నేడు 9 సెకన్లలో కూలనున్న ట్విన్ టవర్స్.. ఆసక్తికర విషయాలివి !

భవనాల కూల్చివేత నేపథ్యంలో.. ఉదయాన్నే జంతు సంరక్షణ సంస్థలు సొసైటీకి చేరుకుని అక్కడ శునకాలు, ఇతర పెంపుడు..

Update: 2022-08-28 05:07 GMT

నోయిడాలో సూపర్ టెక్ సంస్థ నిర్మించిన ట్విన్ టవర్స్ నేడు 9 సెకన్లలో కూలిపోనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ టవర్లను కూల్చివేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అందరూ చూస్తుండగానే ఈ జంట టవర్లు నేలమట్టం కానున్నాయి. కొద్దిసేపటి క్రితమే భవనాల వద్దకు చేరుకున్న అధికారులు.. ఎమరాల్డ్ కోర్టు సొసైటీలో ఉన్న వేలాదిమందిని ఖాళీ చేయిస్తున్నారు.

ఈ ట్విన్ టవర్ల పేర్లు అపెక్స్ - సేయాన్. భవనాల కూల్చివేతకు అధికారులు 3700 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగించనున్నారు. కేవలం 9 సెకన్లలో రెండు ఎత్తైన భవనాలు నేలమట్టం కానున్నాయి. భవనాల పేల్చివేత నేపథ్యంలో.. వాటికి 50 మీటర్ల చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ అటువైపు రాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. ట్విన్ టవర్ల కూల్చివేతపై ఎడిఫిస్ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన ఉత్కర్ష్ మెహతా మాట్లాడుతూ.. ఈ విషయంలో తాను కొంత ఆందోళనగా ఉన్నట్లు తెలిపారు. పేలుళ్లు ప్రణాళిక ప్రకారం జరుగుతాయని వందశాతం విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు.
భవనాల కూల్చివేత నేపథ్యంలో.. ఉదయాన్నే జంతు సంరక్షణ సంస్థలు సొసైటీకి చేరుకుని అక్కడ శునకాలు, ఇతర పెంపుడు జంతువులను తరలించారు. భవనాల కూల్చివేత సమయంలో అక్కడ జంతువులు లేకుండా జాగ్రత్త పడ్డారు. గతేడాది ఆగస్టులోనే భవనాల కూల్చివేతకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అందులో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి 12 శాతం వడ్డీతో కలిపి అసలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నగరంలోని ముఖ్యమైన రూట్లలో ట్రాఫిక్‌ను మళ్లించారు. జేపీ ఆసుపత్రి, ఫెలిక్స్ ఆసుపత్రులను అప్రమత్తం చేశారు. అవాంఛనీయ ఘటన జరిగితే వెంటనే చికిత్స అందించేలా వాటిని సిద్ధం చేశారు.


Tags:    

Similar News