ఆనం రామనారాయణరెడ్డి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. వచ్చే నెల 2వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు ఆనం రామనారాయణరెడ్డి రెడీ అయిపోతున్నారు. సెప్టంబరు 2వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించి ఆనం పార్టీలో చేరనున్నారు. వైసీపీ అధినేత జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వందలాది వాహనాలతో ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు నుంచి విశాఖ వెళ్లి జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నెల్లూరు జిల్లా నేతగా తన సత్తా చాటాలని భావిస్తున్న ఆనం రామనారాయణరెడ్డి తనకు పట్టున్న అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలతో కలసి జగన్ వద్దకు వెళ్లనున్నారని తెలిసింది.
గత ఎన్నికల్లనూ......
నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లోనూ వైసీపీకి అనుకూల పవనాలు వీచాయి. అత్యధిక స్థానాలు గెలుచుకుంది. ఈసారి కూడా అంతకు మించి స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో వైసీపీ నేతలు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసిన తర్వాత జిల్లాలో పార్టీకి మరింత జోష్ పెరిగింది. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపం, మంత్రుల మధ్య కీచులాటలు, నేతల వీధిపోరాటాలు తమకు కలసి వచ్చే అంశంగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనం చేరికతో నెల్లూరు జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.
సన్నిహితులతో సమావేశాలు.....
నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి శుక్రవారం ఆనం రామనారాయణరెడ్డిని కలిశారు. ఆనం నివాసంలో దాదాపు మూడు గంటలకు పైగానే చర్చలు జరిగాయి. సెప్టంబరు 2వ తేదీన జరిగే కార్యక్రమం గురించి, ఆనంతో పాటు వైసీపీలో చేరే ఇతర నేతల పేర్లపై కూడా వీరు చర్చించారు. ఆనం ఫ్యామిలీకి నెల్లూరు రూరల్, సర్వేపల్లి, వెంకటగిరి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉండటంతో ఆ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలతో కూడా ఆనం సమాలోచనలు చేస్తున్నారు.
గౌరవమైన పదవి......
ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో చేరిన వెంటనే కీలక పదవి ఆయనకు ఇస్తారని కూడా తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచనలతో ఆనంకు పార్టీలో పెద్దపీట వేయాలని జగన్ కూడా నిర్ణయించారని తెలుస్తోంది. మేకపాటి బ్రదర్స్ ను నొప్పించకుండా ఆనంను పార్టీలో ఉన్నత స్థానంలో ఉంచాలన్నది వేమిరెడ్డి ప్రతిపాదన. మరి జగన్ ఏం పదవి ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్రస్థాయిలోనే పదవి ఇచ్చి ఆనంకు పార్టీలో తగిన గౌరవం ఇచ్చామన్న సంకేతాలను పంపాలన్నది జగన్ యోచనగా ఉంది. మొత్తం మీద ఆనం వచ్చే నెల 2వ తేదీన పార్టీలో చేరుతుండటంతో జిల్లా పార్టీలో మరింత జోష్ పెరుగుతుందనే చెప్పాలి.