టమాటా సెగకు ఘాటెక్కుతున్న ఉల్లి
ఉత్తరాదిన వచ్చిన మెరుపు వరదల కారణంగా చాలా వరకూ పంటలు దెబ్బతిన్నాయి. వాటి ప్రభావం నిత్యావసర వస్తువుల..
ఇప్పటికే మార్కెట్లో పెరిగిన టమాటా ధరలకు సామాన్యుడి జేబుకు చిల్లుపడుతుంది. కిలో టమాటాలు కొనాలంటే రూ.120 నుంచి రూ.150 ఖచ్చితంగా ఖర్చుచేయాల్సిన పరిస్థితి. కొన్నిప్రాంతాల్లో అయితే రూ.150 పెట్టి కొందామన్నా టమాటాలు కనిపించడం లేదు. రైతు మార్కెట్లలో అయితే.. చాలా వరకు టమాటాలు అమ్మడం లేదు. ఉత్తరాదిన వచ్చిన మెరుపు వరదల కారణంగా చాలా వరకూ పంటలు దెబ్బతిన్నాయి. వాటి ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుందని ఇప్పటి నుంచే ఆందోళన మొదలైన నేపథ్యంలో.. ఉల్లి ధరలకు రెక్కలొస్తున్నాయి. అసలే టమాటాలతో చేసే వంటకాలను తినడమే మానేసిన ప్రజలు.. ఇప్పుడు ఉల్లి కూడా సెంచరీకి చేరువైతే ఇంకేం కొనాలి ? ఏం తినాలి ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో ఎర్ర ఉల్లిపాయలు కిలో రూ.30-35 ఉండగా.. తెల్ల ఉల్లిపాయలు కిలో రూ.40-60 వరకూ విక్రయిస్తున్నారు. మరో నెల రెండు నెలల్లో ఉల్లి ధరలు సెంచరీ కొట్టొచ్చన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నేషనల్ కమోడిటీస్ మేనేజ్ మెంట్ సర్వీస్ లిమిటెడ్ సీఈఓ, ఎండీ సంజయ్ గుప్తా ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం నిల్వ ఉన్న 2.5 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ ఉన్న ఉల్లినే విక్రయిస్తున్నామని, అక్టోబర్, నవంబర్ నెలల్లో దిగుబడి తక్కువగా ఉండే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. ఉల్లి వసూళ్లు తగ్గితే.. ధరలు పెరగడం ఖాయమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.