కేకే మరణంపై రాజకీయ దుమారం.. నిర్వాహకులదే తప్పా..?
ఆడిటోరియం కెపాసిటీ 2,482, కానీ కెపాసిటీ కంటే రెండింతలు ఎక్కువ వచ్చారు.
ప్రముఖ గాయకుడు కేకే మరణంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. మంగళవారం రాత్రి కోల్‌కతాలో ఆయన ప్రదర్శనకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడమే ఇందుకు కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. తక్కువ కెపాసిటీ ఉన్న ఆడిటోరియంలోకి ఎక్కువ మందిని పంపించేయడం, ఏసీ వంటివి ఆఫ్ చేసి ఉంచడం, సరైన రీతిలో అధికారులు రెస్పాండ్ అవ్వకపోవడం కూడా కేకే మరణానికి కారణాలని బీజేపీ ఆరోపిస్తూ ఉంది.
పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆయనకు సరైన ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. మూడు వేల మంది పట్టే ఆడిటోరియంలో రెట్టింపుకు పైగా జనం వచ్చారు. కేకేను పూర్తిగా చుట్టుముట్టారని సమిక్ భట్టాచార్య ఆరోపించారు. 2000-3000 కెపాసిటీ ఉంటే అంతకు మించి అభిమానులను లోపలకు అనుమతించారు. దీంతో ఫర్నీచర్ ను కొందరు ధ్వంసం చేయగా.. ఆడిటోరియం తలుపులు కూడా విరగ్గొట్టారు. అనేక వీడియోలలో ఆడిటోరియంలోని వేడి గురించి KK ఫిర్యాదు చేస్తూ కనిపించారు. తన చెమటను టవల్ తో తుడుచుకుంటూ, ఆపై ఎయిర్ కండిషనింగ్ వైపు పైకి చూపుతూ మాట్లాడారు. దీంతో బీజేపీ నాయకులు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేకే మృతికి గుండెపోటే కారణమని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్టు పోలీసులు చెప్పారు. దర్యాప్తు జరుగుతోందన్నారు. మంగళవారం రాత్రి ప్రదర్శన తర్వాత హోటల్ లాబీల్లో ఆయనను అభిమానులు భారీగా చుట్టుముట్టారు. ఒకరిద్దరితో సెల్ఫీ దిగాక పై అంతస్తులోని తన గదిలోకి వెళ్లబోతూ తూలి పడిపోయారని పోలీసులు వివరించారు. ఆయన నుదిటిపై, పెదవులపై రెండు గాయాలున్నాయన్నారు.
కేకే ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు కోల్‌కతా హోటల్ కారిడార్‌లో నడుస్తున్నట్లు చూపించే సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించారు. కచేరీ సమయంలో విపరీతమైన వేడి మధ్య వెంటిలేషన్ సరిగా లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తాయి. కోల్‌కతాలో కచేరీ ముగిసిన తర్వాత గాయకుడి ఆకస్మిక మరణం పట్ల.. వేదిక వద్ద ఏర్పాట్లపై పలు ప్రశ్నలను లేవనెత్తింది. KK సంగీత కచేరీ జరిగిన దక్షిణ కోల్‌కతాలోని నజ్రుల్ మంచ్ ఆడిటోరియం సిబ్బంది మాట్లాడుతూ ఆడిటోరియం అభిమానులతో కిక్కిరిసి ఉందని చెప్పారు. "ఆడిటోరియం కెపాసిటీ 2,482, కానీ కెపాసిటీ కంటే రెండింతలు ఎక్కువ వచ్చారు. అభిమానులు గేటును బద్దలు కొట్టారు" అని ఆడిటోరియం ఉద్యోగి చందన్ మైతీ వార్తా సంస్థ ANIకి తెలిపారు.