Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. యాభై మందికి పైగా మృతి
ఉత్తరభారత దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలకు యాభై మంది వరకూ మరణించి ఉంటారని తెలిసింది
ఉత్తరభారత దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ లో కురిసిన వర్షాలకు ఇప్పటివరకూ యాభై మంది వరకూ మరణించి ఉంటారని తెలిసింది. ఇంకా అనేక మంది గల్లంతయినట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్ లోని కులు, మండి, సిమ్లాలలో భారీ వర్షాల కారణంగా భారీ వరదలు సంభవించాయి. ఇప్పటికే సమేజ్ గ్రామం పూర్తిగా కొట్టుకుపోయింది. ఆ గ్రామంలో కేవలం ఒకే ఇక ఇల్లు మిగిలింది. హిమాచల్ ప్రదేశ్ లో వరదల కారణంగా అనేక మంది గల్లంతయినట్లు ఫిర్యాదులందుతుండటంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా గాలిస్తున్నారు. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి.
బాధిత కుటుంబాలకు...
మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటుందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. ఎంతమంది గల్లంతయ్యారన్నది లేక్క తేలకుండా ఉంది. రెస్క్యూ సిబ్బంది నిరంతరం గాలిస్తున్నారు. క్లౌడ్ బరస్ట్ కారణంగానే భారీ వర్షాలు నమోదయినట్లు అధికారులు చెబుతున్నారు. దీని వల్ల ఒక్కసారిగా కుండపోత కురవడం వల్ల వరదలు ఉప్పొంగాయని అంటున్నారు. ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సఖూ బాధిత కుటుంబాలకు యాభై వేల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. దీనిని జాతీయ విపత్తుగా గుర్తించాలని ఆయన కోరారు.