మరో అల్పపీడనం.. నాలుగు రోజులు భారీ వర్షాలు ?
అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై..
కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇతర రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రజలు భారీ వర్షాలకు చిగురుటాకులా వణికిపోయారు. పంటలు చేతికొచ్చే సమయంలో వరదలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలు పూర్తిగా కోలుకోకుండానే భారత వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్త చెప్పింది. ఆగస్టు 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వెల్లడించింది.
ఈ అల్పపీడనం ప్రభావం ఒడిశాపై తీవ్రంగా ఉండనున్నట్లు తెలిపింది. అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా ఉండవచ్చని వాతావరణశాఖ వెల్లడించింది. కాగా.. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో పలు రాష్ట్రాల్లో నేటి నుంచి నాలుగురోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని తెలిపింది.