తల్లి బాధ అర్థం చేసుకోకుండా.. చెంపదెబ్బ కొట్టిన పోలీసు
మధ్యప్రదేశ్‌లోని షాహ్‌డోల్ జిల్లాలో శవపరీక్ష కోసం తన తొమ్మిదేళ్ల కుమారుడి మృతదేహాన్ని తీసుకువెళ్లకుండా అడ్డుకున్న తల్లిని ఓ పోలీసు
మధ్యప్రదేశ్‌లోని షాహ్‌డోల్ జిల్లాలో శవపరీక్ష కోసం తన తొమ్మిదేళ్ల కుమారుడి మృతదేహాన్ని తీసుకువెళ్లకుండా అడ్డుకున్న తల్లిని ఓ పోలీసు చెంపదెబ్బ కొట్టిన ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని జైత్‌పూర్‌లోని ఒక గ్రామంలో పాము కాటువేయడంతో బాలుడిని రెండు రోజుల క్రితం చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు బాలుడిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో తన కుమారుడు ఇక లేడన్న విషయం తెలిసి తల్లి ఆసుపత్రి వెలుపల తన కుమారుడి మృతదేహాన్ని పట్టుకుని గుండెలవిసేలా రోదించింది. అదే సమయంలో సంతోష్ సింగ్ పరిహార్ అనే పోలీసు ఆమె వద్దకు వచ్చి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం అప్పగించాలని కోరాడు.
బాధిత తల్లి ప్రతిఘటించి మృతదేహాన్ని అప్పగించేందుకు నిరాకరించింది. దీంతో కోపానికి గురైన పోలీసు అధికారి పరిహార్ ఆమెను చెప్పుతో కొట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. "హెడ్ కానిస్టేబుల్ సంతోష్ సింగ్ పరిహార్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం అప్పగించాలని మహిళను కోరారు. మృతదేహాన్ని అప్పగించేందుకు నిరాకరించినందుకు మృతుడి తల్లిని పరిహార్ చెప్పుతో కొట్టాడని కుటుంబీకులు ఆరోపించారు. పరిహార్‌ను తక్షణమే అటాచ్ చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది ”అని షాహ్‌డోల్ ఏఎస్పీ ముఖేష్ వైశ్య తెలిపారు.