వారంతా పేరుకే పదవి లో ఉన్నారా?

భారత రాజ్యాంగంలో ప్రభుత్వ పాలన ప్రజలకు అనుకూలంగా ఉండడానికి చాల లోతైన ప్రజాస్వామ్య నిర్మాణం చేశారు.

Update: 2023-08-08 14:54 GMT

భారత రాజ్యాంగంలో ప్రభుత్వ పాలన ప్రజలకు అనుకూలంగా ఉండడానికి చాల లోతైన ప్రజాస్వామ్య నిర్మాణం చేశారు. మూడంచల ప్రభుత్వం అందులో భాగమే – కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థలు. దీనికి దన్నుగా ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉంది. దాని ద్వార నిర్దిష్ట కాల పరిమితి మేరకు ప్రజా ప్రతినిధులను ప్రజలు ఎన్నుకుంటారు. వీరు ఎన్నికైన పాలన వేదిక బట్టి ప్రజలకు అనుకూలమైన పాలనా, విధాన నిర్ణయాలు తీసుకుంటారు. మూడు అంచెల మధ్య కూడా ఎటువంటి సంబంధం ఉంటుంది అని కూడా రాజ్యాంగంలో చెప్పారు. అయితే, దాదాపు 40 యేండ్ల నుంచి గ్రామా స్థాయి, మునిసిపల్ స్థాయి ప్రభుత్వ వ్యవస్థ బలహీనం అవుతూ వచ్చింది. బలహీనం తనంతట తాను కాలేదు. చేయబడింది. ఎప్పుడైతే నిధుల మీద ఆధిపత్యం సాధించారో అప్పటి నుంచి స్థానిక పరిపాలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధినేతల దయా దాక్షిణ్యాల మీద నడుస్తున్నది. రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఆర్ధిక సంఘం (finance Commission) లాంటివి లేకపోతే స్థానిక పాలన ఇంకా ఘోరంగా ఉండేది. ఇప్పుడు కనీసం తూతూమంత్రంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నిధులు అప్పడప్పుడు విదిలిస్తున్నారు.

ఇది హైదరాబాదులో ఎట్లా పని చేస్తున్నది మనం చూడవచ్చు. హైదరాబాదులో మూడు అంచెల ప్రజా ప్రతినిధులు ఉన్నారు. పార్లమెంట్ సభ్యులు 7 గురు, తెలంగాణా శాసనసభకు 25 మంది, హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్లో 150 మంది కార్పొరేటర్లు. చుట్టూ ఉన్న మునిసిపాలిటీలలో కూడా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఉన్నారు. వీరు ఎవ్వరు కూడా ప్రజల సమస్యలు విని, పరిష్కారం చేయరు. GHMC సమావేశాలు చాల తక్కువగా అవుతాయి. స్టాండింగ్ కౌన్సిల్ సమావేశాలు ఇంకా తక్కువ. హైదరాబాద్ కు సంబంధించిన కీలక నిర్ణయాలు GHMC కాకుండా మునిసిపల్ శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి తీసుకుంటారు. శాసన సభలో హైదరాబాద్ గురించి ఒక్కనాడు కూడా ఇక్కడి శాసనసభ్యులు చర్చించరు. GHMC లో ఇక్కడి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ప్రాతినిధ్యం ఉన్నా సమావేశాలకు హాజరు కారు. వాళ్ళు హాజరు అయితే కార్పొరేటర్లు మాట్లాడే అవకాశం ఉండదు. GHMC కార్పొరేటర్లు తమకు కావాల్సిన కాంట్రాక్టుల గురించి తపన పడతారు కాని నగర స్థాయి నిర్ణయాలలో జోక్యం చేసుకోరు. విషయ పరిజ్ఞానం పెంచుకోరు కూడా.

మంచి నీళ్ళు, మురికి నీళ్ళు హైదరాబాద్ జల మండలి పరిధిలో ఉంటాయి. అది ఒక ప్రత్యెక చట్టం క్రింద ఒక కంపెనీగా ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా పని చేస్తున్నది. దాని నిధులు, నిర్ణయాలు, పెట్టుబడులు అన్నీ కూడా అధికారులే చేస్తారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటి (HMDA) ప్రణాళిక సంస్థ. ఇది కూడా అధికారులతో నడుస్తుంది. రోడ్లకు ఒక కార్పోరేషన్ ఉన్నది. మూసీ నది మీద నిర్మాణాలకు ఒక కార్పోరేషన్ ఉన్నది. చెత్త ఎత్తి జవహర్ నగర్లో కుప్పగా చేసే పని ఒక ప్రైవేటు కంపెనీకి GHMC అప్పగించింది. ట్రాఫిక్ పని పోలీసులు చూసుకుంటారు. పెట్టుబడులు వంటివి మునిసిపల్ శాఖ చూస్తుంది. ఆఖరుకు, కూడలుల దగ్గర నిర్మాణాలు, గడ్డి వంటివి కూడా ఈ శాఖనే చూస్తుంది. విద్యుత్ సరఫరా ప్రత్యెక సంస్థ ఉన్నది. వీధి లైట్లు కూడా ప్రైవేటుకు అప్పగించారు. విద్య, వైద్యం గురించి GHMC ఎన్నడు పట్టించుకోలేదు. ఒకప్పుడు మునిసిపల్ స్కూళ్ళు ఉండేవి. ఇటీవల్ ఏర్పాటు చేసిన బస్తీ దవఖనాలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్నాయి. ఒకప్పుడు మునిసిపల్ మార్కెట్లు ఉండేవి. ఇప్పుడున్న హోల్ సేల్ మార్కెట్లు (పండ్లు, ఉల్లిగడ్డలు, రైతు బజార్లు, వగైరా) రాష్ట్ర మార్కెటింగ్ శాఖ పరిధిలో ఉన్నాయి. పౌర సేవలు కూడా రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్నాయి.

ఇప్పటికీ, హైదరాబాద్ నగరంలో గ్రామాలూ, మండలాలు, జిల్లాలు ఉండడం వల్ల రెవెన్యూ శాఖ పరిధి కొనసాగుతున్నది. హైదరాబాద్ కు జిల్లా కలెక్టర్ కూడా ఉన్నారు. ఇంత మంది అధికారులు, ఆధిపత్య శాఖలు, సంస్థలు, ప్రజా ప్రతినిధులు ఉండి కూడా వారి మధ్య సమన్వయము లేకపోవడం స్పష్టంగా చూడవచ్చు.

ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, హైదరాబాద్ నగరంలో ఏమి చేస్తారు? వీళ్ళ దగ్గరకు ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం లభించటం లేదు. ఒకనాడు, కూకట్ పల్లీ ఎమ్మెల్యే దగ్గరకు ప్రజలు వెళ్లి వీధి లైట్ల గురించి, మురుగు గురించి పోతే, అయన అది నా పని కాదు అని చెప్పారట. మై, నగర ఎమ్మెల్యేలు ఏమి పని చేశారు? విధాన నిర్ణయాలు గురించి అయితే శాసనసభలో గత పదేళ్ళలో హైదరాబాద్ గురించి చర్చ లేనే లేదు. తెలంగాణా ప్రభుత్వం నుంచి గొప్పలు, ప్రకటనలు, మునిసిపల్ శాఖ పని తప్పితే స్థానిక మునిసిపల్ ప్రభుత్వం పని మీద చర్చ జరుగనే లేదు.

అధికారులు, కార్పోరేషన్లు, ప్రైవేటు సంస్థల నిర్వహణలో ఉన్న ఈ హైదరాబాద్ నగరంలో, ప్రజాస్వామ్యం లేకపోవడం దురదృష్టకరం.

(Views, thoughts, and opinions expressed in this news story/article belong solely to the author)

Source: Telugupost.com 


Tags:    

Similar News