స్మిత సబర్వాల్ ట్వీట్.. స్వేచ్ఛాయుత దేశంలో ఉన్నామా?
బాల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల విడుదలపై తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ స్పందించారు.
బాల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల విడుదలపై తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ స్పందించారు. ఆమె తాజాగా ట్వీట్ చేశారు. గ్యాంగ్ రేప్ చేసిన నిందితులను విడిచిపెట్టడం తనకు దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆమె అన్నారు. ఈ న్యూస్ చూసిన తర్వాత ఒక మహిళగా, ఒక సివిల్ సర్వెంట్గా తాను నమ్మలేకపోయాయనని అన్నారు. స్వేచ్ఛాయుత దేశంలో తాను ఉన్నానని నమ్మకం కలగడం లేదన్నారు.
హక్కులను కాలరాస్తూ...
ఎలాంటి భయాలు లేకుండా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే బాల్కిస్ బానో హక్కును తుడిచి పెట్టినట్లయిందని స్మితా సబర్వాల్ అభిప్రాయపడ్డారు. గుజరాత్ లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో దోషులను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అక్కడి ప్రభుత్వం విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. రేపిస్టులకు ప్రభుత్వం అండగా నిలబడుతుందన్న కామెంట్స్ సమాజ హితం కోరే వారి నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ట్వీట్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ చేయడం గమనార్హం.