ప్రపంచంలోనే ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన చిత్తూరు జిల్లా తిరుపతి రాజకీయం వచ్చే ఎన్నికల వేళ ఎలా ఉంటుంది? ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో ఉన్న తిరుపతిలో తిరిగి టీడీపీ జెండా ఎగురుతుందా ? లేదా ఉప ఎన్నికల్లో గెలిచిన వైసీపీ మరో సారి సత్తా చాటుతుందా ? వచ్చే ఎన్నికల్లో తొలిసారి పోటీకి రెడీ అవుతున్న జనసేన తానేంటో నిరూపించుకుంటుందా ? అసలు తిరుపతిలో రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నాయి ? ఇక్కడ ఏ పార్టీ బలం ఎంత అన్నది తెలుగు పోస్ట్ సమీక్షలో చూద్దాం. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1994 నుంచి చూస్తే 1994లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఏ. మోహన్ విజయం సాధించారు. 1999లో చదలవాడ కృష్ణమూర్తి టీడీపీ నుంచి విజయం సాధించారు. 2004లో మున్నూరు వెంకటరమణ కాంగ్రెస్ నుంచి గెలవగా, 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఇక్కడ నుంచి విజయం సాధించారు.
టీడీపీకి అనుకూలంగా....
2012 ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన భూమన కరుణాకర్ రెడ్డి విజయం సాధించగా 2014లో మరో సారి టీడీపీ నుంచి పోటీ చేసిన మున్నూరు వెంకటరమణ విజయం సాధించారు. 2014లో భారీ మెజారిటీతో గెలిచిన వెంకటరమణ ఆకస్మిక మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య మున్నూరు సుగుణమ్మ లక్ష పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. తిరుపతికి ఆరేళ్లలో ఓ సాధారణ ఎన్నికతో కలుపుకుని రెండు ఉప ఎన్నికలు జరిగాయి. 2012లో చిరంజీవి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యడంతో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా... 2014లో గెలిచిన మున్నూరు వెంకటరమణ ఆకస్మిక మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య సుగుణమ్మ గెలిచారు.
రెన్యువల్ చేయకపోవడంతో....
నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే నిన్నటి వరకు టీడీపీలో ఉన్న టీటీడీ మాజీ చైర్మెన్ చదలవాడ కృష్ణమూర్తి జనసేనలోకి జంప్ చేసేశారు. తిరుపతి నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువ. సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు చదలవాడ ఈ సామాజికవర్గానికి చెందిన వారే. అయితే ఇప్పుడు నిన్నటి వరకు టీడీపీలో బలమైన నాయకుడిగా ఉన్న చెదలవాడ జనసేనలోకి జంప్ చెయ్యడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఆయనే ఇక్కడ నుంచి జనసేన తరపున పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. తన టీటీడీ చైర్మెన్ పదవి రెన్యువల్ చెయ్యాలని చదలవాడ పదే పదే చంద్రబాబును కోరినా చంద్రబాబు ఆయన పట్టించుకోలేదు. ఈ క్రమంలో అప్పటి వరకు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసిన చదలవాడ పార్టీ కండువా మార్చేశారు.
వైసీపీకి ఎడ్జ్ ఉంటుందని.....
వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి సుగుణమ్మే పోటీ చేస్తారా? లేదా అభ్యర్థిని మారుస్తారా ? అన్నది చూడాల్సి ఉంది. టీడీపీ నుంచి సుగుణమ్మ పోటీ చేసిన లేదా కాపు సామాజికవర్గానికి చెందిన ఎవరైనా రంగంలో ఉన్నా ఇటు జనసేన నుంచి అదే సామాజికవర్గానికి చెందిన చదలవాడ రంగంలో ఉండి... వైసీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేస్తే మూడు పార్టీల మధ్య తిరుపతి వెంకన్న సాక్షిగా హోరా హోరు పోరు తప్పదు. అయితే సామాజిక సమీకరణలు బేరీజు వేసుకుంటే ట్రైయాంగిల్ ఫైట్‌లో ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉంటుందని కూడా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి తిరుపతి వెంకన్న సాక్షిగా ఏ పార్టీ జెండా ఎగురుతుందో ఎన్నికల్లోనే చూడాల్సి ఉంది.