పక్కా ప్లాన్ మిస్ అయ్యిందా ...? కత్తి చుట్టూనే ..?

Update: 2018-10-25 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై పక్కా ప్లాన్ తోనే హత్యాయత్నం జరిగిందా ? అవునంటున్నారు విశ్లేషకులు. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన మాత్రం కాదని చెబుతున్నారు. కోడి పందాలకు వినియోగించే కత్తి అత్యంత ప్రమాదకరమైనది. అది గొంతు భాగంలో కానీ ఛాతి భాగంలో కానీ దిగితే ప్రాణాలు పోయేంత అవకాశాలు ఉంటాయి. సాధారణంగా వుండే కత్తి కి పది రేట్లు దీనికి పదును ఉండటం ఈ కత్తిని సులువుగా ఎయిర్ పోర్ట్ వంటి అత్యంత భద్రత కలిగిన ప్రాంతాలకు తీసుకువెళ్లడం అనేక అనుమానాలకు దారి తీస్తుందని అంటున్నారు. ఎవరో కుట్ర పూరితంగానే క్యాంటిన్ లో పనిచేసే వ్యక్తిని తమ పథక రచనలో వినియోగించారేమో అని వైసిపి శ్రేణులు భావిస్తున్నాయి. ఆకతాయిగా దాడికి పాల్పడి ఉండి ఉంటే సాధారణ కత్తులు వినియోగిస్తారని కోడిపందాల కత్తి వినియోగించారంటే ఖచ్చితంగా ఇందులో కుట్ర కోణమే అన్నది వైసిపి నమ్మకం.

నేరుగా కంఠానికే గురి ...

దాడికి పాల్పడిన యువకుడు శ్రీనివాస్ మంచినీటి బాటిల్ వెనుక కత్తి పెట్టుకుని జగన్ కి నేరుగా వచ్చాడని అతడు కత్తి దూసే సమయంలో విజయవాడ నుంచి వచ్చిన నేతను విశాఖ వైసిపి నేత పరిచయం చేసే క్రమంలో జగన్ పక్కకు తిరగడంతో ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అటాక్ మిస్ కావడంతో రెండో సారి శ్రీనివాస్ కత్తి దూసే క్రమంలో పక్కనే ఉన్న జగన్ అంగరక్షకులు అడ్డుకోవడంతో ఆయనకు ప్రాణహాని తప్పిందని అంటున్నారు. ఈ కుట్రకు ప్లాన్ చేసిన వారే ఒక లేఖను నిందితుడి జేబులో పెట్టి ఉంటారని కూడా వైసిపి అనుమానిస్తోంది. దాడి చేసి నన్ను అరెస్ట్ చేయండి చేయండి అంటూ అరవడం కూడా గమనించాలని వైసిపి నేతలు ఇదంతా ప్లాన్ లో భాగమే అంటున్నారు.

సి ఐ ఎస్ ఎఫ్ కేసు అప్పగించకుండా ...

జగన్ పై దాడి కేసులో నిందితుడిని అదుపులోనికి తీసుకున్న సి ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర పోలీసులకు అప్పగించకుండా డిజిపి చేసిన కామెంట్స్ వైసిపి శ్రేణుల్లో ఆగ్రహావేశాలు రగిలించాయి. దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమానిగా ప్రాధమిక దశలోనే భావించడం పై వైసిపి నేతల్లో మరింత కోపాన్ని తెచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ దర్యాప్తు పై తమకు నమ్మకం లేదని వైసిపి పేర్కొంటుంది. అభిమానులు కత్తులతో పొడుస్తారా పూల బొకేలు అందిస్తారా ? అంటూ బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. డిజిపి పై వైసిపి నేత మల్లా విజయ ప్రసాద్ సైతం ఇదే ఆరోపణలు చేశారు. తాను ప్రత్యక్ష సాక్షినని ఇది కుట్ర పూరిత దాడే అని పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగానే కేంద్ర ప్రభుత్వ సి ఐ ఎస్ ఎఫ్ ఈ కేసు తమ పరిధిలోనిది కాదు అంటే, రాష్ట్ర పోలీసులు వాదన మరోలా వుంది కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎయిర్ పోర్ట్ పరిధి తమకు సంబంధం లేదనడం మరో చర్చకు దారీతీస్తుంది. గతంలో ఎయిర్ పోర్ట్ లో జగన్ ను రన్ వే పై ఎందుకు రాష్ట్ర పోలీసులు ఏవిధంగా తమ పరిధి కానప్పుడు అరెస్ట్ చేశారన్న ప్రశ్నను వైసిపి సంధించడం విపక్ష నేత హత్యాయత్నం పై చర్చ మరికొంత కాలం కొనసాగేలా వుంది.

Similar News