సి.రామంచంద్రయ్య..కాపు సామాజికవర్గానికి చెందిన నేత. ఒకరకంగా ఆ సామాజికవర్గమే ఆయన కడప జిల్లాకు చెందిన నేత. పెద్దగా జనాదరణ నేత కాకపోయినప్పటికీ వ్యూహాలను రచించడంలో దిట్ట. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సి.రామచంద్రయ్యే కీలక పాత్ర పోషించారు. చిరంజీవికి వెన్నుదన్నుగా నిలిచారు. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ లో కొనసాగిన సీ.ఆర్ ఆ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవ్వడంతో పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
చిరంజీవితో చర్చలు జరిపిన తర్వాతే....
చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన సి.రామచంద్రయ్య సహజంగానే ఆయన సోదరుడు వపన్ కల్యాణ్ స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళతారని అందరూ ఊహించారు. జనసేన నేత మాదాసు గంగాధరంతో కూడా ఆయన చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. నాదెండ్ల మనోహర్ కూడా జనసేనలో చేరడంతో ఆ పార్టీకి ఏపీలో కొంత ఊపు వచ్చింది. సీఆర్ కూడా చేరితే మరింత బలం పెరుగుతుందని జనసేన నేతలు భావించారు. కానీ సి.రామచంద్రయ్య ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ముందు కూడా సీఆర్ చిరంజీవితో చర్చలు జరిపారు. దీంతో ఆయన జనసేనలో చేరతారనుకున్నారు.
అంచనాలను తలకిందులు చేస్తూ.....
కానీ సి.రామచంద్రయ్య అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణాలున్నాయంటున్నారు. జనసేనలో ఇప్పటికే బలమైన కోటరీ ఉంది. ఒకసారి ప్రజారాజ్యం పార్టీలో చూసిన అనుభవం రామచంద్రయ్యను వైసీపీవైపునకు మరల్చిందంటున్నారు. కడప జిల్లాకు చెందిన సీఆర్ తొలి నుంచి వైఎస్ కుటుంబంతో సఖ్యతగా లేరు. ఆ కుటుంబంతో వ్యతిరేకంగా ఉన్న పార్టీలోనే కొనసాగారు. వైఎస్ మరణం తర్వాతనే కాంగ్రెస్ లో చేరారు. అలాంటి సి.ఆర్ తీసుకున్న నిర్ణయం వైసీపీ వర్గాల్లోనూ ఆశ్చర్యం కల్గిస్తోంది.
గెలుస్తుందనేనా...?
ఇప్పటికే కడప జిల్లాకు చెందిన మైసూరారెడ్డి వైసీపీలో చేరి రాజీనామా చేసి వెళ్లిపోయారు. కడప జిల్లాలో నిజానికి కాంగ్రెస్ కు సరైన నేత లేరు. తులసీరెడ్డి లాంటి నేతలు మాత్రమే ఉన్నారు. కానీ వైసీపీ అలా కాదు. జగన్ సొంత జిల్లా కావడంతో ఆయన జిల్లా రాజకీయాల్లో ఏమాత్రం వేలు పెట్టలేరన్నది అందరికీ తెలిసిందే. కానీ సి.ఆర్ వైసీపీలో చేరడానికి ప్రధాన కారణం వచ్చే ఎన్నికలలో వైసీపీ విజయం ఖాయమని నమ్ముతుండటమేనంటున్నారు ఆయన సన్నిహితులు. ఏపీలో కాంగ్రెస్ తో టీడీపీ జత కడితే అధికార పార్టీకి తీవ్రనష్టం వాటిల్లుతుందని సీఆర్ అంచనా. తెలుగుదేశం పార్టీకి పాతకాపే కాబట్టి కాంగ్రెస్ లోనే సీఆర్ కొనసాగవచ్చు. చంద్రబాబుతో ఉన్న పరిచయాలతో మరోసారి ఎమ్మెల్సీ పదవి చేపట్టవచ్చు. అయినా సీఆర్ బయటకు వచ్చి వైసీపీలో చేరడానికి జగన్ జయం ఖాయమని నమ్మి చేరుతున్నారంటున్నారు ఆ పార్టీ నేతలు. మొత్తం మీద సీఆర్ చేరికతో కొత్తగా వచ్చే బలం ఏమీ లేకపోయినా...సామాజికవర్గం, అనుభవం ఆ పార్టీకి ఉపయోగపడతాయని మాత్రం చెప్పొచ్చు.