దారుణం.. నడుస్తున్న రైలు నుంచి యువతిని తోసేసిన ప్రయాణికుడు
ఉత్తరప్రదేశ్ బందా జిల్లాకు చెందిన యువతి మధ్యప్రదేశ్ చత్తర్ పూర్ లో ఉన్న భాగేశ్వర్ డ్యామ్ చూసేందుకు వచ్చింది.
చత్తర్ పూర్ : మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన జరిగింది. నడుస్తున్న రైలు లో నుంచి పాతికేళ్ల యువతిని ఓ దుర్మార్గుడు కిందికి తోసేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ బందా జిల్లాకు చెందిన యువతి మధ్యప్రదేశ్ చత్తర్ పూర్ లో ఉన్న భాగేశ్వర్ డ్యామ్ చూసేందుకు వచ్చింది. డ్యామ్ ను చూసి తిరిగి ఊరికి వెళ్లేందుకు రైలు ఎక్కింది. రైలులో ఉన్న తోటి ప్రయాణికుడి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ప్రయాణికుడు ఆమెను బలవంతం చేయబోగా.. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది.
దాంతో కోపంతో యువతిని కదులుతున్న రైల్లో నుంచి బయటికి తోసేశాడు. తీవ్రగాయాలపాలైన యువతిని రైల్వే పోలీసులు గుర్తించి చత్తర్ పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీనిపై జిల్లా ఎస్పీ వినాయక్ వర్మ స్పందిస్తూ.. ఏప్రిల్ 27న ఈ ఘటన జరిగిందని తెలిపారు. యువతిని రైలునుంచి తోసేసిన వ్యక్తిని గుర్తించామని, త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.