బాబు వ్యూహం ఫలించే సిగ్నల్స్....??

Update: 2018-11-27 06:30 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. ఓడ‌లు బ‌ళ్లు.. బ‌ళ్లు ఓడ‌లు కావ‌డం స‌హ‌జం. నాయ‌కులు ఎన్నో ఊహించుకున్నా.. ప్ర‌జ‌ల వేలి కొస‌లు చెప్పే జాత‌కాలకు నిబద్ధులై ఉండాల్సి ఉంటుంది. అయితే, కొంద‌రు మాత్రం కొన్ని విష‌యాల‌ను ఏమార్చి.. అస‌లు విష‌యాల‌ను ప‌క్క దారి ప‌ట్టించి, మ‌రీ రాజ‌కీయాలు చేసేందుకు రెడీ అవుతుంటారు. ఇలాంటి ప‌రిస్థితే.. ఇప్పుడు తెలంగాణాలో క‌నిపిస్తోంది. ఇక్క‌డ నుంచి తిరిగి గెలిచి అధికారంలోకి రావాల‌ని తాజా మాజీ సీఎం కేసీఆర్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. నిజానికి ఆయ‌న‌కు మ‌రో ఆరు మాసాల పాల‌నా గ‌డువు ఉండ‌గానే ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసుకుని ముంద‌స్తుకు వెళ్లారు. అయితే, ఆయ‌న‌కు త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసుకునే స‌మ‌యంలో ఉన్న ద‌మ్ము, ధైర్యం, ధీమా వంటివి ఇప్పుడు మ‌చ్చ‌కైనా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప్ర‌త్య‌ర్థిపార్టీల నాయ‌కుల‌తో పాటు వార్త‌ల విశ్లేష‌కులు.

ఆఫ్ ది రికార్డుగా.....

క‌నీసం త‌మ‌కు 100 సీట్లు వ‌స్తాయ‌ని ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన స‌మ‌యంలో కేసీఆర్ వెల్ల‌డించారు. అయితే, ఇది ఎన్నిక‌ల‌కు స‌మయం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ స‌న్న‌గిల్లుతోంది. ఆంత‌రంగిక చ‌ర్చ‌ల్లో.. కేకే.. నాయిని.. హ‌రీష్ రావు.. వంటి దిగ్గ‌జాల‌తో చ‌ర్చిస్తున్న స‌మ‌యంలో క‌నీసం మ‌న‌కు 80 వ‌స్తాయా? అని కేసీఆర్ ప్ర‌శ్నించ‌డం అంద‌రినీ నిర్ఘాంత‌పోయేలా చేసింద‌ని ఆఫ్ దిరికార్డుగా తెలంగాణా భ‌వ‌న్ నుంచి వ‌చ్చిన సంచ‌ల‌న విష‌యం. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ప్రజాకూట‌మి ఏర్ప‌డ‌మే! అంతేకాదు, ఈ కూట‌మికి తెర‌చాటున క‌ర్త క‌ర్మ‌, క్రియ అన్నీ కూడా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు కావడ‌మే! నిజానికి ఓటు నోటు కేసు స‌హా వివిధ అంశాల్లో కేసీఆర్‌-చంద్ర‌బాబుల మ‌ధ్య తీవ్ర మైన ఫైట్ జ‌రుగుతోంది. అంతేకాదు... 2014లో త‌న పార్టీ గుర్తుపై గెలిచిన కీల‌క నాయ‌కులును కేసీఆర్ త‌న కారెక్కించుకున్నార‌ని చంద్ర‌బాబు ర‌గిలిపోతున్నారు.

వాళ్లు తీసుకొస్తున్నారంటూ.....

ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌కు త‌గిన విధంగా గుణ‌పాఠం చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, తాను ఒంట‌రిగా ఏమీ చేయ‌లేన‌ని గుర్తించిన చంద్ర‌బాబు.. వ్యూహాత్మ‌కంగా త‌మ కు ఆగ‌ర్భ శ‌త్రు పార్టీ అయినా కూడా.. కాంగ్రెస్‌తో చేతులు క‌లిపారు. మొద‌ట్లో దీనిని ఊహించ‌ని కేసీఆర్‌.. ఇప్పుడు ఇది త‌న‌కు ఎర్త్ పెడుతుంద‌ని స‌ర్వే నివేదిక‌లు వెల్ల‌డిస్తుండ‌డంతో త‌ల్ల‌డిల్లిపోతున్నారు. అంతేకాదు, అస‌లు ప్రత్య‌ర్ధి అయిన కాంగ్రెస్ పార్టీ కంటే కేవ‌లం 14 సీట్లు పోటీ చేసే టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కేసీఆర్‌ను ఎలాగైనా గ‌ద్దె దింపాల‌ని క‌సితో ఉన్న టీడీపీ వాళ్లు చివ‌ర‌కు 12 సీట్ల‌లోనే పోటీకి రెడీ అయ్యారు. కేసీఆర్ ఇప్పుడు త‌న ప్ర‌తిస‌భ‌లోనే చంద్ర‌బాబు పేరు ప్ర‌స్తావించి విమ‌ర్శ‌లు చేయ‌కుండా ఉండ‌డం లేదు. అదే 94 సీట్ల‌లో బ‌రిలో నిలిచిన కాంగ్రెస్ ను కాకుండా..కాంగ్రెస్ ద్వారా చంద్ర‌బాబు తెలంగాణ‌లోకి వ‌స్తున్నార‌ని..ఆయ‌న‌ను తాను ఒక‌సారి (ఓటుకు నోటు కేసులో) తెలంగాణా నుంచి తరిమి కొట్టాన‌ని, కానీ, ఇప్పుడు మ‌ళ్లీ కాంగ్రెస్‌తో క‌లిసి వ‌స్తున్నాడ‌ని, ఇప్పుడు త‌మిరి కొట్టే బాధ్య‌త మీదేన‌ని కేసీఆర్ పిలుపు నిస్తున్నారు.

బాబే నడిపిస్తున్నాడని......

ఈ క్ర‌మంలో ఆయ‌న కాంగ్రెస్‌ను త‌క్కువ‌గా .. బాబును ఎక్కువ‌గా టార్గెట్ చేస్తున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. కాంగ్రెస‌ను ప‌రోక్షంగా బాబే న‌డిపిస్తున్నార‌నేది కేసీఆర్ భావ‌న‌గా క‌నిపిస్తోంది. త‌న గెలుపును బాబు శాసిస్తున్నాడ‌ని కూడా కేసీఆర్ వాపోతున్నారు. మొత్తానికి ఈ పరిణామమే ఆయ‌న‌ను ఇప్పుడు నిద్ర‌కు కూడా దూరం చేసింద‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు. మ‌రి రాబోయే రోజుల్లో చంద్ర‌బాబు.. కాంగ్రెస్ అధినేత రాహుల్‌తో కలిసి.. రోడ్ షోకు కూడా రెడీ అవుతున్నారు. దీంతో ఈ పోరు మ‌రింత తీవ్ర‌మయ్యేలా ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Similar News