మరింత మండనున్న మే.. భారత వాతావరణ శాఖ అంచనా
దేశంలోని పలు ప్రాంతాల్లో వచ్చే నెలలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
ఏప్రిల్ నెలలో ఈసారి విభిన్న వాతావరణం నెలకొంది. కొద్దిరోజులు మండే ఎండలు.. మరికొద్ది రోజులు అకాల వర్షాలు. నడివేసవిలో భారీ వర్షాలు రావడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, మామిడి రైతులను అకాల వర్షాలు నట్టేట ముంచాయి. కాగా.. ఏప్రిల్ ముగిసి మే నెల రాబోతుండటంతో మే లో భారతదేశంలో వాతావరణం ఎలా ఉంటుందో భారత వాతావరణ శాఖ ఓ అంచనా వేసింది. ఈ మేరకు వివరాలు వెల్లడించింది.
దేశంలోని పలు ప్రాంతాల్లో వచ్చే నెలలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పెరగనుండటంతో.. విద్యుత్ పంపిణీ వ్యవస్థలపై ఒత్తిడి పెరగడంతో పాటూ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి ప్రజల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతినొచ్చని భావిస్తోంది. మధ్య భారత్, తూర్పున ఉన్న ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే.. ఈశాన్య, పశ్చిమ రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. గతేడాది కూడా భారత్‌లో అసాధారణ స్థాయిలో ఉష్టోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. ఫలితంగా, గోధుమల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో కొత్త పెట్టుబడుల విషయంలో వ్యాపారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. భారత్‌తో పాటూ థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. చైనాలోని యున్నన్ ప్రాంతంలో ప్రస్తుతం కరవు పరిస్థితులు నెలకొన్నాయి.