సత్తి బాబు మామూలోడు కాదు.....!

Update: 2018-08-08 13:30 GMT

సాధార‌ణంగా అధికార పార్టీ ఆధిప‌త్యం ఉన్న జిల్లాలో ప్రతిప‌క్ష నాయ‌కుల హ‌వా అస్స‌లు క‌నిపించ‌దు. వాళ్లెంత సీనియ‌ర్ నాయ‌కులైనా వారి ప‌నుల విష‌యంలో జిల్లా అధికారులు కొంత జాప్యం ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటారు. కానీ విజ‌యన‌గ‌రం జిల్లాలో ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి రాజ‌కీయ‌ ప‌రిస్థితులు. ఆ జిల్లాలో ఆధిప‌త్యం టీడీపీదే అయినా.. పెత్త‌నం మాత్రం వైసీపీదే! ప్ర‌స్తుతం జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి అశోక గ‌జ‌పతిరాజు, రాష్ట్ర మంత్రి సుజ‌య కృష్ణ రంగ‌రావు ఉన్నారు. వీరికి తోడు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా గంటా శ్రీ‌నివాస‌రావు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇంత మంది సీనియ‌ర్లు ఉన్నా.. వీరి మాట చెల్లుబాటు కావ‌డం లేదు. జిల్లాపై ప‌ట్టు సాధించేందుకు వీరు నానా ఇబ్బందులు ప‌డుతుంటే.. వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ మాత్రం అధికారంలో ఉన్నా లేక‌పోయినా తన హ‌వా కొన‌సాగిస్తూనే ఉన్నారు.

సత్తిబాబు హవా.......

విజ‌య‌న‌గ‌రం జిల్లాపై త‌న ఆధిప‌త్యం పూర్తిగా త‌గ్గ‌లేద‌ని సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ.. నిరూపిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏక ఛ‌త్రాధిప‌త్యంగా జిల్లా రాజ‌కీయాల‌ను గుప్పెట్లో పెట్టుకున్న ఆయ‌న‌.. ప్ర‌తిప‌క్ష వైసీపీలో ఉన్నా.. అదే ప‌ట్టు కొన‌సాగిస్తున్నారు. అధికారం మారినా త‌న ఆధిప‌త్యానికి మాత్రం ఎలాంటి ఢోకా లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. టీడీపీ నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం కూడా బొత్స‌కు బాగా క‌లిసి వ‌స్తోంది. సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక గ‌జ‌ప‌తి రాజు.. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉండ‌టం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీపైనా ఆయ‌న నిరాశ‌క్తితో ఉన్నార‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. ఇక మంత్రి సుజ‌య కృష్ణ రంగారావు వ్య‌వ‌హారం మ‌రోదారిలో ఉంది. వీరితో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా గంటా ఉన్నా.. ఇక్క‌డి రాజ‌కీయాల‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. సుజ‌య్‌కృష్ణ‌కు, గంటాకు పొస‌గ‌దు. ఎమ్మెల్యేల్లో చాలా మంది గంటా గ్యాంగ్‌గా ఉన్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇదే జిల్లాలోని నెల్లిమ‌ర్ల నుంచి గంటా పోటీ చేస్తార‌న్న వార్త‌ల‌తో ఆయ‌న ఇక్క‌డ త‌న ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

వారి మధ్య విభేదాలే....

టీడీపీ నాయ‌కుల ఏక‌తాటిపై న‌డ‌వ‌క‌పోవ‌డంతో పాటు జిల్లా రాజ‌కీయాల‌పై సీరియ‌స్‌గా ఎవ‌రూ దృష్టిసారించ‌క‌పోవ‌డం వంటి అంశాలు బొత్స‌కు నాలుగేళ్లుగా క‌లిసొస్తున్నాయి. కాంగ్రెస్ హ‌యాంలో అధికారులు, ఇత‌ర నేత‌ల‌పై ప‌ట్టు సాధించారు బొత్స‌. ఇప్ప‌టికీ ఆ సంబంధాల‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు. జిల్లా రాజ‌కీయాలతో పాటు డీసీసీబీపైనా ఆధిప‌త్యం సంపాదించారు. డీసీసీబీ పాలకవర్గాలకు ఎన్నికలు జరపకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. జిల్లా డీసీసీబీ చైర్‌పర్సన్‌గా మరిశర్ల తులసీ వ్యవహరిస్తున్నారు. ఈమె వైసీపీ నాయకురా లు. బొత్స వర్గంలో కొనసాగుతున్నారు. దీంతో ఇక్కడ డీసీసీబీపై పూర్తి ఆధిపత్యం వైసీపీ కొనసాగిస్తోంది. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ నిర్ణయం కావడంతో అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా సీరియస్‌గా దృష్టిసారించలేకపోతున్నారు.

మంత్రులు కూడా చూసీ చూడనట్లు.....

పీఎసీఎస్‌ల వారీగా లేదా నియోజకవర్గాల వారీగా రైతుల రుణాల కోసం నిధులు కేటాయింపులు వంటి అంశాలపై ప్రత్యేకంగా కలెక్టర్‌ సమీక్షలు నిర్వహించిన పరిస్థితి లేదు. మంత్రులు కూడా డీసీసీబీ మనది కాదు అన్నట్లు విడిచి పెట్టేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక కూడా డీసీసీబీ పాలక వర్గాలకు మాత్రం ఎన్నికలు నిర్వహించలేదు. కొన్ని చోట్ల సర్పంచులు, ఎంపీటీసీలు, జిల్లా ప్రాదేశిక సభ్యులు, ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోయారు. డీసీసీబీ అధ్యక్షులు, పాలకవర్గ డైరెక్టర్లు మాత్రం వైసీపీలోనే స్థిరంగా ఉండటం గమనార్హం. అందుకే అధ్యక్షురాలు తులసిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నా అవిశ్వాస తీర్మానం పెట్టకుండా నెట్టుకువస్తున్నారు. రావివలస పీఎసీఎస్‌లో భారీగా నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించినా ఆ కేసు కోర్టులోనే మగ్గుతోంది. జిల్లాలో మిలాకత్‌ రాజకీయాల నేపథ్యంలో మనకెందుకులే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఎవరిపనులు వారు చేసుకుపోతున్నారు. ఇక ప‌దేళ్ల పాటు జిల్లాలో బొత్స మంత్రిగా చ‌క్రం తిప్ప‌డం, ఆయ‌న భార్య ఎంపీగా ఉండ‌డం, ఇటు సోద‌రుడు, మేన‌ల్లుడు ఎమ్మెల్యేలుగా ఉండ‌డంతో అధికారులు కూడా ఇప్ప‌ట‌కీ చాలా మంది బొత్స క‌నుస‌న్న‌ల్లోనే ఉంటున్నారు. ఈ ప‌రిణామాలు ఇలా ఉంటే అటు టీడీపీలో ఫైటింగ్‌లు జిల్లాలో వైసీపీ ఆధిప‌త్యం ఎలా ఉందో స్ప‌ష్టం చేస్తున్నాయి.

Similar News