పేలుతోన్న ఎలక్ట్రిక్ బైకులు.. 1441 వాహనాలను రీకాల్ చేసిన ఓలా

ఎలక్ట్రిక్ వాహనాల వరుస పేలుడు ఘటనలతో కేంద్రం కూడా అప్రమత్తమయింది. వాహనాల తయారీలో లోపాలుంటే..

Update: 2022-04-24 13:01 GMT

న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బైకులు, వాటి బ్యాటరీలు పేలిన ఘటనలు చాలా ఉన్నాయి. కొన్ని ఘటనల్లో ప్రాణాలు కూడా కోల్పోయినవారున్నారు. నిన్న కూడా విజయవాడలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఓ వ్యక్తి మృతి చెందగా.. భార్య, పిల్లలు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు పేలుడు ఘటనలు ఎక్కువవుతుండటంతో ఓలా సంస్థ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 1441 ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఎలక్ట్రిక్ వాహనాల వరుస పేలుడు ఘటనలతో కేంద్రం కూడా అప్రమత్తమయింది. వాహనాల తయారీలో లోపాలుంటే కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో.. ఓలా ఈ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ముందంజలో ఉన్న కంపెనీల్లో ఓలా ఒకటి. అయితే, గత నెలలో ఓలా స్కూటర్లు, బ్యాటరీలు పేలిపోయిన సంఘటనలు వెలుగుచూశాయి. ఈ ఘటనలకు గల కారణాలను కనుగొనేందుకు కంపెనీ సిద్ధమైంది.
ఇప్పటికే విక్రయించిన 1,441 ఓలా స్కూటర్లను రీకాల్ చేసింది. సంస్థకు చెందిన ఇంజనీర్లు బ్యాటరీలు, వాహనాలను పూర్తిగా తనిఖీ చేస్తారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే లోపాలను సరిదిద్దుతారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రమాణాలకు అనుగుణంగా తమ వాహనాలు ఉండేలా చూస్తామని ఓలా ప్రకటించింది. కాగా.. ఇప్పటికే ఒకినావా ఆటోటెక్ అనే సంస్థ కూడా తమ కంపెనీకి చెందిన 3000 వాహనాలను రీకాల్ చేసింది.




Tags:    

Similar News