కేంద్రమాజీ మంత్రి పండిట్ సుఖ్‌రామ్ కన్నుమూత
మే 7వ తేదీన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చినట్లు ఆయన మనువడు ఆశ్రయ్ శర్మ గతరాత్రి తన ఫేస్ బుక్ పోస్టులో..
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పండిట్ సుఖ్ రామ్(94) కన్నుమూశారు. కొంతకాలంగా సుఖ్ రామ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా.. మే 7వ తేదీన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చినట్లు ఆయన మనువడు ఆశ్రయ్ శర్మ గతరాత్రి తన ఫేస్ బుక్ పోస్టులో తెలిపారు. కానీ.. సుఖ్ రామ్ కన్నుమూసిన సమయాన్ని వెల్లడించలేదు. మే4వ తేదీన సుఖ్ రామ్ మనాలిలో బ్రెయిన్ స్ట్రోక్ కు గురవ్వగా.. అక్కడ మండిలోని ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్చారు. మరింత మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఢిల్లీకి తరలించేందుకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ప్రభుత్వ హెలికాప్టర్‌ను పంపారు.
సుఖ్ రామ్ 1993-96 వరకూ సమాచారశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. ఐదుసార్లు విధాన సభకు, మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. హిమాచల్ ప్రదేశ్ పశుసంవర్థకశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో.. సుఖ్ రామ్ జర్మనీ నుంచి ఆవులను దిగుమతి చేసుకోవడం ద్వారా పాడిరైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించారు.