తెలంగాణ ఎన్నికల్లో భాగ్యనగర్ లో టిడిపికి ఒక్క సీటు దక్కకుండా టీఆర్ఎస్ తో కలిసి నడిచిన ఎంఐఎం తాజాగా ఏపీలో కూడా భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎంఐఎం అధినేత అసద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టిడిపి లో కలవరానికి కారణం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సాఆర్ పార్టీకి పూర్తి అండ దండ అందిస్తానని అసద్ చేసిన ప్రకటన సంచలనం గా మారింది. దాంతో టిడిపి ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. మైనారిటీ నాయకుడు మంత్రి ఫరూక్ చేత అసద్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇప్పించింది. ముస్లిం మైనారిటీల అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్నంతగా ఏ ఒక్కరు చేయడం లేదంటూ ఫరూక్ ఎదురుదాడికి దిగారు.
కీలకమైన మైనారిటీ ఓట్లు ...
బిజెపి తో తెగతెంపులు చేసుకున్న వెంటనే టిడిపి వాయిస్ మారిపోయింది. వైసిపి ప్రధాన ఓటు బ్యాంక్ ల్లో ఒకటైన ముస్లిం మైనారిటీలపై కన్నేసింది. నాలుగున్నరేళ్లపాటు దూరం పెట్టిన మైనారిటీలను అక్కున చేర్చుకుంది. మంత్రి వర్గ విస్తరణలో కూడా చోటు కల్పించింది. మసీదుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. మైనారిటీల సంక్షేమానికి నడుం కట్టింది. ఇలా గత కొంత కాలంగా పద్ధతి ప్రకారం వైసిపి ఓటు బ్యాంక్ కి చిల్లు పెడుతూ వస్తుంది టిడిపి. ఇది వైసిపిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నా చేసేది ఏంలేక అధికారపార్టీ తో తలపడుతూ వస్తుంది.
అసద్ ప్రకటనతో వైసిపి లో జోష్ ...
ఎంఐఎం అధినేతగా అసద్ వైసిపికే తమ మద్దతు అని చేసిన ప్రకటన ఎపి రాజకీయాల్లో ప్రకంపనలు సృస్ట్టించేదే. తటస్థంగా వున్న మైనారిటీలు తో పాటు టిడిపి లో వుండే మైనారిటీ ఓటు బ్యాంక్ పై ఆయన వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా పడనుంది. దాంతో గత ఎన్నికల్లో వైసిపి కి పోల్ అయిన మైనారిటీ ఓటు బ్యాంక్ అసద్ మద్దతుతో జగన్ కు చెదరకుండా ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు మంచి జోష్ లో వున్నారు. ఇప్పటికే మైనారిటీ, ఎస్సి ఎస్టీ వర్గాల ఓట్లపై కన్నేసిన టిడిపి ఆశలపై అసద్ వ్యాఖ్యలు నీళ్ళు చల్లడంతో వచ్చే రోజుల్లో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.