నేడు ఎన్ఐఏ కస్టడీకి తహపూర్ రాణా
2008లో ముంబయి ఉగ్రదాడి కేసులో కీలక నిందితుడు తహపూర్ రాణాను నేడు ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారు;

2008లో ముంబయి ఉగ్రదాడి కేసులో కీలక నిందితుడు తహపూర్ రాణాను నేడు ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారు. నిన్న అమెరికా నుంచి భారత్ కు తీసుకు వచ్చిన తహపూర్ రాణాను పాటియాలా ప్రత్యేక కోర్టులో హాజరు పర్చగా 18 రోజుల కస్టడీకి అనుమతించింది. ఎన్ఐఏ అధికారుల ఈరోజు తహపూర్ రాణాను ప్రశ్నించనున్నారు. 26/11 ముంబయి దాడుల వెనక వ్యూహకర్త ఎవరు? ఎలా జరిగిందన్న దానిపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీయనున్నారు.
పద్దెనిమిది రోజులు...
నేటి నుంచి ఈ నెల 29వ తేదీ వరకూ తహపూర్ రాణాను ఎన్ఐఏ అధికారులు అన్ని కోణాల్లో ప్రశ్నించనున్నారు. ముంబయి దాడుల కుట్ర ఎలా జరిగింది? దీని వెనక ఆర్థిక సాయాన్ని అందించిందెవరు? డేవిడ్ హెడ్లీతో ఉన్న సంబంధాలు వంటి వాటిపై ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించనున్నారు. తహపూర్ రాణా ను కస్టడీకి తీసుకొనగా ఎన్ఐఏ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. కేవలం అనుమతి ఉన్న వారికే లోపలకి పంపుతున్నారు. సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు.