కాంగ్రెస్ కు వార్నింగ్ బెల్స్...!!

Update: 2018-11-13 11:00 GMT

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా మహాకూటమి పార్టీలతో పాటు స్వపక్షంలోనూ మంటలు రేపుతోంది. టిక్కెట్లు దక్కని నేతలు పార్టీపై అసమ్మతి బావుటా ఎగరవేస్తున్నారు. రెబల్స్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థులపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. అనేక ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తుంటే తమకు కాకుండా పారాచ్యూట్ తో వచ్చిన నేతలకు టిక్కెట్లు ఇచ్చారని మండిపడుతున్నారు. ఇక కూటమిలోని ఇతర పార్టీల్లోనూ కాంగ్రెస్ లిస్ట్ పట్ల అసంతృప్తి ఉంది. ముఖ్యంగా సీపీఐ ఆశించిన కొత్తగూడెం, మునుగోడు, ఆలేరు వంటి స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక కూటమిలో ఉంటుందనుకున్న ఇంటి పార్టీ ఆశించిన నకిరేకల్, మునుగోడు స్థానాలకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది.

స్వతంత్రంగా బరిలో నిలిచేందుకు...

చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టిక్కెట్ కోసం ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున టిక్కెట్లు ఆశించారు. వారంత చివరి క్షణం వరకు టిక్కెట్ల కోసం ప్రయత్నించారు. టిక్కెట్లు దక్కని నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారంతా ఇవాళ ఉదయం నుంచే అనుచరులు, కార్యకర్తలతో మంతనాలు జరుపుతున్నారు. వీరిలో చాలా మంది ఇండిపెండెంట్లుగా పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. మరికొందరు బీజేపీలోకి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. మరికొందరు మాత్రం బీఎస్పీ టిక్కెట్ పై పోటీ చేయాలని భావిస్తున్నారు. తమకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందంటున్న వీరు రెబల్ గా పోటీ చేసి పార్టీ అభ్యర్థిని ఓడిస్తామంటున్నారు.

పోటీకి సిద్ధమవుతున్న రెబల్స్...

మంచిర్యాల స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఆశించారు. టిక్కెట్ ప్రేమ్ సాగర్ రావుకు ఖరారు కావడంతో అరవింద్ రెడ్డి బీజేపీ లేదా బీఎస్పీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక వరంగల్ పశ్చిమ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించడంపై డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. శేరిలింగంపల్లిలోనూ బిక్షపతి యాదవ్ కాంగ్రెస్ టిక్కెట్ ఆశించగా టీడీపీకి ఇవ్వడంతో ఆయన కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటున్నారు. ఇక కంటోన్మెంట్ స్థానాన్ని క్రిషాంక్ ఆశించగా ఆయన మామ సర్వే సత్యనారాయణకు టిక్కెట్ దక్కింది. దీంతో ఆయన పార్టీ పట్ల తీవ్ర అసమ్మతితో ఉన్నారు. పెద్దపల్లి స్థానాన్ని విజయరామారావుకు కేటాయించగా మరో ఆశావహుడు, ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అసంతృప్తితో ఉన్నారు. ఆయన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఇక తాండూరు టిక్కెట్ ను పైలట్ రోహిత్ రెడ్డికి ఇవ్వడంతో ఆగ్రహంతో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. చొప్పదండి స్థానాన్ని మేడిపల్లి సత్యంకి ఇవ్వడంతో సుద్దాల దేవయ్య అసంతృప్తితో ఉన్నారు. సూర్యాపేట టిక్కెట్ ఆశించి భంగపడ్డ రేవంత్ వర్గం నేత పటేల్ రమేష్ రెడ్డి కూడా ఇదే బాటలో ఉన్నారు.

కూటమి పార్టీల్లోనూ...

కాంగ్రెస్ లిస్టుతో మహాకూటమిలోని తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జన సమితిలోనూ చిచ్చు రేగేలా కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ స్థానాన్ని టీడీపీ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్ ఆశించారు. ఈ సీటును కాంగ్రెస్ నుంచి పద్మావతికి కేటాయించడంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక కుత్బుల్లాపూర్ స్థానాన్ని కాంగ్రెస్ కి వదిలేయడంపై టీడీపీ నేత హనుమంతరావు తన అనుచరులతో ఆందోళనకు దిగారు. ఆలేరు నుంచి కల్లూరి రామచంద్రారెడ్డి టీజేఎస్ టిక్కెట్ ఆశించారు. ఈ స్థానాన్ని కాంగ్రెస్ తీసుకుంది. దోంత ఆయన ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. మొత్తానికి కనీసం 10 స్థానాల్లో మహాకూటమికి రెబల్స్ బెడద ఉండేలా కనిపిస్తోంది.

Similar News