గుజరాత్ లో దారుణం.. ఫ్యాక్టరీ గోడ కూలి 12 మంది దుర్మరణం

గుజరాత్ రాష్ట్రంలో ఓ ఫ్యాక్టరీ గోడ కూలిపోవడంతో 12 మంది మరణించారు. మోర్బిలోని హల్వాద్ జీఐడీసీలో ఉప్పు కర్మాగారం గోడ కూలిపోవడంతో 12 మంది మరణించారు.

Update: 2022-05-18 11:11 GMT


గుజరాత్ రాష్ట్రంలో ఓ ఫ్యాక్టరీ గోడ కూలిపోవడంతో 12 మంది మరణించారు. మోర్బిలోని హల్వాద్ జీఐడీసీలో ఉప్పు కర్మాగారం గోడ కూలిపోవడంతో 12 మంది మరణించారు. మరో ముగ్గురు శిథిలాల కింద ఉన్నారని అధికారులు తెలిపారు. హల్వాద్ జీఐడీసీ (గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)లోని సాగర్ సాల్ట్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉప్పు కర్మాగారంలో గోడ కూలి 12 మంది మరణించారని రాష్ట్ర మంత్రి బ్రిజేష్ మెర్జా ధృవీకరించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. కార్మికుల మృతికి సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్రమోదీ, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. "మోర్బిలో చోటు చేసుకున్న ఘటన హృదయ విదారకంగా ఉంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. స్థానిక అధికారులు బాధితులకు అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తున్నారు" అని మోదీ ట్వీట్ చేశారు.

స్థానిక అధికారులు జేసీబీ సహాయంతో మృతదేహాలను బయటకు తీసి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. బస్తాల్లో ఉప్పు నింపే ప్రక్రియ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అకస్మాత్తుగా, గోడ కూలిపోయింది.. ఆ సమయంలో అక్కడ 20 నుండి 30 మంది కూలీలు ఉన్నారు. వారిలో 12 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.


Tags:    

Similar News