Delhi : ఢిల్లీలో దంచి కొడుతున్న వర్షాలు... అవస్థలు పడుతున్న జనాలు

దేశరాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి అధిక వర్షపాతం నమోదవుతుంది

Update: 2024-06-28 07:25 GMT

దేశరాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి అధిక వర్షపాతం నమోదవుతుంది. నిన్న మొన్నటి వరకూ ఎండలతో ఢిల్లీ వాసులు ఇబ్బంది పడ్డారు. ఎండ వేడిమిని తట్టుకోలేక అల్లాడి పోయారు. అనేక మంది వడదెబ్బ తగిలి ఆసుపత్రి పాలయ్యారు. కొందరు మరణించారు కూడా. అయితే గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో సప్థార్‌జంగ్‌లో 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. నిన్న రాత్రి కేవలం మూడు గంటల వ్యవధిలో 148.5 మిలీమీటర్ల వర్షం కురిసింది.

రహదారులన్నీ...
దీంతో రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. రహదారులపైకి వచ్చిన వాహనాలు మొరాయిస్తున్నాయి. రహదారిపై రోడ్లు నిలిచిపోవడంతో వాహనాలు నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విమానాల రాకపోకలపై కూడా ప్రభావం చూపుతుంది. అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ వన్ లో పైకప్పు కూలి ఒకరు మరణించారు. విమాన సర్వీసులు రద్దవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
నీటమునిగిన...
దక్షిణ ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతంలో వరదనీరు చేరడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. తీన్ మూర్తి మార్గంలో వరద నీరుతో రహదారులపైకి నీరు చేరింది. బస్సు బోల్తాపడటంతో ప్రయాణికులు నీళ్లలో మునిగిపోవడంతో స్థానికులు వెంటనే వారిని రక్షించారు. భారీ వర్షాలతో పార్లమెంటు సభ్యులు కూడా లోక్‌సభ సమావేశానికి రావడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. మరికొద్ది రోజులు వర్షాలు పడతాయని, జూన్ 30వ తేదీన మాత్రం భారీ వర్షం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రజలు సురక్షితంగా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News