Narendra Modi : త్వరలో గుడ్ న్యూస్.. రెడీగా ఉండండి.. వరాల జల్లులట
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ త్వరలో చెప్పనుంది
BJP Loksabha Elections:లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడనున్నాయి. సాధారణ ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేదు. ముచ్చటగా మూడోసారి ఒంటరిగా విజయం సాధించాలని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాషాయ జెండా రెప రెప లాడింది. దీంతో కొంత ఉత్సాహం పెల్లుబికింది. దీంతో పాటు సెంటిమెంట్ ను కూడా ఇండియా పై చిలకరిస్తుంది. అయోధ్య రామాలయాన్ని ఈ 22వ తేదీన ప్రారంభించనుంది. దేశంలో అందరూ ఆరోజు ఈ విగ్రహ ప్రతిష్టలో భాగస్వామ్యులయ్యేలా వివిధ కార్యక్రమాలను రూపొందించి పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నం కమలం పార్టీ మొదలు పెట్టింది.
అయోధ్య ప్రారంభంతో....
అయోధ్య రామమందిరం నిర్మాణంతో నార్త్ లో కొంత పట్టు మరింత బిగించనున్నామని పార్టీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్ లో అత్యధిక స్థానాలు ఈసారి కూడా సాధించగలిగితే ఇక మూడోసారి కూడా విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు. అందుకు అనుగుణంగానే అయోధ్య రామాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించనున్నారు. దీంతో పాటు ఉత్తర భారత్ లోని అన్ని రాష్ట్రాల్లో కూడా సులువగా జెండా ఎగర వేయడానికి ఇది కీలకంగా మారబోతుందన్న అంచనాలు కూడా ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. మోదీ చరిష్మాతో పాటు సెంటిమెంట్ తోడైతై ఇక ఓట్లు వాటంతట అవే వచ్చి పడతాయని లెక్కలు వేసుకుంటున్నారు.
బడ్జెట్ లో కీలకంగా...
ఇక మరో ముఖ్యమైన ఘట్టం బడ్జెట్. వచ్చే నెల ఒకటోతేదీన బీజేపీ ప్రభుత్వం తన చివరి బడ్జెట్ ను పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశ పెట్టబోతోంది. ఫిబ్రవవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. అయితే ఈసారి అనేక వరాలు ఉంటాయని అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇటు సంక్షేమ పథకాలతో పాటు అటు అభివృద్ధి పనులపై దృష్టి పెట్టేలా బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అనేక కొత్త పథకాలను కూడా రూపొందించనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా ఇదే జరిగింది. అదే తరహాలో ఈసారి పెట్టబోయే మధ్యంతర బడ్జెట్ లో ప్రజలకు వరాలు ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు.
ఊరట కల్గించేలా...
ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించడంతో పాటుగా ఉద్యోగవర్గాలకు, పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట కల్గించేలా కొన్ని నిర్ణయాలుంటాయని చెబుతున్నారు. ఇప్పటికే ఆదాయ పన్ను మినహాయింపులో పరిమితిని కొంత పెంచారు. దీనిని మరింత పెంచే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే నిత్యావసరాల ధరలను కంట్రోల్ చేయడానికి కూడా ప్రణాళికను రూపొందించనున్నారు. దీంతో పాటుగా రైతులకు గిట్టుబాటు ధరల విషయంలోనూ ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశముందని చెబుతున్నారు. అన్ని వర్గాల వారికీ గుడ్ న్యూస్ ఫిబ్రవరి 1వ తేదీన చెప్పనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.