Sabarimala : దర్శన సమయాన్ని పొడిగించినా.. లాభం లేదే.. ఇంతటి క్యూలైనా?
శబరిమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకు లక్ష మంది భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు
శబరిమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకు లక్ష మంది భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు. వీరు అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే 24 గంటల సమయం పడుతుంది. మరో వైపు అనేక మార్గాల్లో వాహనాలు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయాయి. దీంతో ట్రావెన్‌కోర్ దేవస్థానం దర్శన సమయాలను పొడిగించింది. అదనంగా మరో గంట పాటు దర్శన సమయాన్ని పొడిగించినా భక్తుల సంఖ్య తగ్గకపోవడంతో దర్శనానికి గంటల సమయం పడుతుంది.
చేతులెత్తేసిన దేవస్థానం...
ఇరుముడులు ఎత్తుకుని క్యూలైన్లలోనే అయ్యప్పలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. చివరకు శబరిమలలో పరిస్థితిపై హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది. ముందుగా బుక్ చేసుకున్న వారినే దర్శనానికి అనుమతించాలని కోరింది. కానీ భక్తుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచే అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. భక్తులకు సరైన సౌకర్యం కల్పించడంలో దేవస్థాన యాజమాన్యం చేతులెత్తేసింది. మండల పూజకు ఇంత పెద్ద స్థాయిలో భక్తులు రావడం ఇదే తొలిసారి అని ఆలయ అధికారులు చెబుతున్నారు.