భూ కబ్జా కేసులో కోర్టుకు హాజరైన పరమశివుడు
ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఓ పిటిషన్ వేశారు. ఆ భూమిలో ఉన్న శివాలయం సహా 16 మందిని..
రాయ్ గఢ్ : భూ కబ్జా కేసులో సాక్షాత్తు పరమశివుడిపైనే ఆరోపణలు రావడంతో.. ఆ లయకారుడే కోర్టులో విచారణకు హాజరయ్యాడు. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం. ఓ భూ కబ్జా కేసులో శివయ్యతో పాటు.. మరో 9 మందికి కూడా విచారణకు హాజరు కావాలని కోర్టు నోటీసులు పంపింది. దాంతో శివయ్య(విగ్రహం)తో పాటు 9 మంది విచారణకు హాజరయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చత్తీస్ గఢ్ లోని రాయ్ గఢ్ లో 25వ వార్డుకు చెందిన సుధా రజ్వాడే బిలాస్ పూర్ హైకోర్టులో.. ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఓ పిటిషన్ వేశారు. ఆ భూమిలో ఉన్న శివాలయం సహా 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు.
ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. కేసును దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన స్థానిక తహసీల్దార్ కార్యాలయం ప్రాథమిక విచారణ ప్రారంభించి 10 మందికి నోటీసులిచ్చింది. ఈ నెల 25న జరగనున్న విచారణకు హాజరై భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు, విచారణకు హాజరుకాకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని, భూమిని ఖాళీ చేయించి రూ. 10 వేల జరిమానా విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో నోటీసులు అందుకున్న శివుడితోపాటు 9 మంది కోర్టు విచారణకు హాజరయ్యారు. గుడిలోని శివలింగాన్ని రిక్షాలో కోర్టుకు తీసుకొచ్చి హాజరు పరిచారు.