Narendra Modi : అటు ఆయన.. ఇటు ఈయన.. మధ్యలో మోదీ.. ఆచితూచి అడుగులేయాల్సిందేనా?

మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పాలన సజావుగా సాగడం అంత సులువు కాదు

Update: 2024-06-07 06:58 GMT

మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పాలన సజావుగా సాగడం అంత సులువు కాదు. ఇద్దరు సీనియర్ నేతల మధ్య మోదీ చిక్చుకున్నారు. రాజకీయ అనుభవంలోనూ, పార్టీలను అలవోకగా మార్చడంలోనూ అందెవేసిన చేతులతో ఆయన ఒక రకంగా సర్కస్ చేయనున్నారు. ఇప్పటి వరకూ సాగించిన పదేళ్ల పాలనను తన ఇష్టమొచ్చినట్లు సాగించిన మోదీకి ఇక దూకుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎన్డీఏలో బలమైన మిత్రపక్షాలుగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం పార్టీ, బీహార్ లో బలమైన జేడీయూలు చెరొకపక్క ఉన్నాయి. ఇద్దరు నేతలు తమ రాష్ట్ర ప్రయోజనాలను గురించి ఆలోచిస్తారు.

కాదని వెళ్లే...
వీరిని కాదని ఏకపక్షంగా వెళ్లే పరిస్థితి మోదీకి ఎంత మాత్రం లేదు. పెట్రోలు ధరల పెంపుదల నుంచి గ్యాస్ ధరల వరకూ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు వెనువెంటనే తీసుకునే అవకాశం లేదు. వాళ్లిద్దరికీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ముఖ్యం. అందుకే వారు మోదీ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కళ్లెం వేసి వెనక్కు లాగడానికి ప్రయత్నిస్తారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మోదీ కూడా ఈ ఇరువురిని కాదని, వేగంగా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. అంతర్జాతీయ విషయాల్లో ఒకే తప్పించి, దేశంలో తీసుకునే నిర్ణయాలు, వాటి ప్రభావం రాష్ట్రాలపై పడకుండా ఉన్నంత వరకే వీళ్లు ఊరుకుంటారు. అంతే తప్ప తమ మనుగడకు ఇబ్బంది అని భావిస్తే కఠిన నిర్ణయాలను తీసుకునేందుకు కూడా వెనుకాడరు.
అనుభవం కొత్తేమీ కాదు...
ఇద్దరితో అనుభవం మోదీకి కొత్త కాదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనేకసార్లు ఎన్డీఏను వదిలి వెళ్లారు. తిరిగిచేరారు. బీహార్ లో పరిస్థితులను బట్టి ఆయన ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకుంటూ నిర్ణయం తీసుకుంటుంటారు. అందుకే గతఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలసి పోటీచేసిన నితీష్ కుమార్ తర్వాత దానిని వదిలేసి ఎన్డీఏలోచేరారు. ఇప్పటికి మూడు నాలుగు సార్లు అలాగే చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఉపయోగపడ్డాయి. ఇక చంద్రబాబు విషయం కూడా అంతే. అనేకసార్లు బీజేపీ కూటమితో జత కట్టి తిరిగి విడిపోయి మళ్లీ కలుస్తుంటారు. అందుకే విడిపోవడం, కలవడం వాళ్లిద్దరికీ కొత్త కాదు. వీళ్ల విషయం తెలియని జాతీయరాజకీయ నేతలు ఎవరూ ఉండరు. ఎందుకంటే ఇప్పటి వరకూజరిగిన ఘటనలే వాటి గురించి చెబుతాయి. ఇద్దరినీ కాదని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి.
ప్రత్యేక హోదా...
ఇక రెండురాష్ట్రాలు పారిశ్రామికంగా వెనకబడి ఉన్నాయి. ప్రత్యేక హోదా పట్టుబడటానికి ఇద్దరు నేతలు ప్రయత్నించే వీలుంది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. అయితే బీజేపీ ప్రభుత్వం దానిని అమలు చేయలేదు. నాడు బలం ఉండటంతో చంద్రబాబు కూడా ఏమీ చేయలేకపోయారు. చివరకు 2017లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. నిధులు ఇవ్వడం మినహాయించి హోదాను మాత్రం కేంద్రం ప్రకటించలేదు. అయితే ఇద్దరి చేతుల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇరుక్కుని ఉండటంతో ఇప్పుడు ఇరువురు నేతలు సాధించుకోవడం సులువుగా మారిందని చెబుతున్నారు. ప్రత్యేక హోదా సాధించగలిగితే ఇద్దరికీ ఆయా రాష్ట్రాల్లో పరపతితో పాటు పార్టీకి ఆయుష్షు కూడా మరింత పెరుగుతుంది. పైగా చంద్రబాబు అత్యధిక స్థానాలతో రాష్ట్రంలోనూ బలంగా ఉన్నారు. అందుకే మోదీ ఇప్పుడు పెద్ద ఇరకాటంలోనే ఉన్నారు. ఇద్దరు సీనియర్లను ఎలా మెప్పించగలరన్నదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న.


Tags:    

Similar News