృష్ణ, వెన్నెలకిషోర్ మొదలగు వారు
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత: నాగార్జున
దర్శకత్వం: విక్రమ్ కుమార్
అక్కినేని వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన అఖిల్ మంచి డాన్సర్. అంతేకాదు ఇప్పుడు కొత్తగా సింగర్ అవతారం కూడా ఎత్తాడు. వి.వి వినాయక్ వంటి మాస్ దర్శకుడితో అఖిల్ అనే మాస్ సినిమాతో ఇండస్ట్రీకి గ్రాండ్ గా పరిచయమైన అఖిల్ అక్కినేని ఆ సినిమా ఫలితం తో తెల్లబోయాడు. అందుకే రెండో సినిమాని మొదలు పెట్టడానికి చాలా అంటే చాలా గ్యాప్ తీసుకున్నాడు. నటనలోనూ, డాన్స్ ల పరంగా, బ్యాగ్రౌండ్ పరంగా అన్నిటిలో అందరి కన్నా ముందున్న అఖిల్ కి మొదటి సినిమాతో లక్కు కలిసి రాలేదు. అందుకే రెండో సినిమాని తమ కుటుంబానికి ఎప్పటికి మరిచిపోలేని ఒక తియ్యటి విజయాన్నిఅందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో హలో సినిమాని మొదలుపెట్టాడు. ఇక మొదటి సినిమాని భారీగా హీరో నితిన్ నిర్మించి చేతులు కాల్చుకున్నాడు. ఇక రెండో సినిమా ని బయట నిర్మాతలకు అప్పజెప్పేకన్నా నేనే నిర్మిస్తే.. అనే ఆలోచనతో.... అఖిల్ కి హిట్ అందించాలని నాగార్జున రంగంలోకి దిగాడు. ఎప్పుడూ లిమిటెడ్ బడ్జెట్ తో సినిమాని తెరకెక్కించే నాగార్జున, చిన్న కొడుకు అఖిల్ కోసం కాస్త గట్టిగానే ఖర్చు పెట్టాడు. అలాగే ఒక్క నిర్మాణ పనులనే చూసుకోకుండా... నాగార్జున హలో సినిమాకి సంబందించిన ప్రతి విషయాన్నీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి సినిమాని ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇక కొన్ని క్షణాల పాటు కాలం వెనక్కి జరిగితే ఎంత బాగుంటుందో అనుకోవడం మానవ సహజం. కానీ కాలాన్ని అదుపు చేయడం కానీ, దానిని వెనక్కో, ముందుకో జరపడం కానీ మానవమాత్రుల వల్ల కాదు. ఆ శక్తే మనిషికి ఉంటే అనే చిన్న ఫాంటసీలోంచి పుట్టుకొచ్చిన కథ 24 సినిమాని తెరకెక్కించిన విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ ,అఖిల్ ని డైరెక్ట్ చేస్తున్నాడనగానే... ఈ సినిమాలో కూడా అలాంటి ఒక విభిన్నత ఏమైనా ఉంటుందా అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలగడం... విక్రమ్ కుమార్ మేకింగ్ స్టయిల్ తో అఖిల్ ని ఎలా చూపిస్తాడో అనే క్యూరియాసిటీ తో హలో సినిమా మీద అంచనాలు కూడా భారీగా పెరిగాయి. అయితే ఇప్పుడు విక్రమ్ కుమార్ - అఖిల్ - నాగార్జున కలయికలో వస్తున్న హలో సినిమా హీరో తన సోల్మేట్ ని ఎలాకలుసుకున్నాడు అనే స్టోరీ లైన్ మీదనే తెరకెక్కింది. అఖిల్ సోల్మెట్ గా కొత్త అమ్మాయి కల్యాణి ప్రియదర్శన్ నటించింది. మరి భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకువస్తున్న హలో సినిమా తో అఖిల్ విజయాన్ని అందుకుని.. హీరోగా ఇండస్ట్రీలో పాతుకుపోతాడా? లేదంటే మళ్ళీ హీరోగా నిలబడడానికి ప్రయత్నాలు మొదలెడతాడా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
శీను, జున్ను చిన్నతనంలో మంచి స్నేహితులవుతారు. శీను అనాథ. కానీ జున్ను మాత్రం చాలా సంపన్న కుటుంబంలో పుట్టిన అమ్మాయి. జున్ను తండ్రి కి ఢిల్లీ ట్రాన్స్ఫర్ కావడంతో... జున్ను కుటుంబం ఢిల్లీకి పయనమవుతుంది. అయితే జున్ను, శీను ని విడిచి వెళ్లే క్రమంలో ఒక 100 నోటు మీద తన ఫోన్ నెంబర్ రాసిస్తుంది. కానీ ఆ 100 నోటుని శీను ఎక్కడో పోగట్టుకుంటాడు. తర్వాత ఒక యాక్సిడెంట్ లో శీనుకి రమ్యకృష్ణ, జగపతిబాబులు పరిచయం అవుతారు. వారు శీనుకి అవినాష్ (అఖిల్) అని పేరు పెట్టుకుని పెంచుకుంటారు. అవినాష్ పెరిగి పెద్దయ్యాక కూడా తన సోల్మెట్ జున్నుని వెతుకుతూనే ఉంటాడు. జున్ను అలియాస్ ప్రియా(కళ్యాణి) కూడా అవినాష్ కోసం ఎదురు చూస్తుంటుంది. అయితే అవినాష్ - ప్రియాలు ఇద్దరు కలుసుకున్నపటికి .. చిన్నప్పుడు విడిపోయిన శీను, జున్ను లుగా వారు ఒకరినొకరు గుర్తు పట్టరు. అవినాష్ సోల్మెట్ ని వెతికే క్రమంలో తన సెల్ ఫోన్ పోగొట్టుకుంటాడు. అందులో ఒక క్యాబ్ డ్రైవర్ నెంబర్ ఉంటుంది. అందుకే తన సెల్ ని ఎలాగైనా కనిపెట్టాలని అవినాష్ విశ్వప్రయత్నాలు చేస్తూ ఫైటింగ్ లు, ఛేజింగులు చేస్తుంటాడు. మరి అవినాష్ కి సెల్ ఫోన్ దోరికిందా? అసలు అవినాష్, ప్రియాలు ఒకరినొకరు ఎలా గుర్తు పడతారు? వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా?అసలు ఫోన్ కి అవినాష్ ప్రేమకు ఉన్న లింక్ ఏమిటి? అనే విషయాన్ని వెండితెర మీద హలో సినిమాని వీక్షిస్తే అర్ధమవుతుంది.
నటీనటుల నటన:
అఖిల్ అవినాష్ గా, లవర్ బాయ్ గా బాగా ఆకట్టుకున్నాడు. మొదటి సినిమా అఖిల్ కన్నా రెండో సినిమా హలో కి అఖిల్ నటనలో పరిణితి కనబడుతుంది. అలాగే యాక్షన్ సన్నివేశాల్లో అఖిల అద్భుతంగా నటించాడు. ఇక డాన్స్ విషయానికొస్తే... అఖిల్ ప్రతి స్టెప్ ఇరగదీసాడు. డాన్స్ కోసం, యాక్షన్ సన్నివేశాల కోసం అఖిల్ ఎంత కష్టపడ్డాడు అనే విషయం స్క్రీన్ మీద కనబడుతుంది. అఖిల్ డాన్సింగ్ స్టయిల్ అందరిని ఆకట్టుకుంటుంది. అఖిల్ తన సోల్మెట్ ని వెతికే క్రమంలో, అలాగే ఫోన్ పోయినప్పుడు ఛేజింగ్ సీన్స్ బిల్డింగ్ ల మీద నుండి దూకడం ఇలా అఖిల్ అన్నిటిలోను ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ కళ్యాణ్ ప్రియదర్శిన్ విషయానికొస్తే.. కళ్యాణి క్యూటీ లుక్స్ లో ఆకట్టుకుంది. ఆమె నటన సహజ సిద్ధంగా అనిపిస్తుంది. కళ్యాణ్, అఖిల్ జంట స్క్రీన్ మీద చూడడానికి బావుంది. ఇక అవినాష్ తల్లి తండ్రులుగా రమ్య కృష్ణ, జగపతి బాబు నటించడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. వారిద్దరూ చాలా బాగా ఆకట్టుకున్నారు. ఇక విలన్ అనలేము గాని అజయ్ కూడా తన పరిధిమేర ఆకట్టుకున్నాడు. శీను, జున్ను పాత్రలు చేసిన పిల్లలు కూడా బాగ్ నటించారు.
దర్శకుడు:
విక్రమ్ కె కుమార్ సినిమాలంటేనే... మెదడుతో ఆలోచించేవిగా ఉంటాయి. అందుకే అయన డైరెక్షన్ లో సినిమాలు వస్తున్నాయి అంటే మెదడుకు పనిచెప్పే సినిమాగా చాలామంది ముందే ఫిక్స్ అవుతారు. కాకపోతే ఇక్కడ రొటీన్ హలో కథను విక్రమ్ కుమార్ తనదైన స్టయిల్లో తెరకెక్కించాడు. అదే స్టోరీ లైన్ మీద గతంలోనే బోలెడన్ని సినిమాలు వచ్చేసాయి. దర్శకుడు తనదైన మార్క్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసాడు. ఫస్ట్ హాఫ్ లో చిన్న పిల్లల ఎపిసోడ్ ని కాస్త ల్యాగ్ చేసినప్పటికీ... తర్వాత వచ్చే సన్నివేశాలు వేగాన్ని పెంచి సినిమా మీద ఆసక్తిని క్రియేట్ చేసాడు. ఫస్ట్ హాఫ్ లో రాసుకున్న ఒక యాక్షన్ సన్నివేశం ప్రేక్షకులను కుర్చీల్లో అతుక్కుపోయేట్లుగా చేస్తుంది. హీరో సోల్మెట్ ని వెతికే క్రమంలో సెల్ ఫోన్ పోగొట్టుకోవడం, దాని కోసం హీరో ఛేజ్ చేయడం.. అసలా సీన్ హలో సినిమాకే హైలెట్ అనేలా వుంది. ఆ యాక్షన్ సన్నివేశాలు మాత్రం హాలీవుడ్ సినిమాలే తలపించేవిగా వున్నాయి. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆకట్టుకునేలా ఉంది. అయితే ఫస్ట్ హాఫ్ లో హీరయిన్ కళ్యాణి, రమ్యకృష్ణ, జగపతిబాబు, పాటలు ఇలా అన్ని ఆకట్టుకునేలా ఉండగా.. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి సినిమాలో స్పీడు తగ్గిపోయింది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న స్పీడు ని సెకండ్ హాఫ్ కొచ్చేసరికి కంటిన్యూ చెయ్యడం లో విక్రమ్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. క్లైమాక్స్ కూడా సో.. సో.. గా అనిపించడం కూడా ఈ సినిమాకి అతి పెద్ద మైనస్. ఇక యాక్షన్ సన్నివేశాలు, టెక్నీకల్ బ్రిలియెన్స్, స్క్రీన్ ప్లే తో సినిమా పర్వాలేదనిపిన్చేలానే వుంది.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ప్లస్ అయినప్పటికీ... మ్యూజిక్ డీప్ గా జనాల్లోకి వెళ్లలేదనేది సత్యం. సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ దంచేసినప్పటికీ... పాటల విషయంలో అనూప్ ఇంకాస్త మంచి మ్యూజిక్ ఇస్తే బావుండేది అనిపిస్తుంది. ఇక పీఎస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫీ అదుర్స్, పాటలని రిచ్ లుక్ లో చూపించడం దగ్గరనుండి... యాక్షన్ సీక్వెన్స్ ని సూపర్ గా చూపించడంలో వినోద్ పనితనం అమోఘం. ఇక ఎడిటింగ్ విషయానికొస్తే... ప్రవీణ్ పూడి ఎడింగ్ బాగుంది. నిర్మాణ విలువల విషయానికొస్తే.. నాగార్జున నిర్మాతగా ఎక్కడా తగ్గలేదు. నిర్మాణ విలువలు హలో సినిమాకి మేజర్ ఎస్సెట్ అని చెప్పడం లో అసలు సందేహమే లేదు.
విశ్లేషణ:
చిన్నప్పుడే విడిపోయి.. పెరిగి పెద్దయ్యాక మళ్ళీ వారిద్దరూ ఎలా కలిశారు అన్నదే హలో సినిమా కథ. హలో సినిమా చూస్తున్నంత సేపు.. ఈ సినిమా ఉదయ కిరణ్, రీమా సేన్ జంటగా వచ్చిన మనసంతా నువ్వే సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. హలో సినిమా కాన్సెప్ట్.. అచ్చం మనసంతా సినిమా కాన్సెప్ట్ ని పోలి ఉంటుంది. అందులో ఉదయ్ కిరణ్, రీమా సేన్ చిన్నప్పుడే స్నేహితులుగా విడిపోయి.. పెరిగి పెద్దయ్యాక గుండె నిండా ప్రేమను నింపుకుని ఒకరి కోసం ఒకరు వెతుక్కుంటూ చివరికి కలుసుకుంటారు. మరి హలో సినెమాలోకూడా అఖిల్ చిన్నప్పుడే విడిపోయిన తన సోల్మెట్ ని వెతుకుతూ చివరికి ఆమె ఎవరోతెలుసోవడం. ఇలా మొత్తం మనసంతా సినిమానే జ్ఞప్తికి తెస్తుంది హలో సినిమా. అయితే ఈ సినిమాలో కొత్తగా సోల్మెట్ ని వెతికే క్రమంలో అఖిల్ చేసిన యాక్షన్ సన్నివేశాలు, హీరో ఫోన్ పోయినప్పుడు అందులో ఉన్న నెంబర్ కోసం ఆత్రుతపడడం, సెల్ ఫోన్ కొట్టేసి అమ్ముకునే ముఠాతో గొడవ పడడం, అఖిల్ డాన్సింగ్ స్టయిల్ మాత్రమే కొత్తగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్: అఖిల్ నటన, డాన్స్, కళ్యాణి ప్రియదర్శన్ క్యూట్ లుక్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్, యాక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్: రొటీన్ కథ, కథనం, క్లైమాక్స్, సెకండ్ హాఫ్
రేటింగ్: 3.0/5