పోలీసు స్టిక్కర్ ఉన్న కారులో వచ్చాడు.. సీఎం ఇంట్లోకి చొరబడ్డాడు
తన కాళీఘాట్ నివాసం నుండి సెంట్రల్ కోల్‌కతాలోని అమరవీరుల దినోత్సవ ర్యాలీ వేదికకు చేరుకోవడానికి కొన్ని గంటల ముందు ఈ సంఘటన
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి ఒక వ్యక్తి చొరబడేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడ్ని వెంటనే అడ్డుకున్నారు. ఆ వ్యక్తి వద్ద తుపాకీ, కత్తితోపాటు కొన్ని ఏజెన్సీలకు చెందిన ఐడీ కార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కోల్‌కతాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. నల్లకోటు, టై ధరించిన ఒక వ్యక్తి పోలీస్ అని స్టిక్కర్ ఉన్న కారులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసం వద్దకు చేరుకున్నాడు. గన్, కత్తి ఉన్న అతడు లోపలి చొరబడుతూ ఉండగా పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని షేక్ నూర్ ఆలంగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నారని కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ తెలిపారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ మాట్లాడుతూ, “సీఎం మమతా బెనర్జీ నివాసం సమీపంలో షేక్ నూర్ ఆలం అనే వ్యక్తి లోపలి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా కోల్‌కతా పోలీసులు అడ్డుకున్నారు. అతని వద్ద ఒక తుపాకీ, ఒక కత్తి, వివిధ ఏజెన్సీలకు చెందిన అనేక ID కార్డులతో పాటు నిషేధిత పదార్థాలు లభించాయి. అతను పోలీసు స్టిక్కర్ ఉన్న కారులో వచ్చాడు. అధికారులు అతడిని ప్రశ్నిస్తున్నారు" అని తెలిపారు.