సైకిలెక్కేస్తున్న చిత్తూరు కీలకనేత

Update: 2018-04-29 06:30 GMT

ఆంధ్రప్రదేశ్‌కు తిరుప‌తి వెంక‌టేశ్వరుడి సాక్షిగా 2014లో మోదీ ఇచ్చిన మాట‌ను ఎవ‌రూ మ‌రిచిపోలేరు. ప్రస్తుతం ఆ హామీలు నెర‌వేర్చనందుకు బీజేపీ-టీడీపీ మ‌ధ్య యుద్ధం మొద‌లైంది. సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోదీని టార్గెట్ చేయ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే! మోదీ తిరుప‌తి హామీకి సాక్ష్యంగా ఆ పార్టీకి చెందిన వారే ఎంతోమంది నిలిచారు. వారిలో తిరుప‌తి ఎంపీగా పోటీచేసిన కారుమంచి జ‌య‌రామ్ కూడా ఒక‌రు. ఇచ్చిన హామీని మోడీ నెర‌వేర్చక‌పోవ‌డంతో తీవ్రంగా మ‌న‌స్తాపానికి గురైన ఆయ‌న‌.. బీజేపీకి షాకిచ్చారు. ప్రస్తుతం ఆయ‌న టీడీపీలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వ‌రుస‌గా నాయ‌కులు పార్టీని వీడుతుండ‌టంతో ఏపీ బీజేపీ నేతల్లో ఆందోళ‌న మొద‌లైంది. చంద్రబాబు తిరుప‌తిలో చేప‌ట్టే ధ‌ర్మపోరాట దీక్షలో ఆయ‌న సైకిలెక్కేయ‌బోతున్నారు.

గడ్డుపరిస్థితులేనా....?

ఏపీ బీజేపీకి గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. భ‌విష్యత్‌లో ఇవి మ‌రింత ఎక్కువ కాబోతున్నాయ‌న్న విష‌యాన్ని విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. 2014లో కాంగ్రెస్‌కు ఎదురైన అనుభ‌వ‌మే బీజేపీకి ఎదురు కానుంద‌ని అభిప్రాయ ప‌డుతున్నారు. 2014లో ఎంతో ఉత్సాహంతో బీజేపీలో చేరిన నాయ‌కులు.. ఇప్పుడు పార్టీ నుంచి ఇత‌ర పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. వీరిలో మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ, కాట‌సాని రాంభూపాల్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండ‌గా.. ఇప్పుడు చిత్తూరు జిల్లాకు చెందిన కీల‌క నేత కారుమంచి జ‌య‌రామ్ పేరు వినిపించ‌డ‌మేగాక‌.. టీడీపీలో చేరిపోయేందుకు ఏర్పాట్లు కూడా చేసేసుకున్నారు. ఇదే సమయంలో చిత్తూరు జిల్లాలో బీజేపీ నేత కారుమంచి జయరామ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు.

బీజేపీ తరుపున పోటీ చేసి.....

2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున తిరుపతి లోకసభ స్థానానికి పోటీ చేసిన కారుమంచి జయరామ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. శనివారం సాయంత్రం కారుమంచి తన రాజీనామా పత్రాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు ఫ్యాక్స్ చేశారు. ఈ నెల 30వ తేదీన తిరుపతిలో జరిగే ధర్మపోరాట దీక్ష బహిరంగ సభలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. పోలీస్ అధికారి అయిన కారుమంచి గత సాధార‌ణ ఎన్నికల సందర్భంగా ఉద్యోగానికి రాజీనామా చేసి తిరుపతి నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. కొన్నాళ్లుగా బీజేపీ అధిష్ఠానంపై కినుకతో ఉన్నారు. ఇటీవల తన నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించి పార్టీ మార్పుపై కార్యకర్తలు, సన్నిహితుల అభిప్రాయాలు సేకరించారు. అనంతరం రాజీనామా చేశారు.

గర్వంగా భావిస్తున్నా.....

వారం రోజులుగా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని గూడురు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. అందరి అభిప్రాయాలు సేకరించారు. బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు మూడు గ్రూపులు, ఆరు ముఠాలుగా కొనసాగుతున్నాయని కారుమంచి ఆరోపించారు. నరేంద్ర మోడీ తిరుపతి ప్రకటనకు తానే ప్రత్యక్ష సాక్షిని అని, ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని తిరునామంపై వేలెత్తి చూపిస్తూ చెప్పారని, దీనికి తానే ప్రత్యక్ష సాక్షిని అన్నారు. చంద్రబాబు నిరంతరం రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమి స్తున్నారని, టీడీపీలో చేరడాన్ని గర్వంగా భావిస్తున్నానని తెలిపారు.

Similar News